
అందరికీ అండగా మేముంటాం
తాడేపల్లి రూరల్ : రాజధానిలో బాధితులందరికీ అండగా ఉంటామని, అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. గురువారం జిల్లాకు వచ్చిన ఆయనను ప్రకాశం బ్యారేజి వద్ద పార్టీ నేతలు కలిశారు. రాజధాని ప్రజల ఆవేదనను జగన్‌కు వివరించారు. కేఎల్‌రావు కాలనీలో నిరుపేదల ఇళ్లను తొలగించేందుకు ప్రభుత్వం చేస్తున్న యత్నాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ఆర్కే రాజధాని సమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉన్నారని, కేఎల్‌రావు కాలనీ నివాస స్థలాల విషయం కూడా తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. దీనిపై ఇదివరకే కోర్టును కూడా ఆశ్రయించినట్టు చెప్పారు. వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ బుర్రముక్కు వేణుగోపాలరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులమూడి డేవిడ్‌రాజు, మహిళా సంఘం నేత పార్వతి, ఎస్సీ సెల్ పట్టణ కన్వీనర్ ముదిగొండ ప్రకాష్, పాల్గొన్నారు.
ప్రకాశం బ్యారేజి వద్ద ఘనస్వాగతం
పెనుమాక (తాడేపల్లి) : వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ప్రకాశం బ్యారేజీ వద్ద వైఎస్సార్ సీపీ పట్టణ నేతలు, చిగురు అనాథాశ్రమం వద్ద పెనుమాక, ఉండవల్లి గ్రామాల రైతులు, ఆశ్రమం చిన్నారులు గురువారం ఘన స్వాగతం పలికారు. ఉద్దండరాయునిపాలేనికి కరకట్ట మార్గంలో వెళ్తున్న వై.ఎస్.జగన్ ఆశ్రమం వద్ద కొద్దిసేపు ఆగారు. ఆయనకు చిన్నారులు పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా రైతులు తమగోడు వెళ్లబోసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తమకు అండగా ఉంటున్నారని తెలిపారు. ప్రభుత్వం తమను భయబ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపించారు. రైతులకు అండగా ఉంటానని వై.ఎస్.జగన్ భరోసా ఇచ్చారు. క్యారెట్ సాగు చేసే రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వై.ఎస్.జగన్ వెంట ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జెక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కావటి మనోహర్ నాయుడు, నేతలు ఈదులమూడి డేవిడ్‌రాజు, బుర్రముక్కు వేణుగోపాలస్వామిరెడ్డి, మున్నంగి వివేకానందరెడ్డి పాల్గొన్నారు.