కళ్ల మంటలు, దగ్గు, కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగ బాధ, తడిసిపోయిన కర్రలు వెలగక... మంట కోసం ఊదలేక గుండెలార్చుకుపోయే పరిస్థితి నుంచి బయటపడవచ్చని ఎంతో ఆశతో గ్యాస్ కనెక్షన్లకోసం ఏజెన్సీల వద్దకు వెళుతున్న పేదల ఆశలు నీరుగారిపోతున్నాయి. డబ్బులు చెల్లించలేక, గ్యాస్ కనెక్షన్లు పొందలేకపోతున్నవారి కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ఉచిత గ్యాస్ కనెక్షన్ పథకానికి ఏజెన్సీలు తూట్లు పొడుస్తున్నాయి. అధిక ధరలను వసూలు చేస్తూ , అడ్డమైన ఉత్పత్తులనూ అంటగడుతున్నాయి.
విజయనగరం కంటోన్మెంట్: కేవలం పది రూపాయలు చెల్లిస్తే గ్యాస్ కనెక్షన్, ఖాళీ సిలెండర్ ఉచితంగా అందజేస్తామని, గ్యాస్ ఫిల్‌చేసిన సిలెండర్, ట్యూబ్‌ల కోసం రూ.790లు చెల్లిస్తే సరిపోతుందని ఒక వైపు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంటే జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు మాత్రం అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదంతా తెలిసినా అధికారులు దొంగనిద్ర నటిస్తున్నారు. గ్యాస్ కనెక్షన్ లేని నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ కనెక్షన్ పథకం ఏజెన్సీలకు కాసులవర్షం కురిపిస్తోంది.
జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్యాస్ ఏజెన్సీలలో ఎవరికి నచ్చిన ధరను వారు వసూలు చేస్తున్నారు. తమ దగ్గర గ్యాస్ స్టౌలను కొంటేనే కనెక్షన్ ఇస్తామని నిబంధన విధిస్తున్నారు. కేవలం కనెక్షన్ ను రూ. 790కు ఇవ్వాల్సినప్పటికీ వాటి ధరను రూ.900కు పెంచారు. అలాగే గ్యాస్ స్టౌను బయట కొనుగోలు చేసుకోవచ్చని ప్రారంభంలో ప్రకటించినా ఇప్పుడు తమ వద్దే కొనుగోలు చేయాలని, లేకుంటే గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం కుదరదని తెగేసిచెబుతున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు.దీంతో గత్యంతరం లేక వారి వద్దే అధిక ధరకు స్టౌలను కొనుగోలు చేస్తున్నామని బాబామెట్ట, గాజుల రేగ ప్రాంతాలకు చెందిన మహిళలు వాపోయారు. కొన్ని ఏజెన్సీలు కుక్కర్లు, మరికొన్ని ఏజెన్సీలు వివిధ కంపెనీలకు చెందిన టీ పొడులు అంటగడుతున్నారు.
46 వేలు మాత్రమే మంజూరు
జిల్లాలో బీపీసీ, ఐఓసీ,హెచ్‌పీ కంపెనీలకు సంబంధించి 63 వేల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం 46 వేలు మాత్రమే మంజూరయ్యాయి. ఇందులో హెచ్‌పీసీఎల్ కంపెనీకి ఎక్కువ కనెక్షన్లు కేటాయించారు. హెచ్‌పీకి 32 వేలు, ఐఓసీకి 8,500, బీపీసీకి 5,500 కనెక్షన్లు కేటాయించారు. ఆయా కంపెనీలు ఏజెన్సీల వారీగా జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. ప్రారంభంలో ప్రకటించిన విధంగా రూ.790లు తీసుకుని వెళితే ఏకంగా 2,900 చెల్లించాలని కొన్ని ఏజెన్సీలు చెబుతున్నాయి.
మరికొన్ని ఏజెన్సీలు రూ.3,080 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ట్యూబు కోసం రూ.190లు, పుస్తకానికి రూ.50లు, స్టౌధర రూ.1975 నుంచి 2,300 వరకూ టీపొడి రూ.107లు, గ్యాస్ కోసం రూ.651.50లు వసూలు చేస్తున్నారు. దీంతో అంతసొమ్ము చెల్లించలేక చాలా మంది కనెక్షన్లను తీసుకోకుండా వెనుదిరుగుతున్నారు. గతంలో మంజూరైన 16,000 దీపం కనెక్షన్లను కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. గ్యాస్ ఏజెన్సీలపై ఆరోపణలు వెల్లువెత్తడంతో కలెక్టర్ సమీక్ష నిర్వహించి ఎక్కువ ధరలకు విక్రయిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమీక్ష జరిగి కనీసం పది రోజులయినా గడవక ముందే ఈ విధంగా ఏజెన్సీలు వ్యాపారం చేసుకుంటున్నాయి.
ఉచితం గ్యాస్!
Published Fri, Jul 31 2015 1:52 AM | Last Updated on Sat, Aug 11 2018 4:36 PM
Advertisement
Advertisement