పంచతంత్రం | Five elections for the first time in the history of democratic | Sakshi
Sakshi News home page

పంచతంత్రం

Published Mon, Mar 10 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 AM

పంచతంత్రం

పంచతంత్రం

 సాక్షి, ఏలూరు: ఓటరన్నకు పండగొచ్చింది.. నా యకులకు చిక్కొచ్చింది.. ఒకేసారి తరుముకొచ్చిన ఎన్నికలతో ప్రజలు ఉబ్బితబ్బిబవుతుండగా.. రాజకీయ పక్షాలు మాత్రం ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. సార్వత్రిక పోరుకు సన్నద్ధమవుతున్న తరుణంలో మునిసిపల్ ఎన్నికలతో సతమతమవుతున్న వారిని ‘ప్రాదేశిక’ పోరు ఆందోళనకు గురిచేస్తోంది. రెండు నెలల వ్యవధిలో మునిసిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం వీరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 
 
 నేడు ‘ప్రాదేశిక’ నోటిఫికేషన్
 జిల్లాలో ఏలూరు కార్పొరేషన్‌తో పాటు నిడదవోలు, కొవ్వూరు, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం మునిసిపాలిటీలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీకి ఈనెల 30న ఎ న్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే వీటి వ్యూహప్రతివ్యూహాల్లో మునిగితేలిన నేత లకు ఇప్పుడు హఠాత్తుగా జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు రానుండటం కలవరపెడుతోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ వెలువడనుంది. జిల్లాలో 46 జెడ్పీటీసీ, 903 ఎంపీటీసీ స్థానాలకు ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఏప్రిల్ 6న వీటికి ఎన్నికలు జరగనున్నాయి. ఇక సార్వత్రిక  ఎన్నికల నోటిఫికేషన్ రానేవచ్చింది. జిల్లాలో 15 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకు మే 7న పోలింగ్ జరగనుంది. 
 
 మూడేళ్లుగా తాత్సారం
 జిల్లాలో నగరపాలక సంస్థ, మునిసిపాలిటీలకు 2010 సెప్టెంబర్‌తో గడువు ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేకాధికారులను నియమించి వీటిలో పాలన సాగిస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల పదవులు 2011 జులైతో ముగిశాయి. దివంగత సీఎం వైఎస్ మరణం తర్వాత రాష్ట్రంలో పాలన ఉన్నా లేనట్టుగానే మారింది. ఇద్దరు ముఖ్యమంత్రులు మారినా పరిస్థితి చక్కబడలేదు. దీనిని గమనించిన కాంగ్రెస్ పెద్దలు ఎన్నికలు నిర్వహించకుండా జనాభా లెక్కలు, రిజర్వేషన్లు పేరుతో ఇప్పటివరకు తాత్సారం చే స్తూ వచ్చారు. న్యాయస్థానం చీవాట్లు పెట్టడంతో వీటికి మోక్షం కలిగింది. 
 
 ఖంగు తిన్న కాంగ్రెస్
 గత జులైలో పంచాయతీ ఎన్నికల ఫలితాలను చూసి మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కాంగ్రెస్ ధైర్యం చేయలేకపోయింది. ఈలోపు రాష్ట్ర విభజన అంశం తెరపైకి వచ్చి సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. దీంతో పాలకులు స్థానిక ఎన్నికలను మరోసారి వాయిదా వేయించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం ఎన్నికలు జరపాల్సిందేనని ఆదేశించడంతో తప్పనిసరై నోటిఫికేషన్లు వెలువరిస్తున్నారు. దీంతో ఇటు నాయకులు అటు అధికారులు పరుగులు తీస్తున్నారు. ఏర్పాట్లలో యంత్రాంగం, అభ్యర్థుల ఎంపికలో రాజకీయ పార్టీలు తలమునకలవుతున్నాయి. ఎన్నికలన్నీ ఒకేసారి రావడంతో ఎక్కడ చూసినా వీటిపై చర్చలే కనిపిస్తున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement