అనంతపురం(గోరంట్ల): తమ ప్రేమను ప్రియుడి తల్లిదండ్రులు నిరాకరించారని ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఈ విషయం అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. గోరంట్ల మండలానికి చెందిన యువతి గుంటూరులోని ఓ కళాశాలలో బీఫార్మసీ చదువుతోంది. అయితే అనంతపురం జిల్లాకు చెందిన తన క్లాస్‌మేట్ అశోక్, సదరు యువతి ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన యువకుడి తల్లిదండ్రులు అశోక్‌ను ఇంటికి తీసుకెళ్లారు. దీంతో ప్రియుడిన కలిసేందుకు ఆ యువతి అనంతపురం మండలం బుదిలికి వెళ్లింది. అయితే యువతిని ఇంట్లోకి రాకుండా యువకుడి తల్లిదండ్రులు అడ్డుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన యువతి 18 బ్రూఫిన్ ట్యాబ్లెట్‌లు మింగి బుదిలి బస్టాండ్‌లో ఆత్మహత్యకు యత్నించింది.
అపస్మారక స్థితిలో ఉన్న యువతిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను చికిత్స నిమిత్తం హిందూపురం ఆస్పత్రికి తరలించారు.