ఆ ఐదు సంఘాలకు ఓటు హక్కు లేనట్లే! | Fisheries Cooperative Association Elections In Srikakulam | Sakshi
Sakshi News home page

ఆ ఐదు సంఘాలకు ఓటు హక్కు లేనట్లే!

Published Sun, Jun 30 2019 11:41 AM | Last Updated on Sun, Jun 30 2019 11:41 AM

Fisheries Cooperative Association Elections In Srikakulam - Sakshi

జిల్లా మత్స్యశాఖ కార్యాలయం ఇదే..

సాక్షి, అరసవల్లి (శ్రీకాకుళం): జిల్లా మత్స్యకార సహకార సంఘ (డీఎఫ్‌సీఎస్‌) ఎన్నికల నేపథ్యంలో ప్రాథమిక ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఓ ఐదు సహకార సంఘాల సభ్యులను ఓటర్లుగా గుర్తింపునకు నిరాకరించడంతో పరిస్థితులు మరింత ఘాటెక్కాయి. ఓటర్ల జాబితాలో తమ వర్గం సభ్యులు లేకపోతే గెలుపుపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలు కీలక సంఘాల్లో అంతర్గత విభేదాలు రాజుకున్నాయి. అధ్యక్షుడు, డైరెక్టర్ల మధ్య ఆధిపత్య పోరుపై ఫిర్యాదులు, అక్రమాల ఆరోపణల పరంపరతో వాటిల్లో చీలికలు మొదలయ్యాయి.

జూలై 19న జిల్లా మత్స్యకార సహకార సంఘ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జగన్నాథపురం స్వదేశీ మత్స్యకార సహకార సంఘం, సరసనాపల్లి ఎస్టీ సంఘం, సరసనాపల్లి బీసీ సంఘం, దిగువకొలువరాయి ఎస్టీ సంఘం, లోకొత్తవలస ఎస్టీ సంఘాలను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు అధికారులు అంగీకరించలేదు. ఈ విషయమై మత్స్యకార సంఘ నేతల్లో చర్చలకు దారితీసింది. ఇదిలావుంటే ఈ ఏడాది మార్చితో డీఎఫ్‌సీఎస్‌ పాలక వర్గం పదవీకాలం పూర్తికావడంతో పర్సన్‌ ఇన్‌చార్జిగా పలాస మత్స్యశాఖ సహాయ సంచాలకుడు పీవీ శ్రీనివాసరావుకు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే తాజా ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం మొత్తం 134 మందితో కూడిన ప్రాథమిక ఓటర్ల జాబితాను డీఎఫ్‌సీఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జి శ్రీనివాసరావు సిద్ధం చేసి, ఈ జాబితాను డీఎఫ్‌సీఎస్‌ ఎన్నికల అధికారి డబ్బీరు గోపికృష్ణకు ఇటీవలే అందజేశారు.

ఎన్నికల షెడ్యూల్‌ ఇదే..
ఈ నెల 28న వచ్చిన అభ్యంతరాలను స్వీకరించడం
 పరిశీలన అనంతరం జూలై 4న తుది జాబితాను ప్రకటించడం
► తర్వాత ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల
► అనంతరం జూలై 19న డైరెక్టర్ల స్థానాలకు నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ
► అనంతరం అదే రోజు డీఎఫ్‌సీఎస్‌ ఎన్నిక, తర్వాత ఫలితాల వెల్లడి

ఐదు సంఘాలకు అర్హత లేదు
ప్రాథమిక ఓటర్ల జాబితాపై తాజా మాజీ డీఎఫ్‌సీఎస్‌ అధ్యక్షుడు మైలపల్లి నర్సింగరావుతోపాటు పలువురు సంఘ నేతలు పలు అభ్యంతరాలను లేవనెత్తారు. జిల్లాలో కీలకమైన ఓ ఐదు మత్స్యకార సహకార సంఘాలను ఓటర్ల జాబితాలో చేర్చాలంటూ తాజా మాజీ డీఎఫ్‌సీఎస్‌ అధ్యక్షుడు అర్జీ పెట్టుకున్నాడు. జగన్నాథపురం స్వదేశీ మత్స్యకార సహకార సంఘం, సరసనాపల్లి ఎస్టీ సంఘం, సరసనాపల్లి బీసీ సంఘం, దిగువకొలువరాయి ఎస్టీ సంఘం, లోకొత్తవలస ఎస్టీ సంఘాలను పరిశీలించి, ఓటర్ల జాబితాలో చేర్చే అవకాశమే లేదని పర్సన్‌ ఇన్‌చార్జి శ్రీనివాసరావు తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఏపీ కో ఆపరేటివ్‌ సొసైటీ చట్టం – 1964 రూల్‌ నెంబర్‌ 18(సీ) ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల తేదీకి కనీసం 30 రోజుల ముందుగా సభ్యత్వం నమోదు కావాలి.

షేర్‌ క్యాపిటల్‌ జమ చేయబడిన సంఘాలనే ఓటర్లుగా గుర్తిస్తారు. అయితే పై ఐదు సంఘాల షేర్‌ క్యాపిటల్‌ కేవలం ఎన్నికల నోటిఫికేషన్‌ తేదీ అంటే జూన్‌ 10 నాటికి నాలుగు రోజు ముందే సభ్యత్వం నమోదై ఉంది. దీంతో వచ్చే నెల 19న జరగనున్న డీఎఫ్‌సీఎస్‌ ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో నమోదు చేయడానికి అర్హత లేకుండా పోయింది. ఈ మేరకు అధికారులే ధ్రువీకరిస్తున్నారు. ఇదిలావుంటే దీనిపై ఇప్పుడు తాజా మాజీ అధ్యక్షుడు, డైరెక్టర్లలో కొందరు మల్ల్లగుల్లాలు పడుతున్నారు. ఓటర్ల జాబితాలో తమ వర్గం సభ్యులు లేకపోతే పరిస్థితి ఏంటనే ఆలోచనల్లో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement