
రియల్టర్ల కోసమే ‘విజయవాడ’
హైకోర్టు మాజీ న్యాయమూర్తి పి.లక్ష్మణరెడ్డి మండిపాటు
హైదరాబాద్: రియల్‌ఎస్టేట్ వ్యాపారుల కోసమే విజయవాడ కేంద్రంగా రాజధానిని ఏర్పాటు చేస్తున్నారని హైకోర్టు మాజీ న్యాయమూర్తి పి.లక్ష్మణ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే తెలుగు ప్రజలు మరోసారి విడిపోవాల్సి వస్తుందన్నారు. గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (జీఆర్‌ఏటీ) ఆధ్వర్వంలో ఆదివారం భెల్ నర్సరీలో ఏర్పా టు చేసిన కార్తీక మాస వన భోజనాల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు.
ఈ సందర్భంగా జస్టిస్ లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ, రాయలసీమ ప్రాంతం ఎన్నో విధాలుగా నష్టపోయిందన్నారు. తమిళ ప్రజల సం స్కృతి, సంప్రదాయాలతో కలసిపోయే రాయలసీమ వాసులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అంత సుముఖత వ్యక్తం చేయలేదని, దీంతో ఆంధ్రా ప్రాంత నాయకులు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు రాయలసీమ వాసుల సహకారం లేనిదే సాధ్యం కాదని గ్రహించి శ్రీ భాగ్ ఒప్పం దం చేశారన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు పార్లమెంటు ప్రత్యేక ప్యాకేజి ఇచ్చినప్పటికీ వాటి గురించి మాట్లాడకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్యాకేజీ విషయమే చర్చిస్తున్నారని పేర్కొన్నారు. ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థను కూడా గుంటూరులోనే పెట్టేందుకు యోచిస్తున్నారని, దాన్ని రాయలసీమలో ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. సంఘటితంగా పోరాడి రాయలసీమ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎ.హనుమంత రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతం ఎప్పుడూ నష్టపోతోందన్నారు.
ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి జీఆర్ రెడ్డి, పారిశ్రామిక వేత్త వీఎల్‌ఎన్ రెడ్డి, కార్యక్రమ నిర్వాహకులు ఓబుల్‌రెడ్డి, రాధాకృష్ణారావు, శ్యామలా రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.