3 రోజులు జోరు | zp chairpersons selections in warangal | Sakshi
Sakshi News home page

3 రోజులు జోరు

Published Wed, Jul 2 2014 5:45 AM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM

3 రోజులు  జోరు

3 రోజులు జోరు

 వరుసగా పరోక్ష ఎన్నికలు
- రేపు ఐదు మున్సిపాలిటీల్లో..
-ఎల్లుండి ఎంపీపీ, 5న జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నిక
- జోరందుకున్న ఫిరాయింపులు
-క్యాంపుల్లో మారుతున్న సమీకరణాలు
- టెన్షన్‌లో చైర్మన్ అభ్యర్థులు... మంగపేట ఎంపీపీ వాయిదా

 సాక్షిప్రతినిధి, వరంగల్ : జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంది. బుధవారం నుంచి వరుసగా మూడు రోజులు పరోక్ష ఎన్నికలు జరగనున్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ పదవి లక్ష్యంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు వ్యూహప్రతివ్యూహాలు జోరందుకున్నాయి. టీఆర్‌ఎస్‌కు సంబంధించి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నిక బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్యకు అప్పగించారు. కీలకమైన పదవి చేపట్టిన తర్వాత పార్టీ అధినేత ఆదేశంచిన ముఖ్యమైన ఎన్నిక కావడంతో జెడ్పీ చైర్‌పర్సన్ విషయం ఉప ముఖ్యమంత్రికి సవాల్‌గా మారింది.

టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కీలక పదవులు దక్కించుకునే విషయంలో జిల్లాలో నెలకొన్న పోటీ కారణంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. జెడ్పీటీసీ సభ్యుల క్యాంపు విషయంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పోటాపోటీగా ఉన్నాయి. అధికార పార్టీగా ఉన్న అనుకూలత టీఆర్‌ఎస్‌కు బాగా పనిచేస్తోంది. టీఆర్‌ఎస్ నేతల వ్యూహా లతో ఇప్పటికే ముగ్గురు కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులు గులాబీ క్యాంపులో చేరారు. మరో ముగ్గురు కాంగ్రెస్ క్యాంపునకు దూరమయ్యారు. వీరు టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతారని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు.

టీడీపీకి చెందిన ఆరుగురు జెడ్పీటీసీ సభ్యుల మద్దతు ఎవరికి అనేది అధికారికంగా నిర్ణయిం చాల్సి ఉంది. ఈ విషయా న్ని తేల్చేందుకు మహబూబ్‌నగర్‌కు చెందిన టీడీపీ సీని యర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. జెడ్పీ వైస్ చైర్మన్ పద వి ఇచ్చి.. టీడీపీ మద్దతు తీసుకునేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. దీనికి ఒప్పుకోకుంటే ఆరుగురు జెడ్పీటీసీ సభ్యుల్లో కొందరిని తమవైపునకు తిప్పుకునేలా వ్యూహాలు రచిస్తోంది. జెడ్పీ చైర్మన్ ఎన్నిక దగ్గరపడుతున్న కొద్దీ.. కాంగ్రెస్ క్యాంపు లో సభ్యుల సంఖ్య తగ్గుతోంది.

వైస్ చైర్మన్ పదవి విషయంలో వచ్చిన విభేదాలతో ఇప్పటికే ముగ్గురు సభ్యులు ఈ క్యాంపును వీడారు. మరో ముగ్గురు సభ్యులు మొదటి నుంచీ క్యాంపునకు దూరంగా ఉన్నారు. బీజేపీ, స్వతంత్ర జెడ్పీటీసీ సభ్యులతోపాటు ముగ్గురు టీడీపీ జెడ్పీటీసీ సభ్యులు తమ క్యాంపులో ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. జిల్లాలో 50 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ 24, టీఆర్‌ఎస్ 18, టీడీపీ 6, బీజేపీ 1, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలిచారు.
 
మండల పరిషత్‌లలోనూ జోరే..
మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి హంగ్ పరిస్థితి ఏర్పడిన 14 మండలాల్లో రాజకీయం జోరుగా సాగుతోంది. ఎన్నికల్లో 18 మండలాల్లో కాంగ్రెస్‌కు, 14 మండలాల్లో టీఆర్‌ఎస్‌కు, మూడు మండలాల్లో టీడీపీకి, ఒక మండలంలో న్యూడెమొక్రసీకి మెజారిటీ ఎంపీటీసీ స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ మెజారిటీ ఎంపీటీసీ స్థానాలు గెలుచుకున్న మంగపేట ఎంపీపీ ఎన్నిక నిర్వహణ.. కోర్టు కేసు కారణంగా వాయిదా పడింది. నర్సంపేట నగర పంచాయతీలో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ ఉంది. హంగ్ పరిస్థితి ఉన్న పరకాల, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మహబూబాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్‌కు, జనగామ మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌కు దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భూపాలపల్లి నగర పంచాయతీలో టీడీపీ, బీజేపీలకు చెందిన నలుగురు కౌన్సిలర్ల మద్దతు ఉన్న పార్టీ వారే చైర్మన్ అయ్యే పరిస్థితి ఉంది. పరకాలలో రెండు పార్టీల మధ్య తీవ్రపోటీ నెలకొంది.  
 
ఎంపీపీ ఎన్నికల తీరు ఇదీ...
మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నిక కోసం ప్రతి మండలానికి ఒకరు చొప్పున గెజిటెడ్ స్థాయి అధికారులను ఎన్నికల నిర్వహణ బాధ్యులుగా నియమించారు. జూలై 4న నిర్వహించనున్న కోఆప్షన్ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుల ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశం నిర్వహణ కోసం సోమవారం ప్రకటన జారీ చేశారు. 4న ఉదయం 10 గంటలకు కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం నామినేషన్లు స్వీకరిస్తారు. 12 గంటల లోపు నామినేషన్ల పరిశీలన పూర్తవుతుంది. 12 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు.

అభ్యర్థుల ఉప సంహరణ అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. వెంటనే మండల పరిషత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి ఎన్నిక నిర్వహిస్తారు. ఈ ఎన్నికలను మధ్యాహ్నం 3 గంటలలోపు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌లో పేర్కొంది. అనివార్య పరిస్థితుల్లో అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక జరగకుంటే వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్నికను 5న నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆ రోజు కూడా ఎన్నిక జరగని పక్షంలో మళ్లీ ఎప్పుడు నిర్వహించేది ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది.  
 
జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నిక ఇలా...
జూలై 5న నిర్వహించనున్న జిల్లా పరిషత్ ఇద్దరు కోఆప్షన్ సభ్యులు, చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించే అంశంపై మంగళవారం ప్రకటన జారీ చేశారు. ఈ సమాచారాన్ని అందరు జెడ్పీటీసీలకు చేర వేశారు. 5న 10 గంటలలోపు కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం నామినేషన్లను స్వీకరిస్తారు. 10 గంటల నుంచి 12 గంటలలోపు దాఖలైన నామినేషన్ల పరిశీలించి పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు.

అభ్యర్థుల ఉప సంహరణ అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక సమావేశంలో నిర్వహించి కోఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. వెంటనే జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలలోపు ఈ ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌లో పేర్కొంది. అనివార్య పరిస్థితుల్లో అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక జరగకుంటే వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందించాల్సి ఉంటుంది. వాయిదా పడితే 6న నిర్వహించాలని కమిషన్ సూచించింది.
 
మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో...
పాలక మండలి ఏర్పాటైన తర్వాత రెండు నెలల లోపు కోఆప్షన్ సభ్యలను ఎన్నుకోవాలి. ముగ్గురు సభ్యులు ఉంటారు. ఇద్దరు మైనారిటీ వర్గానికి చెందిన వారు, వీరిలో ఒకరు మహిళ ఉండాలి. మరొకరు మున్సిపల్ శాఖ రిటైర్డ్ ఉద్యోగి ఉంటారు. 10 గంటలకు రాజకీయ పార్టీలు విప్ జారీ సమాచారం ఇవ్వాలి. 11 గంటలకు సభ్యులతో ప్రమాణస్వీకారం చేస్తారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహిస్తారు. పోటీలో ఉన్న వారిలో ఎవరికి ఎక్కువ మందికి మద్దుతు తెలిపితే వారు చైర్మన్‌గా ఎన్నికవుతారు. మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యే, ఎంపీలకు ఓటు హక్కు ఉంటుంది. ఎంపీ తన నియోజకవర్గ పరిధిలోని ఒక మున్సిపాలిటీలోనే ఓటు వేయాల్సి ఉంటుంది.
 
ఎన్నికల నిర్వహణలో అధికారులు పారదర్శకంగా ఉండాలి
కలెక్టరేట్ : మున్సిపల్, నగర పంచాయతీ, జెడ్పీ, మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారులు పారద్శకంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ జి.కిషన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా వీడియో చిత్రీకరణ చేపట్టాలన్నారు. కోఆప్షన్ సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ పూర్తిగా ఎన్నికల కమిషనర్ నిబంధనల మేరకు చేపట్టాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ ఆర్డీడీ, ప్రిసైడింగ్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement