జిల్లాలో అక్షరాస్యత
చిలకలూరిపేట రూరల్: సాక్షర భారత్ కార్యక్రమం అమలుతో జిల్లాలో అక్షరం వెలుగుతోంది. గత నాలుగేళ్లలో 2.53 లక్షల మంది చదవటం, రాయటం నేర్చుకున్నారు. ఫలితంగా అక్షరాస్యతలో నూతన ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాకు ఆరవ స్థానం లభించింది. అక్షరాస్యతలో ముందుంటేనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమని గుర్తించిన అధికారులు, సాక్షర భారత్ వలంటీర్లు చేసిన కృషి వల్లే ఇది సాధ్యమైంది.
2001 జనాభా లెక్కల ప్రకారం సమైక్య రాష్ట్రంలో గుంటూరు జిల్లా 62.54 శాతం అక్షరాస్యతతో 11వ స్థానంలో ఉండగా 2011లో 67.99 శాతం అక్షరాస్యతతో 8వ స్థానానికి చేరింది. తాజా గణాంకాల ప్రకారం కొత్త రాష్ట్రంలో 6వ స్థానం దక్కించుకుంది.
జిల్లాలో 2010 ఆగస్టు 15న సాక్షర భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారులు, వలంటీర్ల కృషి కారణంగా నాలుగేళ్లలో జిల్లాలో అక్షరాస్యత 5.45 శాతం మేర పెరిగింది. పురుషుల్లో అక్షరాస్యత 74.79 శాతం కాగా మహిళల అక్షరాస్యత 60.09 శాతం.
జిల్లాలోని 57 మండలాల్లోని 987 గ్రామ పంచాయతీల్లో 1974 సాక్షర భారత్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2010లో గుర్తించిన నిరక్షరాస్యుల సంఖ్య 9.27 లక్షలు కాగా వీరిలో 4.40 లక్షల మంది పురుషులు, 4.87 లక్షల మంది స్త్రీలు ఉన్నారు.
గత నాలుగేళ్లలో మూడు దశల్లో 2,53,879 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దారు. వీరిలో 53,334 మంది పురుషులు కాగా 2,00,545 మంది స్త్రీలు ఉండటం విశేషం.
అక్షరాస్యతలో తెనాలి మండలం ప్రథమ స్థానంలో(79.89 శాతం) ఉండగా బొల్లాపల్లి
మండలం 40.72 శాతంతో చివరి స్థానంలో ఉంది. 39 మండలాల్లో 60 నుంచి 80 శాతం అక్షరాస్యత ఉండగా మూడు మండలాల్లో(నూజెండ్ల, వెల్దుర్తి, బొల్లాపల్లి) 50 శాతం కన్నా తక్కువ ఉంది.
2017 నాటికి నూరుశాతం సాధిస్తాం..
జిల్లావ్యాప్తంగా 2010లో నిర్వహించిన కుటుం బ సర్వేలో 9.27 లక్షల మంది నిరక్ష్యరాస్యులు ఉన్న ట్లు గుర్తిం చాం. ఇప్పటివరకు 2,53,879 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాం. 2017 నాటికి అందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతాం. ప్రధానంగా మహిళలపై దృష్టి సారిస్తున్నాం. ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా సోమవారం 987 గ్రామ పంచాయతీల్లో ఐదో విడత ప్రాథమిక అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇందులో 59,220 మందిని అక్షరాస్యులుగా చేయాలని నిర్ణయించాం.
-ఎస్.శారద, డీడీ,
వయోజన విద్య
ముందడుగు
Published Mon, Sep 8 2014 2:08 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement