Indirect elections
-
మండలాధీశులెవరో!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మండల పరిషత్‌ల పరోక్ష ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష పీఠాలను ఎవరు అధిరోహించనున్నారో శుక్రవారం తెలనుంది. పరిషత్‌లోని మొత్తం స్థానాల్లో మెజార్టీ సభ్యుల ఆమోదయోగ్యం ఆధారంగా ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే కోరం ఉన్నప్పటికీ ఎన్నికలు జరపనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లాలోని 33 మండలాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం నామినేషన్ల ప్రక్రియ తర్వాత మధ్యాహ్నం ఒంటిగంటకు ఎన్నిక చేపట్టనున్నట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి చక్రధర్‌రావు పేర్కొన్నారు. పద్నాలుగింట అస్పష్టత.. జిల్లాలోని 33 మండల పరిషత్‌లకు ఏప్రిల్‌లో ఎన్నికల జరిగాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వీటి ఫలితా లు వాయిదా పడ్డాయి. తాజాగా పాల కవర్గాల ఏర్పాటుకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. జిల్లాలో 33 మండల పరిషత్‌లలో 19 మండలాల్లో మాత్రమే గెలుపును ప్రభావితం చేసే లా ఫలితాలు వచ్చాయి. దీంతో ఆ మేరకు పార్టీలు తమ సభ్యులను కాపాడుకునేందుకు క్యాంపులు నిర్వహించి పరోక్ష ఎన్నిక సమయానికల్లా హాజరయ్యేలా చర్యలు తీసుకున్నాయి. 14 మండలాల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో పొరుగుపార్టీ సభ్యులను తమ వైపునకు మళ్లించుకునేందుకు ఎత్తుగడ వేసి వ్యూహాత్మకం గా వ్యవహరించాయి. ఈ క్రమంలో కొన్ని మండలాల్లో సభ్యులు అటుఇటుగా తారుమారయ్యారు. ఈ మండలాల్లో.. 19 మండలాల్లో స్పష్టమైన మెజార్టీ రావడంతో ఆయా పార్టీల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థుల ఎంపిక ఖరారు చేసే పనిలో బిజీ అయ్యారు. ఇప్పటికే అభ్యర్థి పేరును ఖరారు చేసినప్పటికీ చివరి నిమిషం వరకు గోప్యత పాటిం చాలని నిర్ణయించాయి. దోమ, మహేశ్వరం, శామీర్‌పేట, హయత్‌నగర్, మేడ్చల్, బషీరాబాద్, తాండూరు, ధారూరు, కీసర, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, పరిగి, వికారాబాద్, బంట్వారం, శంకర్పల్లి, పెద్దేముల్, యాలాల, కుత్బుల్లాపూర్, నవాబుపేట మండలాల్లో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. వీటిలో ఏడు మండలాల్లో కాంగ్రెస్, టీడీపీ-బీజేపీ కూటమి 5, టీఆర్ఎస్ ఆరు మండలాల్లో ముందంజలో ఉన్నాయి. మరోవైపు పద్నాలుగు మండలాల్లో స్పష్టమైన మెజార్టీ లేదు. దీంతో సమీకరణల మార్పుతో కొంత మెజార్టీ సాధించే దిశగా పార్టీలు వ్యవహరించాయి. వీటిలో గండేడ్, మంచా ల, మొయినాబాద్, కుల్కచర్ల, షాబా ద్, యాచారం, చేవెళ్ల, కందుకూరు, ఘట్కేసర్, మోమిన్‌పేట, రాజేంద్రనగర్, మర్పల్లి, సరూర్‌నగర్, పూడూరు మండలాలున్నాయి. ఈ పద్నాల్గింటి లో ఆరు మండలాలను కాంగ్రెస్ హస్తగతం చేసుకునే అవకాశం ఉంది. మరో 4 మండలాల్లో టీఆర్ఎస్ ఆధిక్యతలో ఉండగా, టీడీపీ-బీజేపీ కూటమి 3 మండలాలను కైవసం చేసుకునే అవకా శం ఉంది. మంచాల మండలంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న సీపీఎంకు పీఠం దక్కే అవకాశం ఉంది. -
3 రోజులు జోరు
వరుసగా పరోక్ష ఎన్నికలు - రేపు ఐదు మున్సిపాలిటీల్లో.. -ఎల్లుండి ఎంపీపీ, 5న జెడ్పీ చైర్పర్సన్ ఎన్నిక - జోరందుకున్న ఫిరాయింపులు -క్యాంపుల్లో మారుతున్న సమీకరణాలు - టెన్షన్లో చైర్మన్ అభ్యర్థులు... మంగపేట ఎంపీపీ వాయిదా సాక్షిప్రతినిధి, వరంగల్ : జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంది. బుధవారం నుంచి వరుసగా మూడు రోజులు పరోక్ష ఎన్నికలు జరగనున్నారు. జెడ్పీ చైర్పర్సన్ పదవి లక్ష్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు వ్యూహప్రతివ్యూహాలు జోరందుకున్నాయి. టీఆర్ఎస్కు సంబంధించి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఎన్నిక బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్యకు అప్పగించారు. కీలకమైన పదవి చేపట్టిన తర్వాత పార్టీ అధినేత ఆదేశంచిన ముఖ్యమైన ఎన్నిక కావడంతో జెడ్పీ చైర్పర్సన్ విషయం ఉప ముఖ్యమంత్రికి సవాల్‌గా మారింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పదవులు దక్కించుకునే విషయంలో జిల్లాలో నెలకొన్న పోటీ కారణంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. జెడ్పీటీసీ సభ్యుల క్యాంపు విషయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పోటాపోటీగా ఉన్నాయి. అధికార పార్టీగా ఉన్న అనుకూలత టీఆర్ఎస్కు బాగా పనిచేస్తోంది. టీఆర్ఎస్ నేతల వ్యూహా లతో ఇప్పటికే ముగ్గురు కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులు గులాబీ క్యాంపులో చేరారు. మరో ముగ్గురు కాంగ్రెస్ క్యాంపునకు దూరమయ్యారు. వీరు టీఆర్ఎస్కు మద్దతు తెలుపుతారని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. టీడీపీకి చెందిన ఆరుగురు జెడ్పీటీసీ సభ్యుల మద్దతు ఎవరికి అనేది అధికారికంగా నిర్ణయిం చాల్సి ఉంది. ఈ విషయా న్ని తేల్చేందుకు మహబూబ్‌నగర్‌కు చెందిన టీడీపీ సీని యర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. జెడ్పీ వైస్ చైర్మన్ పద వి ఇచ్చి.. టీడీపీ మద్దతు తీసుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. దీనికి ఒప్పుకోకుంటే ఆరుగురు జెడ్పీటీసీ సభ్యుల్లో కొందరిని తమవైపునకు తిప్పుకునేలా వ్యూహాలు రచిస్తోంది. జెడ్పీ చైర్మన్ ఎన్నిక దగ్గరపడుతున్న కొద్దీ.. కాంగ్రెస్ క్యాంపు లో సభ్యుల సంఖ్య తగ్గుతోంది. వైస్ చైర్మన్ పదవి విషయంలో వచ్చిన విభేదాలతో ఇప్పటికే ముగ్గురు సభ్యులు ఈ క్యాంపును వీడారు. మరో ముగ్గురు సభ్యులు మొదటి నుంచీ క్యాంపునకు దూరంగా ఉన్నారు. బీజేపీ, స్వతంత్ర జెడ్పీటీసీ సభ్యులతోపాటు ముగ్గురు టీడీపీ జెడ్పీటీసీ సభ్యులు తమ క్యాంపులో ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. జిల్లాలో 50 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ 24, టీఆర్ఎస్ 18, టీడీపీ 6, బీజేపీ 1, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలిచారు. మండల పరిషత్లలోనూ జోరే.. మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి హంగ్ పరిస్థితి ఏర్పడిన 14 మండలాల్లో రాజకీయం జోరుగా సాగుతోంది. ఎన్నికల్లో 18 మండలాల్లో కాంగ్రెస్‌కు, 14 మండలాల్లో టీఆర్ఎస్కు, మూడు మండలాల్లో టీడీపీకి, ఒక మండలంలో న్యూడెమొక్రసీకి మెజారిటీ ఎంపీటీసీ స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ మెజారిటీ ఎంపీటీసీ స్థానాలు గెలుచుకున్న మంగపేట ఎంపీపీ ఎన్నిక నిర్వహణ.. కోర్టు కేసు కారణంగా వాయిదా పడింది. నర్సంపేట నగర పంచాయతీలో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ ఉంది. హంగ్ పరిస్థితి ఉన్న పరకాల, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మహబూబాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్‌కు, జనగామ మున్సిపాలిటీ టీఆర్ఎస్కు దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భూపాలపల్లి నగర పంచాయతీలో టీడీపీ, బీజేపీలకు చెందిన నలుగురు కౌన్సిలర్ల మద్దతు ఉన్న పార్టీ వారే చైర్మన్ అయ్యే పరిస్థితి ఉంది. పరకాలలో రెండు పార్టీల మధ్య తీవ్రపోటీ నెలకొంది. ఎంపీపీ ఎన్నికల తీరు ఇదీ... మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నిక కోసం ప్రతి మండలానికి ఒకరు చొప్పున గెజిటెడ్ స్థాయి అధికారులను ఎన్నికల నిర్వహణ బాధ్యులుగా నియమించారు. జూలై 4న నిర్వహించనున్న కోఆప్షన్ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుల ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశం నిర్వహణ కోసం సోమవారం ప్రకటన జారీ చేశారు. 4న ఉదయం 10 గంటలకు కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం నామినేషన్లు స్వీకరిస్తారు. 12 గంటల లోపు నామినేషన్ల పరిశీలన పూర్తవుతుంది. 12 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. అభ్యర్థుల ఉప సంహరణ అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. వెంటనే మండల పరిషత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి ఎన్నిక నిర్వహిస్తారు. ఈ ఎన్నికలను మధ్యాహ్నం 3 గంటలలోపు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్లో పేర్కొంది. అనివార్య పరిస్థితుల్లో అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక జరగకుంటే వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్నికను 5న నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆ రోజు కూడా ఎన్నిక జరగని పక్షంలో మళ్లీ ఎప్పుడు నిర్వహించేది ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది. జెడ్పీ చైర్పర్సన్ ఎన్నిక ఇలా... జూలై 5న నిర్వహించనున్న జిల్లా పరిషత్ ఇద్దరు కోఆప్షన్ సభ్యులు, చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించే అంశంపై మంగళవారం ప్రకటన జారీ చేశారు. ఈ సమాచారాన్ని అందరు జెడ్పీటీసీలకు చేర వేశారు. 5న 10 గంటలలోపు కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం నామినేషన్లను స్వీకరిస్తారు. 10 గంటల నుంచి 12 గంటలలోపు దాఖలైన నామినేషన్ల పరిశీలించి పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. అభ్యర్థుల ఉప సంహరణ అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక సమావేశంలో నిర్వహించి కోఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. వెంటనే జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలలోపు ఈ ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్లో పేర్కొంది. అనివార్య పరిస్థితుల్లో అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక జరగకుంటే వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందించాల్సి ఉంటుంది. వాయిదా పడితే 6న నిర్వహించాలని కమిషన్ సూచించింది. మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో... పాలక మండలి ఏర్పాటైన తర్వాత రెండు నెలల లోపు కోఆప్షన్ సభ్యలను ఎన్నుకోవాలి. ముగ్గురు సభ్యులు ఉంటారు. ఇద్దరు మైనారిటీ వర్గానికి చెందిన వారు, వీరిలో ఒకరు మహిళ ఉండాలి. మరొకరు మున్సిపల్ శాఖ రిటైర్డ్ ఉద్యోగి ఉంటారు. 10 గంటలకు రాజకీయ పార్టీలు విప్ జారీ సమాచారం ఇవ్వాలి. 11 గంటలకు సభ్యులతో ప్రమాణస్వీకారం చేస్తారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహిస్తారు. పోటీలో ఉన్న వారిలో ఎవరికి ఎక్కువ మందికి మద్దుతు తెలిపితే వారు చైర్మన్‌గా ఎన్నికవుతారు. మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యే, ఎంపీలకు ఓటు హక్కు ఉంటుంది. ఎంపీ తన నియోజకవర్గ పరిధిలోని ఒక మున్సిపాలిటీలోనే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల నిర్వహణలో అధికారులు పారదర్శకంగా ఉండాలి కలెక్టరేట్ : మున్సిపల్, నగర పంచాయతీ, జెడ్పీ, మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారులు పారద్శకంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ జి.కిషన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా వీడియో చిత్రీకరణ చేపట్టాలన్నారు. కోఆప్షన్ సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ పూర్తిగా ఎన్నికల కమిషనర్ నిబంధనల మేరకు చేపట్టాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ ఆర్డీడీ, ప్రిసైడింగ్ అధికారులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ విప్ వంద శాతం చెల్లుతుంది
మైసూరా, అంబటి స్పష్టీకరణ హైదరాబాద్ : జూలై 3, 4, 5 తేదీల్లో జరిగే ‘స్థానిక’ పరోక్ష ఎన్నికలు పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జారీ చేసే విప్ నూ టికి నూరు శాతం చెల్లుతుందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యు డు ఎంవీ మైసూరారెడ్డి, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో టీడీపీ నేతల మాటలు, చేస్తున్న ప్రచారం అభూత కల్పనలని వారు పేర్కొన్నారు. విప్ ఉల్లంఘించే సభ్యులపై వేటు తప్పదని హెచ్చరించారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద వారు మీడియాతో వేర్వేరుగా మాట్లాడారు. వైఎస్సార్సీపీ తరఫున ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను అనైతికంగా తన వైపునకు తిప్పుకునేందుకు టీడీపీ రాజకీయ దిగజారుడుతనానికి పాల్పడుతోందని మైసూరా, అంబటి మండిపడ్డారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తన (27.06.2014) నోటిఫికేషన్లో సైతం వైఎస్సార్ సీపీని రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీగా పేర్కొన్నందున.. విప్ చెల్లుతుందని వారు తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులకు విప్ వర్తించదు: సోమిరెడ్డి నెల్లూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరుపున గెలుపొందిన ప్రజాప్రతినిధులకు ఆ పార్టీ జారీ చేసే విప్ వర్తించదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు. స్థానిక ఎన్నికలు జరిగే నాటికి వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికల కమిషన్‌లో రిజిస్టర్డ్ పార్టీ మాత్రమేనని, ఎన్నికలు ముగిశాకే ఆ పార్టీకి గుర్తింపు లభించిందని తెలిపారు. -
కొలువుదీరేదెన్నడు?
పరోక్ష ఎన్నికలపై తొలగని ప్రతిష్టంభన - నీరసిస్తున్న ఆశావహులు - మారుతున్న సమీకరణలు - అభ్యర్థులకు చుక్కలు చూపుతున్న జంప్‌జిలానీలు కరీంనగర్ సిటీ: ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని అయోమయ పరిస్థితి పరోక్ష ఎన్నికల విషయంలో నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడి నలభై రోజులు దాటుతున్నా ఇప్పటివరకు అధ్యక్ష ఎన్నికపై స్పష్టత రాలేదు. రాష్ట్ర విభజన, ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం, అసెంబ్లీ సమావేశాలు.. నెపం ఏదైనా చైర్మన్ ఎన్నికలకు ముహూర్తం కుదరడం లేదు. ఇప్పటివరకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయకపోవడం, కనీసం ఆ దిశగా కసరత్తు చేయకపోవడంతో గందరగోళ పరిస్థితి తలెకొంది. ఎప్పుడు నిర్వహిస్తారో తెలియని ఎన్నికకు ఉత్సాహంతో క్యాంప్‌లు వేసిన ఆశావాహులు ప్రస్తుత పరిస్థితితో బేజారెత్తిపోతున్నారు. క్యాంపుల నిర్వహణకు లక్షలాది రూపాయలు ఖర్చవుతుంటే కండ్లు తేలేసి.. మళ్లీ వేద్దాంలే అంటూ నుంచి ఇంటిబాట పడుతున్నారు. ఇదే అదనుగా ప్రత్యర్థులు గాలం వేయడంతో సభ్యులు కప్పదాట్లకూసై అంటున్నారు. నలభై రోజులు దాటినా ఊసేది? మార్చి 30న మున్సిపల్ ఎన్నికలు, ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. మే 12న మున్సిపల్, 13న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలు వెలువడి 40 రోజులు దాటుతున్నా జెడ్పీ చైర్మన్, మండల పరిషత్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ పదవుల ఎన్నికలపై ఎన్నికల సంఘం ఎటూ తేల్చలేదు. గతంలో ఎన్నడూ ఇలాంటి విచిత్ర పరిస్థితి ప్రజాప్రతినిధులకు ఎదురవలేదు. గతంలో కౌంటింగ్ కేంద్రాల నుంచే విజేతలను క్యాంపులకు తరలించేవాళ్లు. వారం రోజుల్లోపు చైర్మన్ ఎన్నిక తేలిపోయేది. ప్రస్తుతం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉండటంతో ప్రజాప్రతినిధులకు గెలిచిన సంతోషం కూడా లేకుండా పోయింది. కనీసం ప్రమాణస్వీకారం కూడా చేయకపోవడం ఇబ్బందిగా మారింది. చైర్మన్ ఎన్నికలో ఎమ్మెల్యే, ఎంపీల ఓట్లు కూడా కీలకమవుతుండటంతో శాసనసభ కొలువు తీరాక, ప్రమాణస్వీకారం చేసిన తరువాత నోటిఫికేషన్ విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. తెలంగాణ రాష్ట్ర శాసనసభా సమావేశాలు పూర్తయినా ఎలాంటి స్పందన లేదు. ఎన్నికల సంఘం విభజన కాకపోవడం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలు కొనసాగుతుండటంతో అవి పూర్తయ్యాక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కలవరపెడుతున్న జంప్‌జిలానీలు నానాతంటాలు పడి మద్దతుకు హామీ తీసుకొని క్యాంపులకు తీసుకెళ్తే ఎన్నిక నిర్వహించకపోవడంతో సభ్యుల మనసు మారకుండా చూడటం చైర్మన్ అభ్యర్థులకు మరో పరీక్షగా మారింది. ఫలితాలు వెలువడి రెండు నెలలు కావస్తుండటంతో రాజకీయ సమీకరణలు తారుమారవుతున్నాయి. జిల్లాలో 57 మండలాలకు 29 స్థానాల్లో టీఆర్ఎస్, 11 మండలాల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ రాగా, 17 మండలాల్లో హంగ్ ఏర్పడింది. కరీంనగర్, రామగుండం నగరపాలక సంస్థల్లో ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిపి టీఆర్ఎస్ మెజారిటీ సాధించగా, కాంగ్రెస్ పార్టీ సైతం చాపకిందనీరులా తమ ప్రయత్నాలు సాగిస్తోంది. పెద్దపల్లి నగరపంచాయతీ నువ్వానేనా అన్నట్లుగా ఉంది. క్యాంపు రాజకీయాలంటేనే కప్పదాట్లకు నిలయం. ఒక పార్టీ క్యాంపులో ఉన్నా, మరో పార్టీ ఆశావాహులు వారితో టచ్ లో ఉంటూ తమవైపు జంప్ చేసేలా ‘మాట్లాడుకుంటున్నారు’. ఇందుకు తగినట్లుగానే కొన్ని ప్రాంతాల్లో ఒక క్యాంపు నుంచి వచ్చి మరో క్యాంపునకు వెళ్లగా, మరికొంతమంది ఎన్నికల నాటికి పార్టీ మారుస్తామని ఒట్టేస్తున్నారు. కమాన్‌పూర్‌లో కాంగ్రెస్ క్యాంపు నిర్వహించి తిరిగి రాగా, టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో ఎనిమిది మంది ఎంపీటీసీలు క్యాంపు మార్చారు. కాంగ్రెస్ క్యాంపు నుంచి వచ్చి తిరిగి టీఆర్ఎస్ క్యాంపులో చేరడంతో ఎంపీపీ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ముగింపు ఎప్పుడో...? పరోక్ష ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు ముగింపు ఎప్పుడనేది ప్రజాప్రతినిధుల మదిని తొలుస్తోంది. ఇప్పుడు...అప్పుడు అంటూ ప్రచారం జరగడం, ఆశావాహులు, పార్టీ నేతలు హడావుడి పడటం, ఆ తరువాత ఎలాంటి ప్రకటన లేకపోవడంతో నీరుగారిపోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలు పూర్తయ్యాక ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుందని పార్టీలన్నీ బలంగా విశ్వసిస్తున్నాయి. దీంతో మళ్లీ క్యాంపులపై నేతలు దృష్టిసారిస్తున్నారు. మొత్తానికి పరోక్ష ఎన్నిక ఆశావాహుల్లో గుబులు పుట్టస్తుంటే, ఏదైనా జరగకపోతుందా అనే కోణంలో ప్రత్యర్థుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. -
30లోగా పాత ఎంపీలకే చాన్స్
* ‘స్థానిక’ పరోక్ష ఎన్నికల్లో ఎక్స్అఫీషియోలపై న్యాయ శాఖ స్పష్టత * 16 తర్వాత కొత్త ఎమ్మెల్యేలకు ఓటు హక్కు * ప్రమాణ స్వీకారం చేయకున్నా ఓటేయొచ్చు * చైర్పర్సన్ల ఎన్నికపై తొలగిన సందిగ్ధం * జూన్ 2 తర్వాత నిర్వహణకే ఈసీ మొగ్గు సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ చైర్పర్సన్ల పరోక్ష ఎన్నికల నిర్వహణపై న్యాయ శాఖ స్పష్టతనిచ్చింది. ఈ నెల 30లోగా ఎన్నికలు నిర్వహిస్తే ఎక్స్అఫీషియో సభ్యులుగా ప్రస్తుతమున్న ఎంపీలకే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశముంటుందని పేర్కొంది. అయితే రాష్ర్ట శాసనసభ రద ్దయినందున ఎమ్మెల్యేల విషయాన్ని మాత్రం న్యాయశాఖ ప్రస్తావించలేదు. స్థానిక సంస్థలకు ఇప్పటికే ఎన్నికలు పూర్తి చేసి ఫలితాల విడుదలకు సిద్ధమైన ఈసీ.. వాటి చైర్పర్సన్లు, మేయర్ల ఎన్నికపై సందిగ్ధంలో పడిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మే 16న వెల్లడికానున్న నేపథ్యంలో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఎవరికి అవకాశం కల్పించాలన్న విషయంలో స్పష్టత కోరుతూ రాష్ర్ట ప్రభుత్వానికి ఈసీ గత నెలలో లేఖ రాసింది. ప్రభుత్వం దీనిపై న్యాయ శాఖ అభిప్రాయాన్ని కోరింది. అయితే ఈలోగానే రాష్ర్ట శాసనసభ రద్దు కావడంతో ప్రస్తుత ఎమ్మెల్యేలంతా మాజీలయ్యారు. ఈ నేపథ్యంలో ఎంపీల పదవీకాలం ఈ నెల 30 వరకు ఉన్నందున ఆలోగా స్థానిక సంస్థలకు పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తే పాత వారికే ఓటుహక్కు కల్పించాలని న్యాయశాఖ తేల్చింది. అయితే మున్సిపల్ చట్టాల ప్రకారం స్థానిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరోక్ష ఎన్నికల నిర్వహణకు నిర్దేశిత కాలపరిమితేమీ లేదని పురపాలక శాఖ వర్గాలు వెల్లడించాయి. నిజానికి ఎంపీపీ, జెడ్పీటీసీ చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్అఫీషియో సభ్యులు పాల్గొన్నప్పటికీ వారికి ఓటు హక్కు ఉండదు. మున్సిపల్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్ ఎన్నికల్లో మాత్రమే ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పరిషత్‌లకు ఎప్పుడైనా పరోక్ష ఎన్నికలు నిర్వహించే వెసులుబాటు ఉంది. ఇక మున్సిపల్ చైర్పర్సన్ల ఎన్నిక విషయంలో ఎక్స్ అఫీషియో సభ్యులు కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో మే 16 తర్వాత కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కొత్త ఎమ్మెల్యేలు జూన్ రెండో తేదీ వరకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లేనందున.. అప్పటివరకు పరోక్ష ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదన్న వాదన వినిపిస్తోంది. రాజస్థాన్‌లో గతంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు.. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ప్రమాణ స్వీకారం చేయకున్నా చైర్పర్సన్ల పరోక్ష ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారని, అదే పద్దతిని ఇక్కడ కూడా పాటించే అవకాశం లేకపోలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ విధానంలో ఈ నెల 30లోగా పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తే.. ప్రస్తుత ఎంపీలు, కొత్త ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశముంటుంది. కానీ లోక్‌సభ ఫలితాలతో కొత్తగా ఎన్నికయ్యే ఎంపీలు మాత్రం దూరంగా ఉండాల్సిందే. ఈ వివాదాలన్నింటినీ అధిగమించాలంటే.. జూన్ రెండో తేదీ తర్వాతే పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తే మేలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 12, 13 తేదీల్లో మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తర్వాత స్థానిక సంస్థల పాలకమండళ్లకు పరోక్ష పద్ధతిలో నిర్వహించే ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించనుంది.