సాగు కష్టాలతో పాటు సర్ప భయాలు.. | Formers Have Snake Fears Along With Cultivation | Sakshi
Sakshi News home page

సాగు కష్టాలతో పాటు సర్ప భయాలు..

Published Sat, Jun 29 2019 1:32 PM | Last Updated on Sat, Jun 29 2019 1:33 PM

Formers Have Snake Fears Along With Cultivation  - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : తొలకరి పలకరించింది. రైతు పొలం బాట పడుతున్నాడు. సాగు కష్టాలతో పాటు సర్ప భయాలు కూడా అన్నదాతను వెంటాడుతుంటాయి. పల్లెల్లో ఇది సర్పాలు బయటకు వచ్చే సమయం. ఎండలు తగ్గి కాసింత చల్లదనం ఉంటే సరి.. పాములు బయటకు వచ్చి సేద తీరడానికి చూస్తుంటాయి. ఇలాంటి సందర్భాల్లోనే రైతులు పాముకాట్లకు గురై ప్రాణాలు కోల్పోతుంటారు. ఆస్పత్రుల్లో పాముకాటు మందులు ఉన్నా చాలా మంది నాటు వైద్యానికి, ఆర్‌ఎంపీల వద్ద వైద్యానికే వెళ్తుండడంతో ప్రాణనష్టం తప్పడం లేదు. అందుకే సాగు సమయంలో పాములతో కాసింత జాగ్రత్తగా ఉండాలని, కాటు వేశాక తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన పెంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

వానల్లో..
జూన్, జూలై మాసాలు రైతులకు చాలా కీలకం. పొలం పనులు మొదలుపెట్టి రాత్రీ పగలు ఆ గట్ల మీదుగానే తిరగాల్సి ఉంటుంది. ఇలా వెళ్లినప్పుడు, తన పని తాను చేసుకంటున్న సమయాల్లోను పాము కాటుకు గురయ్యే ప్రమాదం లేకపోలేదు. పొలాల గట్లు, రాళ్లు, పుట్టలు వంటి ప్రదేశాల్లో ఉన్న పాములు కూడా ఈ కాలంలో బయటకు వచ్చి సంచరిస్తుంటాయి. రహదారులు, నివాసాల మధ్య కూడా ఈ మధ్య కాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటోంది. పాము కాటు బారిన పడిన సందర్భాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, పాము కాటుకు గురికాకుండా ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలేమిటి అన్న అంశాలపై చాలా మందికి అవగాహన లేక ప్రాణాలు కోల్పోతున్నారు. సొంతవారికి కన్నీళ్లు మిగుల్చుతున్నారు. పాముకాటు జరిగిన గంటలోపు ప్రభుత్వ ఆస్పత్రికి వెళి తే ప్రాణాపాయం తప్పుతుంది. నాటు వైద్యం జోలికి వెళితే అపాయం కొని తెచ్చుకున్నట్లేనని నిపుణులైన వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గ్రా మాల్లో తిరిగే కొందరు సంచి (ఆర్‌ఎంపీ) వైద్యులను నమ్మి మోసపోవడం కంటే ముందే మేలుకుని పాణాలు కాపాడుకోవాలని సూచిస్తున్నారు.

నాలుగు జాతులే విషపూరితం
మన దేశంలో నాలుగు వందలకు పైగా సర్ప జాతులుండగా వాటిలో కేవలం నాలుగు జాతులు మాత్రమే విషపూరితమైనవిగా జీవావరణ వేత్తలు చెబుతున్నారు. నాగు పాము, పొడ పాము(రక్తపింజరి), కట్లపాము(తుట్ట), సముద్రసర్పాలు. ఇవి కరిస్తే ప్రాణానికి ప్రమాదం ఉంది. మిగిలిన జాతుల మాపులు కరిస్తే ఏమీ కాదంటున్నారు. విష సర్పాల్లో నాగుపాముకు పడగ ఉండగా, కర్త పింజరికి ని లువు చారలు ఉం టాయి. కట్ల పాములో రెండు రకాలుండగా ఇండియన్‌ క్రైట్‌ రాత్రి వేళల్లోనే సంచరిస్తుంటాయి. ఈ రకం పా ము అడవులు, కొండ కోనల్లోనే కనిపిస్తాయి. ఇక నలుపు, పసుపు చారలతో ఉంటే గౌరీబెత్తు సైతం విషపూరితమైనదే. కొండల్లోను, పంట పొలాల్లోను కనిపించే కింగ్‌ కోబ్రా జాతికి చెందిన రాచనాగు, వైరానాగులు అరుదైనవి. రాచనాగుకు రంగులు మార్చే స్వభావం ఉంటుంది. అది నివశించే ప్రాంతాన్ని బట్టి గోధుమ, చింత, మొగలి నాగులని పిలుస్తారు. తెలుపు, పచ్చ రంగుల్లో కనిపించే కొన్ని రకాల పాములు జన్యులోపాలతో పుట్టినట్లుగా చెబుతారు. 

సూచనలుపాటించాలి
పాము కరవగానే మంత్రాలు, పచ్చిమిరపకాయలు తినిపిస్తారు. ఇవి అసలు చేయకూడదు. 
పాముకాటుకు గురైన వ్యక్తిని నడిపించడం మంచిది కాదు. మోసుకుని లేదా ఆటో, ద్విచక్ర వాహనంపై తీసుకుని వెళ్లాలి. 
ఆర్‌ఎంపీ, సంచి వైద్యుల సలహాలు పాటించి ఇంటి వద్దనే ఉంచవద్దు. జాప్యం చేయడం వల్ల ప్రాణానికే ప్రమాదం జరుగుతుంది. వీలైనంత తొందరగా నిపుణులైన డాక్టర్‌ వద్దకు చేర్చాలి. 
మూఢనమ్మకాలను అసలు నమ్మవద్దు. మంత్రాలు, పసర మందులతో ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. 

అవగాహనే కీలకం
ఏ పాము కరవగానే భయపడే కంటే ధైర్యంగా ఉండి నాకేమీ కాదన్న నమ్మకాన్ని కలిగించుకోవాలి. ఏ జాతి, ఏ రకం పాము కరచిందో గమనించాలి.
ఏ పాము కాటు వేసిన చోట శుభ్రంగా కడగాలి, విషం శరీరం అంతా ప్రసరణ జరగకుండా చేయాలి. 
ఏ పాము కాటేసిన వెంటనే కాటుకు కొంచెం దూరంలో ఏదైనా తాడు వంటి దానితో గట్టిగా కట్టాలి. దీంతో రక్త ప్రసరణ ఆగిపోతుంది. రక్తంలో కలిసిన విషం శరీర భాగాల్లోకి వెళ్లకుండా నిరోధించవచ్చు. 
ఏ రక్తపింజరి జాతికి చెందిన పాము కాటు వేసిన సందర్భాల్లో చిగుళ్లు, మూత్ర పిండాలు, మూత్రం, మలం నుంచి రక్త స్రావం జరుగుతుంది. 
ఏ నాగుపాము, కట్ల పాములు కరిస్తే కళ్లు మూత పడటం, వాపులు రావటం, నోటి నుంచి నురగలు రావడం, మాట్లాడలేని పరిస్థితి ఏర్పడటం వంటి లక్షణాలు ఉంటాయి. 
ఏ రాత్రులు పొలాలకు వెళ్లే రైతులు విధిగా టార్చిలైట్, చేతికర్ర వెంట తీసుకుని వెళ్లాలి, కాలిమొత్తం వరకు లుంగీ విడిచిపెట్టాలి, వీలైతే ప్యాంట్‌ వేసుకుంటే మంచిదే.
ఏ పొలం గట్లపైన నడిచే సందర్భాల్లో చేతికర్రతో ముందు శబ్ధం చేసుకుంటూ అడుగులు వేయాలి. 
ఏ ఇంటి పరిసరాల్లో పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాన్ని లేకుండా చూడాలి. 

నాటు వైద్యం హానికరం
పాము కాటుకు గురైన వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలి. విషం విరుగుడుకు అవసరమైన మందులను అన్ని ఆస్పత్రుల్లోను అందుబాటులో ఉంచుతున్నారు. ఏ సమయంలో పాము కాటుకు గురైనా వెంటనే గ్రామాల్లోని ప్రభుత్వ వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. వారే ఆస్పత్రికి సిఫార్స్‌ చేస్తారు. ఆస్పత్రిలో అన్ని పరిశీలనలు చేసిన తర్వాత అవసరాన్ని బట్టి మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించడం జరుగుతుంది. నిర్లక్ష్యం చేయడం, సొంత వైద్యం చేయడం, మంత్రాలు, పసర మందుల వల్ల పాము కాటుకు గురైన వ్యక్తికి ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది. పాముకాటు విషం విరుగుడు మందులు ఆస్పత్రిలో అందుబాటులో ఉంచడం జరిగింది. బాధితులు ప్రభుత్వ ఆస్పత్రి సేవలను వినియోగించుకోవాలి. 
– రెడ్డి హేమలత, ప్రభుత్వ డాక్టర్, లక్ష్మీనర్సుపేట పీహెచ్‌సీ, ఎల్‌.ఎన్‌.పేట

పాముల్ని చంపడం నేరమే
కొండ చిలువలు, ఇతర పాముల్ని చంపడం వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఉల్లంఘణ కిందకు వ స్తుంది. ఇది పెద్ద నేరమే. ఇలాం టి చర్యలకు పాల్పడేవారికి వైల్డ్‌లైఫ్‌ చట్టం 1972లో సెక్షన్‌ 61(1), (2) ప్రకారం రెండేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.10వేలు వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కేవలం జరిమానాతో విడిచిపెట్టే అవకాశం లేదు. 
– జగదీశ్వరరావు, ఫారెస్ట్‌ రేంజర్, పాలకొండ సెక్షన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement