DCC chiefs
-
మరో చాన్స్
స్టేషన్ మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఒబేదుల్లా కొత్వాల్ మళ్లీ ఆ పదవికి నియామకం అయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆమోదించిన తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాల అధ్యక్షుల జాబితాను ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం ప్రకటించారు. 2012 ఏప్రిల్ మొదటి సారి డీసీసీ అధ్యక్షుడిగా ఎంపికై అప్పట్లో ఏపీలోనే 49 ఏళ్ళ ప్రాయంలో ఆ పదవిని పొందిన పిన్న వయస్సు నేతగా కొత్వాల్ పేరొందారు. ఒబేదుల్లా కొత్వాల్ పాన్‌గల్ మండల కేంద్రంలో 1962 జూన్ 1వ తేదీన జన్మించారు. ఈయన తండ్రి అసదుల్లా కొత్వాల్ పాన్‌గల్ మాజీ సర్పంచుగా, ప్రాథమిక వ్యవసాయ సంఘం అధ్యక్షుడిగా పని చేశారు. 2012 నుంచి ఇప్పటివరకు కొత్వాల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగగా ఈ సారి మిగతా మూడు జిల్లాలకు కూడా వేర్వేరుగా డీసీసీ అధ్యక్షులను నియామకం చేశారు. అయితే డీసీసీ అ«ధ్యక్షుడిగా కొత్వాల్ అయిష్టత వ్యక్తం చేసినప్పటికీ రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన సీనియారిటీని గుర్తించిన అధిష్టానం తిరిగి డీసీసీ అధ్యక్షుడిగా నియామకం చేసినట్లు తెలుస్తోంది. వివాదరహితుడిగా ఉన్న కొత్వాల్ అందరిని కలుపుకుపోయి పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని ముందుకు నడిపిస్తారన్న నమ్మకంతో అధిష్టానం ఆయనను అధ్యక్షుడిగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. విద్యార్థి నేతగా రాజకీయాల్లోకి.. ఇంటర్మీడియెట్ చదివిన రోజుల నుంచే విద్యార్థి నాయకుడిగా ఎదిగిన కొత్వాల్ 1979లో నిజామాబాద్‌లో పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ మహబూబ్‌నగర్‌కు వచ్చిన అనంతరం కూడా 1983 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1983 నుంచి 85 వరకు ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడిగా, 1986 నుంచి యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1986లో న్యాయవాద వృత్తిని ప్రారంభించి మంచి పేరును గడించారు. 1987 నుంచి 1992 వరకు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా,18 ఏళ్ళపాటు డీసీసీ అధికార ప్రతినిధిగా పని చేశారు. 1992లో పాన్‌గల్ సింగిల్ విండో చైర్మన్‌గా ఏకగ్రీవంగా విజయం సాధించి డీసీఎంఎస్ చైర్మన్‌గా ఎన్నికై 1995 వరకు ఆ పదవిలో ఉన్నారు. 1994 ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ టికెట్‌ను సాధించినప్పటికీ రాజకీయ సమీకరణల నేపథ్యంలో అమరచింత అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. 2005 నుంచి 2010 వరకు స్థానిక మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న కొత్వాల్ 2004లో మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. -
డీసీసీ పీఠంపై వనమా
సాక్షి, కొత్తగూడెం: జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రస్తుత కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును మరోసారి వరించింది. వనమాకు ఇష్టం లేకపోయినా రానున్న కీలకమైన పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆయన అయితేనే ఈ పదవికి న్యాయం చేసి కాంగ్రెస్‌ను గెలుపుబాటలో పయనింపచేస్తారనే నమ్మకంతో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. అధిష్టాన నిర్ణయాన్ని కాదనలేక వనమా చివరకు జిల్లా అధ్యక్ష పదవి చేపట్టడానికి సిద్ధమయ్యారని సమాచారం. రాష్ట్రంలోని 31 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన అధిష్టానం.. భద్రాద్రి జిల్లా అధ్యక్షుడిగా వనమా పేరు ప్రకటించింది. 1999 నుంచి 2014 వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వనమా వెంకటేశ్వరరావు కొనసాగారు. ఆయన అధ్యక్ష పదవిలో ఉంటూనే రాష్ట్ర వైద్య విధాన పరిషత్ మంత్రిగా కూడా పనిచేయడం విశేషం. అంతేకాకుండా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ను గెలుపుబాట దిశగా తీసుకువెళ్లడంలో వనమా కీలకపాత్ర పోషించారు. ఉమ్మడి జిల్లాలో ఆయన అనుచరవర్గం అన్ని ప్రాంతాల్లో ఉండటం గమనార్హం. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీచేసి నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్రం మొత్తంలో టీఆర్ఎస్ హవా కొనసాగగా, భద్రాద్రి జిల్లాలో ఒక్కసీటు కూడా టీఆర్ఎస్కు దక్కకపోగా, అశ్వారావుపేటలో తెలుగుదేశం మినహా కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయబావుటా ఎగురవేసింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మల్లు భట్టి విక్రమార్క ఆశీస్సులతో కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన మోత్కూరి ధర్మారావు, వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రరావు కూడా ఆశించారు. కానీ రాబోయే పార్లమెం ట్ ఎన్నికల్లో కూడా జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం కావాలంటే సీనియర్ కాం గ్రెస్ నాయకుడైన వనమా వెంకటేశ్వరరావే సరైన వ్యక్తిగా భావించి రాహుల్‌గాంధీ ఆయనకు ఈ బాధ్యత చేపట్టారని తెలిసింది. అయితే జిల్లా కాం గ్రెస్ అధ్యక్ష పదవి పట్ల వనమా వెంకటేశ్వరరావు విముఖత వ్యక్తం చేస్తున్నా ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. వనమా మరోసారి డీసీసీ అధ్యక్ష పదవి చేపడుతుండడంతో జిల్లాలోని కాంగ్రెస్ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
ఎక్కడ ఎవరు పోటీ...?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎన్నికల సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించారు. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల వారీగా కేంద్రీకృతమై ఉన్న పార్టీ కమిటీ (డీసీసీ)లను కొత్త జిల్లాల స్థాయిలో విస్తరించాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఈ మేరకు కమిటీలు ఏర్పాటు చేయాల్సిన జిల్లాల జాబితాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ ఈనెల 4న అధికారికంగా ప్రకటించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈనెల 13, 14 తేదీల్లో జరిపే రాష్ట్ర పర్యటన ముగిసిన వెంటనే పార్టీ కమిటీలను కొత్త జిల్లాల వారీగా ప్రకటించేందుకు పీసీసీ స్థాయిలో కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలోని నాలుగు జిల్లాలకు కూడా డీసీసీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా నిర్మల్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. రెండు గ్రూపులు... అధ్యక్షుల కోసం పోటాపోటీ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వర్గంగా డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క వర్గంగా మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ఉమ్మడి జిల్లా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల రోజుల నుంచే డీసీసీ పదవుల కోసం రెండు వర్గాలు తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలో నిర్మల్ జిల్లా ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డికి పెట్టనికోటగా ఉందనడంలో సందేహం లేదు. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన ఆయన నిర్మల్‌కు ప్రాతినిథ్యం వహిస్తారా అనేది అనుమానమే. ఒకవేళ ఆయన డీసీసీ అధ్యక్ష పదవిని కాదనుకుంటే ఆయన ఎవరి పేరు చెపితే వారికే ఆ పదవి వస్తుందనడంలో సందేహం లేదు. అయితే మిగతా మూడు జిల్లాల్లో ఆ పరిస్థితి లేదు. సామాజిక సమీకరణాలు, సీనియారిటీ, పీసీసీ స్థాయిలో వర్గాలు అధ్యక్ష పదవి విషయంలో ప్రభావం చూపే అవకాశం ఉంది. మంచిర్యాలలో అధ్యక్ష పదవికి హోరాహోరీ మంచిర్యాలలో డీసీసీ అధ్యక్ష పదవికి రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిత్వానికి ముడిపడే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వర్గంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డితో పాటు భట్టి వర్గంగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు పార్టీ టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఈ పరిస్థితిల్లో డీసీసీ అధ్యక్ష పదవిని అరవింద్‌రెడ్డికే ఇవ్వాలని ఆయన వర్గీయులు కోరుతున్నారు. ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి కూడా మంచిర్యాల విషయంలో అరవింద్‌రెడ్డికే డీసీసీ పీఠం దక్కేలా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో ప్రేంసాగర్‌రావు తన సతీమణి కొక్కిరాల సురేఖను తెరపైకి తెస్తున్నారు. డీసీసీ పదవిని మహిళకు ఇవ్వాలన్న డిమాండ్‌తో ఆయన వర్గీయులు సురేఖను డీసీసీ అధ్యక్షురాలిగా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. కుల సమీకరణాలను పరిగణలోకి తీసుకునే పక్షంలో బీసీ అభ్యర్థిగా బెల్లంపల్లి జెడ్పీటీసీ కె.రాంచందర్‌కు ఆ పదవిని ఇప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు. సురేఖ లేదా రాంచందర్ లలో ఒకరు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు అవుతారని ఆయన వర్గం బాహాటంగానే ప్రచారం సాగిస్తోంది. ఆదిలాబాద్‌లో అదే తీరు ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన భార్గవ్ దేశ్‌పాండే ప్రస్తుతం మహేశ్వర్‌రెడ్డి శిబిరంలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి టిక్కెట్టు ఆశిస్తున్న ఆయన డీసీసీ పీఠంపై కన్నేశారు. ఆయనకు మహేశ్వర్‌రెడ్డి మద్దతు పుష్కలంగా ఉంది. అదే సమయంలో గతంలో పోటీచేసి ఓడిపోయిన గండ్రాత్ సుజాత కూడా ఈసారి పోటీకి సిద్ధపడుతున్నారు. భట్టి వర్గంలో ఉన్న ఆమెకు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు మద్దతిస్తున్నారు. మహిళ కోటాలో మంచిర్యాలలో సురేఖతో పాటు ఆదిలాబాద్‌లో సుజాతకు డీసీసీ పీఠం దక్కేలా పావులు కదుపుతున్న ఆయన ఈ రెంటిలో ఒక చోటైనా తన మాటను చెల్లుబాటు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక్కడ మాజీ మంత్రి రామచంద్రారెడ్డి కూడా టిక్కెట్టు కోసం పోటీపడుతున్నప్పటికీ, డీసీసీ పోరులో లేరని సమాచారం. కుమురంభీంలో బహుముఖ పోటీ కుమురంభీం జిల్లాలో డీసీసీ పీఠంపై ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల నుంచి టిక్కెట్టు ఆశిస్తున్న నలుగురు నాయకులు కన్నేశారు. ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం టిక్కెట్టు రేసులో ముందున్న ఆత్రం సక్కు మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు మద్దతుతో డీసీసీ పీఠం దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయన కాని పక్షంలో గిరిజనేతరుడి కోటాలో సిర్పూర్‌కు చెందిన రావి శ్రీనివాస్‌కు పదవి ఇప్పించేందుకు ప్రేంసాగర్‌రావు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ వర్గంలో ఉన్న సిర్పూర్ నాయకుడు బీసీ కోటాలో గోసుల శ్రీనివాస్ యాదవ్ జిల్లా అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి ఎస్టీ కోటాలో డీసీసీ పీఠంపై కన్నేశారు. వీరిద్దరికి మహేశ్వర్‌రెడ్డి సంపూర్ణ మద్దతు ఉండడం గమనార్హం. కొత్త జిల్లాల వారీగా డీసీసీల నియామకం ఉమ్మడి జిల్లాలో వర్గాల ఆధిపత్యాన్ని తేటతెల్లం చేయనున్నాయి. దీంతో రాజకీయ వర్గాలన్నీ డీసీసీల ఏర్పాటుపైనే దృష్టి కేంద్రీకరించాయి. ఆదిలాబాద్ : భార్గవ్ దేశ్‌పాండే, గండ్రత్ సుజాత మంచిర్యాల : గడ్డం అరవిందరెడ్డి, కె.ప్రేంసాగర్‌రావు కుమురం భీం : ఆత్రం సక్కు, రావి శ్రీనివాస్, గోసుల శ్రీనివాస యాదవ్, సిడాం గణపతి నిర్మల్ : ఏలేటి మహేశ్వర్‌రెడ్డి లేదా ఆయన సూచించిన వారు -
యువతకు అండగా కాంగ్రెస్
యాదగిరిగుట్ట : యువతకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ఏఐసీసీ సభ్యులు, డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. యాదగిరిగుట్ట మండలం బాహుపేటలో వివిధ పార్టీలకు చెందిన యువకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుందన్నారు. యువనేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు, నిరుద్యోగ భృతిని అందించే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇమ్మడి మాధవిరాంరెడ్డి, కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా ఉపాధ్యాక్షుడు చీర శ్రీశైలం, పార్టీ మండల అధ్యక్షుడు బీర్ల అయిలయ్య, పాలసంఘం చైర్మన్ భాస్కర్‌రెడ్డి, యాదాద్రి దేవస్థానం మాజీ ధర్మకర్త పెల్లిమెల్లి శ్రీధర్‌గౌడ్, మండల వర్కింగ్ ప్రసిడెంట్ కానుగు బాలరాజు, గ్రామశాఖ అధ్యక్షులు శంకర్, ప్రభాకర్ తదితరులున్నారు. -
డీసీసీ అధ్యక్షుల రాజీనామాలను ఆమోదించిన బొత్స
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనివార్యమైన నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పార్టీ నుంచి వైదొలిగేందుకు సన్నద్ధమవుతున్నారు. కేంద్ర మంత్రులతో పాటు, రాష్ట్ర నేతలూ ఇదే బాటలో పయనిస్తున్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందిన అనంతరం పలువురు కాంగ్రెస్ నేతలు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. జిల్లాల్లో కీలకపాత్ర పోషిస్తూ కాంగ్రెస్ వెన్నుదన్నుగా ఉంటున్న డీసీసీ అధ్యక్షులు కూడా రాజీనామాల అంశానికి తెరలేపారు. ఈ క్రమంలో కొంతమంది డీసీసీ అధ్యక్షులు రాజీనామా లేఖలను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అందజేశారు. రాజీనామా లేఖలు సమర్పించిన వారిలో పశ్చిమగోదావరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, అనంత పురం జిల్లా కు చెందిన మధుసూదన్ గుప్తాతో పాటు వైఎస్సార్ జిల్లా అశోక్‌కుమార్ లు ఉన్నారు. ఈ నలుగురి రాజీనామాలను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆమోదించారు.