
తాడేపల్లిగూడెంలో కాల్పుల కలకలం
- ఇంట్లోకి చొరబడి కాల్పులు జరిపిన యువకుడు
- ఇంటి యజమాని అప్రమత్తతతో ఉడాయింపు
- పోలీసులకు దొరికిన తుపాకీ
తాడేపల్లిగూడెం : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని ఏడో వార్డు చిన ఆంజనేయస్వామి గుడికి సమీపంలో ఉన్న వీధిలో మంగళవారం రాత్రి జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న రిటైర్డు లెక్చరర్ కానూరి స్వామి ఇంట్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్వామి కుమారుడు శ్రీనివాసు భోజనం చేయడానికి తన అక్క విజయలక్ష్మి పిలవడంతో ఇంటి బయట ఉన్న గోళెం వద్దకు చేతులు కడుక్కొనేందుకు వచ్చాడు. ఈ సమయంలో ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్న అరటిచెట్లు, నుయ్యి వెనుక ఉన్న ప్రహరీగోడపై నుంచి సుమారు 30 ఏళ్ల వయస్సు ఉన్న యువకుడు దూకి రావడం గమనించాడు. దీంతో ఎవరు నువ్వంటూ ఆ యువకుని పట్టుకొనే క్రమంలో నా దగ్గర తుపాకీ ఉంది. దగ్గరకు రాకు అని , యువకుని చేతిలోని తుపాకీని నేలపై పేల్చినట్టు ప్రత్యక్ష సాక్షి శ్రీనివాసు చెబుతున్నాడు. మూడు రౌండ్లు తుపాకీతో నేలపై కాల్చిన తర్వాత ఆ యువకుని పట్టుకొనేందుకు తిరిగి ప్రయత్నం చేశానని చెబుతున్నాడు, ఈ శబ్దం విని పక్కన గదిలో టీవీ చూస్తున్న శ్రీనివాసు అక్క బయటకు వచ్చిందని చెప్పాడు.
అక్కడి నివాసితులు ఒక యువకుడు లోనికి గోడదూకి వెళ్లిన సమయంలో ఇద్దరు యువకులు బయట కాపలాగా ఉన్నారని, ఒరే తొందరగా రా అంటూ స్పష్టమైన తెలుగులో మాట్లాడరంటున్నారు. సమాచారం తెలుసుకున్న రూరల్ సీఐ గుమ్మళ్ల మధుబాబు, పట్టణ ఎస్‌ఐలు ఎస్‌సీహెచ్, కొండలరావు, భగవాన్‌లు ఘటనా స్దలానికి చేరుకున్నారు. సంఘటనా స్దలంలో ప్లోరింగ్‌పై ఉన్న తుపాకీ బుల్లెట్ల గుర్తులను పరిశీలించారు. అక్కడే యువకుడి వదిలేసినట్టుగా చెబుతున్న నాటు తుపాకీని , రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు, మరో బుల్లెట్ కోసం వెదుకుతున్నారు. ఇది కంట్రీమేడ్ గన్ అని సీఐ మధుబాబు చెబుతున్నారు. కంట్రీమేడ్ గన్ నుంచి ఇత్తడి బుల్లెట్లు ఎలా బయటకు వచ్చాయి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ తుపాకీని పరీక్షించే ప్రయత్నం సీఐ చేశారు. బొమ్మ తుపాకీలో రాళ్లు పెట్టి పేల్చిన సమయంలో వచ్చే శబ్దం మాత్రం వచ్చింది. ప్రత్యక్ష సాక్షులు మాత్రం గ్యాస్ సిలిండర్ పేలిన శబ్దం వచ్చిందంటున్నారు . ఘటనా స్దలంలో లభించిన తుపాకీ కాకుండా దుండగులు వేరే తుపాకీని వాడారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.