సాక్షి, కడప : బాణసంచా గోడౌన్లు, షాపులపై విజిలెన్స్ కొరఢా ఝుళిపిస్తోంది. ఆకస్మికంగా దాడులు చేస్తూ స్టాకువారీగా డాక్యుమెంట్స్ ఉన్నాయా? లేదా? అని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీంతోపాటు వీటికి బిల్లులు ఉన్నాయా.. పన్ను చెల్లించారా..లేదా అనే దానిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మూడు రోజులుగా విజిలెన్స్ డీఎస్పీ రామకృష్ణ నేతృత్వంలో ముగ్గురు సీఐలు పుల్లయ్య, ఓబులేసు, శ్రీధర్‌నాయుడుతోపాటు డీసీటీఓలు సత్యం, తులసీరాం, ఏఓ శశిధర్‌రెడ్డి, ఇంకా సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా వీరబల్లి, రాజంపేట, చిన్నమండెం ప్రాంతాల్లో ఈ దాడులు సాగాయి.
లక్షల్లో సరుకు....
వీరబల్లిలో రెండు గోడౌన్లలో ఒక గోడౌన్‌లో రూ. 10 లక్షలు,మరో గోడౌన్‌లో రూ. 40 లక్షలు, చిన్నమండెంలో కోట్లాది రూపాయల సరుకు నిల్వలు ఉన్నట్లు కనుగొన్నారు. వీటిలో విజిలెన్స్ సిబ్బంది స్టాకువారీ డాక్యుమెంట్లను పరిశీలించి వాటికి పన్ను చెల్లిస్తున్నారా..లేదా...అనే విషయమై ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా గోడౌన్లకు లెసైన్సులు ఉన్నప్పటికీ సరుకులకు సంబంధించిన బిల్లులు, పన్ను వివరాలు లేనట్లు తెలుస్తోంది. దీంతో కమర్షియల్ ట్యాక్స్ వారు వేసే అపరాధ రుసుము కంటే విజిలెన్స్ శాఖ మూడు రెట్లు అధికంగా వసూలు చేసే అవకాశం ఉంది. దీంతో అధిక మొత్తంలో సొమ్ము అపరాధ రుసుము రూపంలో ప్రభుత్వ ఖాతాలో జమకానుంది.
చిన్నమండెంలో దాడులు
చిన్నమండెంలో ఉన్న బాణసంచా గోడౌన్‌పై విజిలెన్స్ బృందం బుధవారం దాడులు నిర్వహించింది. అక్కడ నిల్వ ఉన్న బాణసంచాకు సంబంధించి స్టాక్ వివరాలను రాత్రి పొద్దుపోయే వరకు నమోదు చేశారు. స్టాక్‌వారీ డాక్యుమెంట్లకు పన్ను చెల్లింపుల్లో భారీ తేడాలున్నట్లు తెలుస్తోంది. దాడుల్లో సీఐలు ఓబులేసు, పుల్లయ్య, శ్రీధర్‌నాయుడు, డీసీటీఓ సత్యంతోపాటు ఏఓ శశిధర్ పాల్గొన్నారు.
బాణసంచా విక్రయాలపై విజి‘లెన్స్’
Published Thu, Oct 31 2013 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 12:08 AM
Advertisement
Advertisement