ఆరోగ్య ప్రాప్తిరస్తు..! | fitness for good health..! | Sakshi
Sakshi News home page

ఆరోగ్య ప్రాప్తిరస్తు..!

Published Sat, May 31 2014 11:59 PM | Last Updated on Wed, May 29 2019 2:58 PM

fitness for good health..!

నేటి సమాజం పెద్దల మాటలను చద్దిమూటలుగా తీసిపారేసి... కొత్తొక వింత అన్నట్టుగా వేలంవెర్రిగా వింతపోకడలు పోతోంది. మన ఆరోగ్యం కోసం పతంజలి ఏనాడో రాసిపెట్టిన యోగ శాస్త్రాన్ని విస్మరించి తలనొప్పి వచ్చినా...కడుపునొప్పి వచ్చినా...ఆస్పత్రుల చుట్టూ తిరిగి వేలు,లక్షలు వదిలించుకుంటున్న మన అజ్ఞానానికి మనమే సిగ్గుపడాలి. యోగశాస్త్రంలో ఏ ఆసనం వేస్తే ఏ రోగం తగ్గించుకోవచ్చో కూడా  వివరంగా ఉంది. చక్రాసనం వేస్తే చాలు గుండెజబ్బును ఆమడదూరంలో ఉంచవచ్చు. భుజంగాసనం వేస్తే శ్వాసకోస వ్యాధులతో ఇబ్బంది పడక్కరలేదు. పశ్చిమోత్తాసనం వేస్తే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. పవనముక్త ఆసనం వేస్తే గ్యాస్ ట్రబుల్ బలాదూర్..పంచిమూతన ఆసనం వేస్తే మధుమేహం పరార్..ఇలా ఆసనాలతోనే రోగాలను తరిమివేసే అద్భుత శాస్త్రం మన చేతుల్లోనే ఉంది. ఇక మనమూ ఆసనాలు వేద్దామా మరి...
 
 నరసరావుపేట ఈస్ట్, న్యూస్‌లైన్ : భారతదేశ సంస్కృతిలో యోగా ఒక భాగం. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవనానికి ఉపయుక్తం కలిగించేందుకు భారతదేశం అందించిన అత్యుత్తమమైన శాస్త్రాలలో యోగశాస్త్రం ప్రముఖమైంది. పూర్వం పతంజలి మహర్షి యోగశాస్త్రను రచించారు. అందులో ఒక భాగమే యోగాసనాలు.
 
 భూమి పైన 84 లక్షల జీవరాసులుంటే, 84 రకాల ఆసనాలున్నాయి. వీటిలో స్త్రీ, పురుషులు సులభంగా చేయగలిగే యోగాసనాలు (భంగిమలు) 42 వరకు ఉన్నాయని యోగాసనాల శిక్షకులు చెబుతున్నారు. ప్రతి ఆసనానికి దేనికదే దాని ప్రత్యేకతలు, పద్ధతులు ఉన్నాయి. యోగ సాధన ద్వారా ప్రశాంతత, ఆనందం, ఆరోగ్యం, విజ్ఞానం ప్రాప్తిస్తాయి.యోగాకు తోడు ప్రాణాయామం, ధ్యానం చేయడంతో మానవ జీవితం ఆనందంగా ఉంటుంది.  8 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వారు సైతం సాధన చేయవచ్చు.యోగావల్ల ఎటువంటి రోగాలైనా త్వరితంగా అధీనంలోకి రావడంతోపాటు మరికొంత సాధనతో పూర్తిగా తగ్గించుకోవచ్చని యోగాచార్యులు చెబుతున్నారు.  యోగాసనాలపై అందరికి అవగాహన కల్పిస్తూ, ఉచితంగా నేర్పిస్తున్న సంస్థలు కొన్ని ఉన్నాయి.
 
 పరిపూర్ణ ఆరోగ్యాన్ని అందించే యోగా
 యోగం అంటే కలయిక. యోగా శారీరక, మానసిక, బుద్ధిపరమైన రుగ్మతలను తగ్గించి పరిపూర్ణ ఆరోగ్యం అందిస్తుంది. యోగాసనాల ద్వారా శరీరంలోని కండరాలకు వ్యాయామం అవుతుంది. నిత్యం యోగా సాధన ద్వారా రోగనిరోధకశక్తి పెరిగి, శారీరక రోగాలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. మానసిక ప్రశాంతతకు, బుద్ధి మాంద్యం తగ్గించడంతో పాటు ఆధ్మాత్మికోన్నతికి తోడ్పడుతుంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ యోగా పట్ల ఆసక్తిని చూపుతున్నాయి.
 
 84 రకాల యోగాసనాలు
 యోగాసనాలు (భంగిమలు) మొత్తం 84 ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా 42 రకాల ఆసనాలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒక్కొక్క ఆసనానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. నిత్యం బ్రహ్మీ ముహూర్తం (ఉదయం 3-6 గంటలమధ్య) సమయంలో యోగసాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ఎటువంటి ఆయుర్వేద, హోమియో, ఇంగ్లిష్ మందుల అవసరం లేకుండానే కేవలం యోగసాధన ద్వారానే బి.పి, షుగర్, ఆస్తమ, గ్యాస్, నడుమునొప్పి, ైథైరాయిడ్, స్త్రీ రుతుక్రమ దోషాలు, క్యాన్సర్ వంటి వ్యాధులను సైతం తగ్గించుకోవచ్చని యోగా మాస్టర్‌లు గట్టిగా చెబుతున్నారు.
 
 ఏ వ్యాధికి ఏ ఆసనం ఉపయుక్తం..?
 వివిధ శారీరక రోగాలకు వివిధ భంగిమలలో సాధన చేయాల్సి ఉంటుంది. మధుమేహం(షుగర్)కు - పంచిమూతన ఆసనం, గ్యాస్‌ట్రబుల్‌కు - పవనముక్త ఆసనం, గుండెజబ్బుకు - చక్రాసనం, శ్వాసకోస వ్యాధులకు - భుజంగాసనం, జీర్ణక్రియకు - పశ్చిమోత్తాసనం, ఉబ్బసం - ఉష్ట్రాసనం, మలబద్దకానికి - ఉదరాకర్షణాసనం, శరీరంలో రక్తప్రసరణకు మయూరాసనం, థైరాయిడ్ సమస్యలు, సర్వఅంగాల ఉత్తేజానికి సర్వాంగాసనం, నడుములో కొవ్వును తగ్గించుకోవడానికి - త్రికోణాసనాలను సాధన చేయాలంటారు గురువులు. వీటితోపాటు పెరాలసిస్, ఫిట్స్, కిడ్నీ, మొండిరోగాలైన చర్మవ్యాధులు సైతం ఆసనాలతో దూరం అవుతాయని చెబుతారు. ఆసనాలతో పాటుగా సుఖప్రాణాయామం, నాడీశోధన ప్రాణాయామం, బస్త్రిక ప్రాణాయామం సాధనవల్ల మానసిక ప్రశాంతత పెంపొందించుకోవచ్చు. ముఖ్యంగా యోగసాధన చేయదలచినవారు ముందుగా యోగాలో మంచి శిక్షణ తీసుకున్న మాస్టర్స్ వద్ద కొంతకాలం శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది.
 
 యోగాతో అన్ని రుగ్మతలు తొలుగుతాయి
 యోగసాధనతో శారీరక, మానసిక రుగ్మతలను పోగొట్టుకోవచ్చు. వత్తిడిని జయించవచ్చు, చక్కని నిద్రకు, బరువు తగ్గడానికి యోగా ఉపయోగపడుతుంది. యోగభంగిమలతో  సకల రోగాలను దూరం చేసుకోవచ్చు.  గత 12 ఏళ్లుగా నిత్యం యోగాసనాలలో శిక్షకులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాము. ఇప్పటికీ 114 యోగశిక్షణ శిబిరాలను ఏర్పాటుచేసి, వేలమందికి శిక్షణ ఇచ్చాము.
 -కూనిశెట్టి వెంకట జనార్ధన్ గురూజీ,శ్రీవెంకటేశ్వర యోగసేవాకేంద్రం, పరికల్ప యోగి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement