హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనివార్యమైన నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పార్టీ నుంచి వైదొలిగేందుకు సన్నద్ధమవుతున్నారు. కేంద్ర మంత్రులతో పాటు, రాష్ట్ర నేతలూ ఇదే బాటలో పయనిస్తున్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందిన అనంతరం పలువురు కాంగ్రెస్ నేతలు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. జిల్లాల్లో కీలకపాత్ర పోషిస్తూ కాంగ్రెస్ వెన్నుదన్నుగా ఉంటున్న డీసీసీ అధ్యక్షులు కూడా రాజీనామాల అంశానికి తెరలేపారు.
ఈ క్రమంలో కొంతమంది డీసీసీ అధ్యక్షులు రాజీనామా లేఖలను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అందజేశారు. రాజీనామా లేఖలు సమర్పించిన వారిలో పశ్చిమగోదావరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, అనంత పురం జిల్లా కు చెందిన మధుసూదన్ గుప్తాతో పాటు వైఎస్సార్ జిల్లా అశోక్‌కుమార్ లు ఉన్నారు. ఈ నలుగురి రాజీనామాలను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆమోదించారు.