నకిలీ స్టాంపుల ముఠా గుట్టు రట్టు | gang of fake stamps is arrested | Sakshi
Sakshi News home page

నకిలీ స్టాంపుల ముఠా గుట్టు రట్టు

Published Tue, May 27 2014 1:41 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

gang of fake stamps is arrested

 ఒంగోలు అర్బన్, న్యూస్‌లైన్ : నకిలీ స్టాంపు పేపర్లతో ప్రజలను మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఈ మేరకు సోమవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఐదుగురు నిందితులను పోలీసులు విలేకరుల ఎదుట హాజరు పరిచారు. నిందితులు వినియోగించిన నకిలీ స్టాంపు పత్రాలు, రబ్బరు స్టాంపులను మీడియాకు చూపారు. ముఠా గుట్టును ఛేదించిన తాలూకా సీఐ ఐ.శ్రీనివాసన్, ఎస్సై పాండురంగారావు, ఏఎస్సై  శ్రీను, హెడ్ కానిస్టేబుళ్లు సీహెచ్ రాము, కె.సురేష్‌లను డీఎస్పీ జాషువా ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వివరించారు.

 బురిడీ కొట్టించేది ఇలా..
 నిందితులు తొలుత 2003వ సంవత్సరానికి ముందు రిజిస్ట్రేషనైన పొలాలు, ప్లాట్ల యజమానులను కలిసి వాటిని అధిక రేట్లకు కొంటామని నమ్మిస్తారు. సరిచూసుకునేందుకు ఆ స్థలాల జిరాక్స్ కాపీలు తీసుకుంటారు. ఇక అక్కడి నుంచి వారి నేర ప్రవృత్తి మొదలవుతుంది. ఆ జిరాక్స్ కాపీల ఆధారంగా నకిలీ స్టాంపు పేపర్లతో ఒరిజినల్ డాక్యుమెంట్లు పోలి ఉండేలా తయారు చేస్తారు. వాటి ఆధారంగా ఆయా స్థలాలు, భవనాలు అమ్మకానికి పెట్టి అడ్వాన్సు రూపంలో కొంత మొత్తం తీసుకుని ఉడాయిస్తారు. మళ్లీ మరో ప్రాంతంలో ఇదేమాదిరిగా రంగంలోకి దిగుతారు. ఈ విధంగా జిల్లాలో సుమారు ఆరు లక్షల రూపాయల మేర ప్రజలకు టోపీ పెట్టినట్లు సమాచారం. మన జిల్లాలోనే కాకుండా గుంటూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో కూడా వీరు మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

 నిందితులు ఎలా చిక్కారంటే..
 పేర్నమిట్ట పంచాయతీ పరిధిలోని అమరా వెంకటసుబ్బయ్య అనే వ్యక్తికి చెందిన ఆస్తి తాలూకా జిరాక్స్ డాక్యుమెంట్లను నిందితులు చాకచక్యంగా సంపాదించారు. వాటిని ఒరిజినల్ డాక్యుమెంట్లుగా సృష్టించి తక్కువ రేటుకే ఆస్తిని ఇస్తామని స్థానిక కర్నూలు రోడ్డులో ఉన్న శ్రీసాయి స్నేహ రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని సంప్రదించారు. కార్యాలయ నిర్వాహకులకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. ఒంగోలు తాలూకా సీఐ ఐ.శ్రీనివాసన్ తన సిబ్బందితో నిఘా వేసి చాకచక్యంగా ముఠా సభ్యులు ఐదుగురిని ఆరెస్టు చేశారు.

నిందితుల్లో ముఠా నాయకుడు చింతం రమణారెడ్డి (గుంటూరు), నకిలీ సంతకాలు పెట్టే దాసరి వెంగయ్య (గుంటూరు), అనధికారికంగా రిజిష్టర్ డాక్యుమెంట్లు అందించే డాక్యుమెంట్ రైటర్ మల్లె వెంకటరమణారావు (గుంటూరు), ఊరా వెంకటరత్నాకర భాస్కరరావు (విజయవాడ), నకిలీ రబ్బరు స్టాంపులు తయారు చేసే పల్లాపు ప్రణీత్‌బాబు (గుంటూరు) ఉన్నారు. మరో నిందితుడు ద్వాదసి వెంకట సత్యసూర్యనారాయణ (ఏలూరు) పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులంతా తమతమ బాధ్యతలను ఎంతో నేర్పరితనంతో ఒరిజినల్స్‌కి ఏమాత్రం తీసిపోకుండా నకిలీ డాక్యుమెంట్లు తయారు చేయడంలో దిట్టని వివరించారు. ఈ పూర్తి వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎవరైనా స్థలాల పేరిట అడ్వాన్లు ఇచ్చి, తీసుకున్నవారు పత్తాలేకపోతే పోలీసులను ఆశ్రయించాలని డీఎస్పీ జాషువా సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement