వనమా వెంకటేశ్వరరావు
సాక్షి, కొత్తగూడెం: జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రస్తుత కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును మరోసారి వరించింది. వనమాకు ఇష్టం లేకపోయినా రానున్న కీలకమైన పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆయన అయితేనే ఈ పదవికి న్యాయం చేసి కాంగ్రెస్‌ను గెలుపుబాటలో పయనింపచేస్తారనే నమ్మకంతో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. అధిష్టాన నిర్ణయాన్ని కాదనలేక వనమా చివరకు జిల్లా అధ్యక్ష పదవి చేపట్టడానికి సిద్ధమయ్యారని సమాచారం. రాష్ట్రంలోని 31 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన అధిష్టానం.. భద్రాద్రి జిల్లా అధ్యక్షుడిగా వనమా పేరు ప్రకటించింది.
1999 నుంచి 2014 వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వనమా వెంకటేశ్వరరావు కొనసాగారు. ఆయన అధ్యక్ష పదవిలో ఉంటూనే రాష్ట్ర వైద్య విధాన పరిషత్ మంత్రిగా కూడా పనిచేయడం విశేషం. అంతేకాకుండా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ను గెలుపుబాట దిశగా తీసుకువెళ్లడంలో వనమా కీలకపాత్ర పోషించారు. ఉమ్మడి జిల్లాలో ఆయన అనుచరవర్గం అన్ని ప్రాంతాల్లో ఉండటం గమనార్హం. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీచేసి నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
రాష్ట్రం మొత్తంలో టీఆర్‌ఎస్ హవా కొనసాగగా, భద్రాద్రి జిల్లాలో ఒక్కసీటు కూడా టీఆర్‌ఎస్‌కు దక్కకపోగా, అశ్వారావుపేటలో తెలుగుదేశం మినహా కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయబావుటా ఎగురవేసింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మల్లు భట్టి విక్రమార్క ఆశీస్సులతో కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన మోత్కూరి ధర్మారావు, వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రరావు కూడా ఆశించారు.
కానీ రాబోయే పార్లమెం ట్ ఎన్నికల్లో కూడా జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం కావాలంటే సీనియర్ కాం గ్రెస్ నాయకుడైన వనమా వెంకటేశ్వరరావే సరైన వ్యక్తిగా భావించి రాహుల్‌గాంధీ ఆయనకు ఈ బాధ్యత చేపట్టారని తెలిసింది. అయితే జిల్లా కాం గ్రెస్ అధ్యక్ష పదవి పట్ల వనమా వెంకటేశ్వరరావు విముఖత వ్యక్తం చేస్తున్నా ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. వనమా మరోసారి డీసీసీ అధ్యక్ష పదవి చేపడుతుండడంతో జిల్లాలోని కాంగ్రెస్ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment