గుండె శస్త్ర చికిత్సలు చేసిన చిన్నారులతో వైద్య బృందం
లబ్బీపేట(విజయవాడతూర్పు): పుట్టుకతోనే చిల్లుపడిన పసిహృదయాలకు యూకే వైద్యులు ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఇక్కడి వైద్యులకు సాధ్యం కానీ అత్యంత క్లిష్టతరమైన కాంప్లెక్స్ సర్జరీలను సైతం విజయవంతంగా నిర్వహిస్తూ చిన్నారులకు పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. రెండున్న సంవత్సరాలుగా 13 ప్రత్యేక క్యాంపులు నిర్వహించి 274 మంది చిన్నారులకు ఉచిత శస్త్ర చికిత్సలు నిర్వహించారు. అందులో భాగంగా ఈనెల 18 నుంచి నిర్వహిస్తున్న క్యాంపులో తొమ్మిది మంది ఇంగ్లాండ్‌కు చెందిన వైద్య నిపుణులు పాల్గొని 22 మంది చిన్నారులకు విజయవంతంగా శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు ఆంధ్రా హాస్పటల్ పిడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పీవీ రామారావు చెప్పారు. శుక్రవారం ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఆధునిక సదుపాయాలతోనే
ఆంధ్రాహాస్పటల్స్‌లో ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉండటం వల్ల క్లిష్టతరమైన సమస్యలకు సైతం విజయవంతంగా శస్త్ర చికిత్సలు నిర్వహించగలుగుతున్నామని హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఫౌండర్ డాక్టర్ సంజీవ్ నిచానీ చెప్పారు. తమ చారిటీ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి మంది చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్‌లు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందులో భాగంగా ఆంధ్రా హాస్పటల్స్‌లో 274 మందికి విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. సమావేశంలో ఆంధ్రా హాస్పటల్ పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ కుడుముల, కార్డియాలజిస్ట్ డాక్టర్ జె శ్రీమన్నారాయణ, కార్డియాక్ సర్జన్ డాక్టర్ దిలీప్, అనస్థీషియన్ డాక్టర్ రమేష్‌లతోపాటు, యూకే వైద్యులు పాల్గొన్నారు.
సాక్షి కథనంతో...
మా పాప తేజశ్వినికి ఐదేళ్లు. పుట్టుకతోనే గుండెకు రెండు రంథ్రాలతో పాటు, వాల్వ్‌లు లీకవుతున్నట్లు నిర్ధారించారని వైఎస్సార్ కడప జిల్లా కడపకు చెందిన నరసారెడ్డి చెప్పారు. వైద్యం కోసం ఎక్కడకు వెళ్లినా ఇంకా వయస్సు పెరగాలని చెబుతుండేవారని పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబరు 9న సాక్షిలో ప్రచురితమైన కథనం చూసి ఆంధ్రా హాస్పటల్స్‌లో సంప్రదించామని, ఇప్పుడు తమ పాపకు ఉచితంగా ఆపరేషన్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలా అనేక మంది సాక్షి కథనాలతో తమ పిల్లలకు పునర్జన్మను ప్రసాదించినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment