Fisheries Cooperative Association elections
-
ఆ ఐదు సంఘాలకు ఓటు హక్కు లేనట్లే!
సాక్షి, అరసవల్లి (శ్రీకాకుళం): జిల్లా మత్స్యకార సహకార సంఘ (డీఎఫ్‌సీఎస్) ఎన్నికల నేపథ్యంలో ప్రాథమిక ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఓ ఐదు సహకార సంఘాల సభ్యులను ఓటర్లుగా గుర్తింపునకు నిరాకరించడంతో పరిస్థితులు మరింత ఘాటెక్కాయి. ఓటర్ల జాబితాలో తమ వర్గం సభ్యులు లేకపోతే గెలుపుపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలు కీలక సంఘాల్లో అంతర్గత విభేదాలు రాజుకున్నాయి. అధ్యక్షుడు, డైరెక్టర్ల మధ్య ఆధిపత్య పోరుపై ఫిర్యాదులు, అక్రమాల ఆరోపణల పరంపరతో వాటిల్లో చీలికలు మొదలయ్యాయి. జూలై 19న జిల్లా మత్స్యకార సహకార సంఘ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జగన్నాథపురం స్వదేశీ మత్స్యకార సహకార సంఘం, సరసనాపల్లి ఎస్టీ సంఘం, సరసనాపల్లి బీసీ సంఘం, దిగువకొలువరాయి ఎస్టీ సంఘం, లోకొత్తవలస ఎస్టీ సంఘాలను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు అధికారులు అంగీకరించలేదు. ఈ విషయమై మత్స్యకార సంఘ నేతల్లో చర్చలకు దారితీసింది. ఇదిలావుంటే ఈ ఏడాది మార్చితో డీఎఫ్‌సీఎస్ పాలక వర్గం పదవీకాలం పూర్తికావడంతో పర్సన్ ఇన్చార్జిగా పలాస మత్స్యశాఖ సహాయ సంచాలకుడు పీవీ శ్రీనివాసరావుకు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే తాజా ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మొత్తం 134 మందితో కూడిన ప్రాథమిక ఓటర్ల జాబితాను డీఎఫ్‌సీఎస్ పర్సన్ ఇన్చార్జి శ్రీనివాసరావు సిద్ధం చేసి, ఈ జాబితాను డీఎఫ్‌సీఎస్ ఎన్నికల అధికారి డబ్బీరు గోపికృష్ణకు ఇటీవలే అందజేశారు. ఎన్నికల షెడ్యూల్ ఇదే.. ► ఈ నెల 28న వచ్చిన అభ్యంతరాలను స్వీకరించడం ► పరిశీలన అనంతరం జూలై 4న తుది జాబితాను ప్రకటించడం ► తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ► అనంతరం జూలై 19న డైరెక్టర్ల స్థానాలకు నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ► అనంతరం అదే రోజు డీఎఫ్‌సీఎస్ ఎన్నిక, తర్వాత ఫలితాల వెల్లడి ఐదు సంఘాలకు అర్హత లేదు ప్రాథమిక ఓటర్ల జాబితాపై తాజా మాజీ డీఎఫ్‌సీఎస్ అధ్యక్షుడు మైలపల్లి నర్సింగరావుతోపాటు పలువురు సంఘ నేతలు పలు అభ్యంతరాలను లేవనెత్తారు. జిల్లాలో కీలకమైన ఓ ఐదు మత్స్యకార సహకార సంఘాలను ఓటర్ల జాబితాలో చేర్చాలంటూ తాజా మాజీ డీఎఫ్‌సీఎస్ అధ్యక్షుడు అర్జీ పెట్టుకున్నాడు. జగన్నాథపురం స్వదేశీ మత్స్యకార సహకార సంఘం, సరసనాపల్లి ఎస్టీ సంఘం, సరసనాపల్లి బీసీ సంఘం, దిగువకొలువరాయి ఎస్టీ సంఘం, లోకొత్తవలస ఎస్టీ సంఘాలను పరిశీలించి, ఓటర్ల జాబితాలో చేర్చే అవకాశమే లేదని పర్సన్ ఇన్చార్జి శ్రీనివాసరావు తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఏపీ కో ఆపరేటివ్ సొసైటీ చట్టం – 1964 రూల్ నెంబర్ 18(సీ) ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తేదీకి కనీసం 30 రోజుల ముందుగా సభ్యత్వం నమోదు కావాలి. షేర్ క్యాపిటల్ జమ చేయబడిన సంఘాలనే ఓటర్లుగా గుర్తిస్తారు. అయితే పై ఐదు సంఘాల షేర్ క్యాపిటల్ కేవలం ఎన్నికల నోటిఫికేషన్ తేదీ అంటే జూన్ 10 నాటికి నాలుగు రోజు ముందే సభ్యత్వం నమోదై ఉంది. దీంతో వచ్చే నెల 19న జరగనున్న డీఎఫ్‌సీఎస్ ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో నమోదు చేయడానికి అర్హత లేకుండా పోయింది. ఈ మేరకు అధికారులే ధ్రువీకరిస్తున్నారు. ఇదిలావుంటే దీనిపై ఇప్పుడు తాజా మాజీ అధ్యక్షుడు, డైరెక్టర్లలో కొందరు మల్ల్లగుల్లాలు పడుతున్నారు. ఓటర్ల జాబితాలో తమ వర్గం సభ్యులు లేకపోతే పరిస్థితి ఏంటనే ఆలోచనల్లో ఉన్నారు. -
నువ్వా.. నేనా!
మత్స్యశాఖ సహకార సంఘం జిల్లా ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. పోటీ ముఖాముఖి కావడంతో నువ్వా..నేనా అన్నట్టుగా ఎవరికి వారు జోరుగా ప్రచారాన్ని సాగించి ముగించారు. మాజీలు తిరిగి చైర్మన్ పదవిని ఆశిస్తూ రెండు ప్యానళ్లుగా ఏర్పడ్డారు. తమ మద్దతుదారులతో శిబిరాలను నిర్వహిస్తూ గెలుపే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. రసవత్తర పోరు ⇒ నేడు మత్స్యశాఖ సహకార సంఘం ఎన్నికలు ⇒ 11 డెరైక్టర్ల పదవులకు బరిలో 22 మంది ⇒ చైర్మన్ రేసులో బాల్‌నర్సయ్య, నర్సింలు ⇒ మాజీల మధ్యే ప్రధాన పోటీ ⇒ శిబిరాల్లో మద్దతుదారులు ⇒ నేరుగా పోలింగ్ బూత్‌లకు వచ్చేలా ప్రణాళికలు మెదక్: జిల్లా మత్స్య శాఖ సహకార సంఘం ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. పోటీ తీవ్రంగా ఉండడంతో చైర్మన్ అభ్యర్థులు తమ మద్దతుదారులను శిబిరాలకు తరలించారు. క్యాంపులకు వెళ్లిన వారంతా బుధవారం జరిగే పోలింగ్‌కు నేరుగా రానున్నారు. మెదక్ పట్టణంలోని మత్స్యశాఖ జిల్లా కార్యాలయంలో జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల అధికారి పోమ్సింగ్ తెలిపారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రానికి ఫలితాలు వెలువడతాయి. గురువారం చైర్మన్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 11 మంది డెరైక్టర్ల పదవులకు 22 మంది పోటీపడుతున్నారు. అన్ని పదవులకు ముఖాముఖి పోటీ నెలకొంది. 322 మంది ఓటర్లు... జిల్లాలో 686 చెరువులు ఉండగా, 509 ప్రాథమిక మత్స్య సహకార సంఘాలున్నాయి. 322 మంది సొసైటీ అధ్యక్షులకు మాత్రమే జిల్లా సంఘంలో ఓటు హక్కు ఉంది. ఈ మేరకు ఒక్కో అధ్యక్షుడు 11 మంది డెరైక్టర్లకు ఓటు వేయాలి. బుధవారం జరిగే జిల్లా ఎన్నికల కోసం మొత్తం 26 మంది అభ్యర్థులు నామినేషన్ వేసినప్పటికీ చివరకు 22 మంది బరిలో మిగిలారు. రెండు ప్యానళ్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఐదోసారి బరిలో ‘మంతూరి’ - మాజీ చైర్మన్ మంతూరి బాల్‌నర్సయ్య, తాజా మాజీ చైర్మన్ గున్నాల నర్సింలు మరోసారి చైర్మన్ పదవిపై కన్నేశారు. వీరిద్దరూ చెరో ప్యానల్‌ను ఏర్పాటు చేసుకొని జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. - దుబ్బాక మండలం చిట్టాపూర్ మత్స్య సహకార సంఘం చైర్మన్‌గా ఉన్న మంతూరి బాల్ నర్సయ్య జిల్లా చైర్మన్ పదవే లక్ష ్యంగా తన మద్దతుదారులతో కూడవెళ్లి ప్రాంతంలో శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. గతంలో ఈయన నాలుగు పర్యాయాలు జిల్లా అధ్యక్షునిగా పనిచేసి ప్రస్తుతం ఐదోసారి తలపడుతున్నారు. రెండోసారి ‘గున్నాల’ .. హత్నూర మండలం చింతల్‌చెరువు సొసైటీ చైర్మన్‌గా ఉన్న గున్నాల నర్సింలు కూడా చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నారు. గతంలో బాల్నర్సయ్యపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన నేపథ్యంలో గున్నాల నర్సింలు చైర్మన్‌గా ఎన్నికై 2012 వరకు పదవిలో కొనసాగారు. ఈ సారి తిరిగి చైర్మన్ పదవిని ఆశిస్తూ తన మద్దతుదారులతో కలిసి మెదక్ మండలం మాచవరం ప్రాంతంలోని ఓ ఫంక్షన్ హాల్లో రాజకీయ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఈ రెండు శిబిరాలకు చెందిన వారు బుధవారం ఉదయం 8లోగా నేరుగా పోలింగ్ బూత్‌కు చేరుకోనున్నారు.