సాక్షి, హైదరాబాద్: అటవీశాఖలో 2,167 పోస్టుల భర్తీకి రాత పరీక్షలు ఈనెల 11వ తేదీ (ఆదివారం) నుంచి ప్రారంభమవుతాయి. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసరు-151, ఫారెస్ట్ బీట్ ఆఫీసరు-751, అసిస్టెంట్ బీట్ ఆఫీసరు-1,224, థానేదార్లు-16, బంగళా వాచర్లు-11, టెక్నికల్ అసిస్టెంట్లు-14 పోస్టుల భర్తీ కోసం అటవీశాఖ ఫిబ్రవరి 14న నోటిఫికేషన్ జారీ చేసింది. వీటికి మొత్తం 3.15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మార్చిలోనే పరీక్షలు నిర్వహించాలని తొలుత నిర్ణయించినా, ఎన్నికల నియమావళి కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. రాష్ట్రంలో ఎన్నికలు పూర్తి కావడంతో ఆదివారం నుంచి పరీక్షల నిర్వహణకు అటవీశాఖ, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) సంయుక్తంగా ఏర్పాట్లు చేశాయి.
అభ్యర్థులు హాల్‌టికెట్లను www.forest.ap.nic.in లేదా www.apfdrt.org అనే వెబ్‌సైట్ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షల సమయం వివరాలు కూడా ఈ వెబ్‌సైట్లలో ఉన్నాయని రాష్ట్ర అటవీ దళాల అధిపతి, రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణాధికారి (పీసీసీఎఫ్) బీఎస్‌ఎస్ రెడ్డి తెలిపారు. అభ్యర్థులందరికీ మూడు రకాల పరీక్షలు ఉంటాయి. ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ జనరల్ నాలెడ్జి, 11 నుంచి 12.30 గంటల వరకూ మ్యాథ్స్, అరగంట భోజన విరామం తర్వాత మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకూ జనరల్ ఎస్సే పరీక్షలు ఉంటాయి. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రం మొదటి రెండు పరీక్షలు యథాతథంగా ఉంటాయి. వీరికి మూడో పరీక్షగా మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్ ట్రేడ్ పరీక్ష ఉంటుంది.
పరీక్ష తేదీల వివరాలు
పోస్టు పరీక్ష తేదీ
అసిస్టెంట్ బీట్ ఆఫీసరు 11.5.14
బంగళా వాచర్ 12.5.14
థానేదార్ 13.5.14
టెక్నికల్ అసిస్టెంట్ 14.5.14
ఫారెస్ట్ బీట్ ఆఫీసరు 18.5.14
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసరు 25.5.14