నువ్వా.. నేనా!
మత్స్యశాఖ సహకార సంఘం జిల్లా ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. పోటీ ముఖాముఖి కావడంతో నువ్వా..నేనా అన్నట్టుగా ఎవరికి వారు జోరుగా ప్రచారాన్ని సాగించి ముగించారు. మాజీలు తిరిగి చైర్మన్ పదవిని ఆశిస్తూ రెండు ప్యానళ్లుగా ఏర్పడ్డారు. తమ మద్దతుదారులతో శిబిరాలను నిర్వహిస్తూ గెలుపే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు.
రసవత్తర పోరు
⇒ నేడు మత్స్యశాఖ సహకార సంఘం ఎన్నికలు
⇒ 11 డెరైక్టర్ల పదవులకు బరిలో 22 మంది
⇒ చైర్మన్ రేసులో బాల్‌నర్సయ్య, నర్సింలు
⇒ మాజీల మధ్యే ప్రధాన పోటీ
⇒ శిబిరాల్లో మద్దతుదారులు
⇒ నేరుగా పోలింగ్ బూత్‌లకు వచ్చేలా ప్రణాళికలు
మెదక్: జిల్లా మత్స్య శాఖ సహకార సంఘం ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. పోటీ తీవ్రంగా ఉండడంతో చైర్మన్ అభ్యర్థులు తమ మద్దతుదారులను శిబిరాలకు తరలించారు. క్యాంపులకు వెళ్లిన వారంతా బుధవారం జరిగే పోలింగ్‌కు నేరుగా రానున్నారు. మెదక్ పట్టణంలోని మత్స్యశాఖ జిల్లా కార్యాలయంలో జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల అధికారి పోమ్‌సింగ్ తెలిపారు.
ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రానికి ఫలితాలు వెలువడతాయి. గురువారం చైర్మన్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 11 మంది డెరైక్టర్ల పదవులకు 22 మంది పోటీపడుతున్నారు. అన్ని పదవులకు ముఖాముఖి పోటీ నెలకొంది.
322 మంది ఓటర్లు...
జిల్లాలో 686 చెరువులు ఉండగా, 509 ప్రాథమిక మత్స్య సహకార సంఘాలున్నాయి. 322 మంది సొసైటీ అధ్యక్షులకు మాత్రమే జిల్లా సంఘంలో ఓటు హక్కు ఉంది. ఈ మేరకు ఒక్కో అధ్యక్షుడు 11 మంది డెరైక్టర్లకు ఓటు వేయాలి. బుధవారం జరిగే జిల్లా ఎన్నికల కోసం మొత్తం 26 మంది అభ్యర్థులు నామినేషన్ వేసినప్పటికీ చివరకు 22 మంది బరిలో మిగిలారు. రెండు ప్యానళ్లు హోరాహోరీగా తలపడుతున్నాయి.
ఐదోసారి బరిలో ‘మంతూరి’
- మాజీ చైర్మన్ మంతూరి బాల్‌నర్సయ్య, తాజా మాజీ చైర్మన్ గున్నాల నర్సింలు మరోసారి చైర్మన్ పదవిపై కన్నేశారు. వీరిద్దరూ చెరో ప్యానల్‌ను ఏర్పాటు చేసుకొని జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నారు.
- దుబ్బాక మండలం చిట్టాపూర్ మత్స్య సహకార సంఘం చైర్మన్‌గా ఉన్న మంతూరి బాల్ నర్సయ్య జిల్లా చైర్మన్ పదవే లక్ష ్యంగా తన మద్దతుదారులతో కూడవెళ్లి ప్రాంతంలో శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. గతంలో ఈయన నాలుగు పర్యాయాలు జిల్లా అధ్యక్షునిగా పనిచేసి ప్రస్తుతం ఐదోసారి తలపడుతున్నారు.
రెండోసారి ‘గున్నాల’ ..
హత్నూర మండలం చింతల్‌చెరువు సొసైటీ చైర్మన్‌గా ఉన్న గున్నాల నర్సింలు కూడా చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నారు. గతంలో బాల్‌నర్సయ్యపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన నేపథ్యంలో గున్నాల నర్సింలు చైర్మన్‌గా ఎన్నికై 2012 వరకు పదవిలో కొనసాగారు. ఈ సారి తిరిగి చైర్మన్ పదవిని ఆశిస్తూ తన మద్దతుదారులతో కలిసి మెదక్ మండలం మాచవరం ప్రాంతంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో రాజకీయ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఈ రెండు శిబిరాలకు చెందిన వారు బుధవారం ఉదయం 8లోగా నేరుగా పోలింగ్ బూత్‌కు చేరుకోనున్నారు.