
మాజీ మావోయిస్టు ఆజాద్ దీక్ష విరమణ
అమందస: పెండింగు కేసుల విచారణ సత్వరమే పూర్తి చేస్తామని ఒడిశా అధికారులు భరోసా ఇవ్వడంతో భువనేశ్వర్‌లోని జార్పడ్ జైలులో నిరాహార దీక్ష చేస్తున్న మాజీ మావోయిస్టు దున్న కేశవరావు అలియాస్ ఆజాద్ దీక్ష విరమించారు. ఆయన తల్లి కాములమ్మ ఈ విషయం తెలిపారు. జైలులు ఉన్న ఆజాద్ కలిసి తిరిగి వచ్చిన ఆమె శనివారం స్వగ్రామమైన మందస మండలం నల్లబొడ్డులూరులో విలేకరులతో మాట్లాడారు. 2011 మే 18న లొంగిపోయిన కేశవరావును కొద్దిరోజుల వ్యవధిలోనే విచారణ పేరుతో ఒడిశా పోలీసులు తీసుకెళ్లి నిర్బంధించిన విషయం తెలిసిందే. ఇందుకు నిరసనగా ఈ నెల 23 నుంచి జార్పడ్ జైలులోనే ఆజాద్ నిరవధిక దీక్ష చేపట్టినట్లు కాములమ్మ ఇంతకుముందు వెల్లడించారు.
దీనిపై పత్రికల్లో వార్తలు రావడంతో స్పందించిన ఒడిశా ప్రభుత్వం తనకు రమ్మని కబురు పంపడంతో ఈ నెల 27న జార్పడ్ జైలుకు వెళ్లానని ఆమె చెప్పారు. ఖర్దా జిల్లా కలెక్టర్ నిరంజన్ సాహు, అడిషనల్ డీజీ ప్రదీప్‌కపూర్‌లు కూడా జైలుకు వచ్చి తమతో మాట్లాడారని చెప్పారు. ఆజాద్‌పై ఉన్న కేసుల విచారణను సత్వరమే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. అలాగే కొత్తగా కేసులు పెట్టకుండా చూస్తామని, పోలీసు వేధింపులు లేకుండా చూస్తామని తన కుమారుడికి భరోసా ఇవ్వడంతో ఈ నెల 27న అతనితో పాటు మరో ఆరుగురు దీక్ష విరమించారని కాములమ్మ వెల్లడించారు. ఒడిశా ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి భరోసా ఇచ్చినందుకు కృతజ్ఙతలు తెలిపారు.