జమ్మలమడుగు రూరల్ మండలం అంబవరం సమీపంలోని బ్రహ్మణీ స్టీల్‌ప్లాంట్ కోసం కడదాకా పోరాటం కొనసాగిస్తామని సీపీఎం కార్యదర్శి నారాయణ ప్రకటించారు.
జమ్మలమడుగు, న్యూస్‌లైన్: జమ్మలమడుగు రూరల్ మండలం అంబవరం సమీపంలోని బ్రహ్మణీ స్టీల్‌ప్లాంట్ కోసం కడదాకా పోరాటం కొనసాగిస్తామని సీపీఎం కార్యదర్శి నారాయణ ప్రకటించారు. ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డితో కలసి బుధవారం ఉదయం స్టీల్‌ప్లాంట్‌ను ఆయన సందర్శించారు. బ్రహ్మణీ లక్ష్యం 2009 నాటికి రెండు మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసి 2017 నాటికి 10 మిలియన్ టన్నులకు పెంచి 10 వేల మందికి ప్రత్యక్ష్యంగా, మరో లక్ష మందికి పరోక్షంగా ఉపాధి కల్పించాలన్నదేనన్నారు. దీని కోసం యాజమాన్యం ఇప్పటి వరకు రూ.1,375 కోట్లు ఖర్చుపెట్టినట్లు చెబుతోందన్నారు. అయితే బ్రహ్మణీ అధినేత జైలుపాలు కావడంతో పనులు పూర్తిగా నిలచిపోయాయన్నారు. దీంతో బ్రహ్మణీ జిల్లా వాసులకు కలగానే మిగిలిపోయిందన్నారు.
ఈ నెల 21 నుంచి పాదయాత్ర
బ్రహ్మణి ఉక్కు-కడప హక్కు నినాదాంతో స్టీల్‌ప్లాంట్ సాధన కోసం ఈ నెల 21 నుంచి 25 వరకు స్టీల్‌ప్లాంట్ నుంచి కడప వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రారంభ కార్యక్రమానికి తమ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే ఎం.ఏ.గఫూర్, 25న కడప కలెక్టరేట్ ఎదుట జరిగే భారీ బహిరంగ సభకు రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు హజరవుతారన్నారు. పాతయాత్రతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి తెచ్చి స్టీల్‌ప్లాంట్ నిర్మాణాన్ని ప్రభుత్వమే చేపట్టేలా ప్రయత్నిస్తామన్నారు.
వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టగా చాలా పార్టీలు, పత్రికలు అసత్య ప్రచారాలు చేశాయని ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి తెలిపారు. చివరకు అన్ని పార్టీల నాయకులు ఇప్పుడు స్టీల్‌ప్లాంట్ కావాలని కోరుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఉక్కు పరిశ్రమ ప్రారంభమైతే రాయలసీమకే తలమానికంగా మారుతుందన్నారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమూర్తి, బయ్యన్న, మండల కార్యదర్శి శివనారాయణ, సీఐటీయూ నాయకుడు లక్ష్మీనారాయణ, శివకుమార్ పాల్గొన్నారు.