Fake stamp
-
‘రిజిస్ట్రేషన్’ అక్రమాలకు చెక్!
కైలాస్‌నగర్: రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమాల కట్టడికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇన్నాళ్లు మాన్యువల్‌గా సాగిన రిజిస్ట్రేషన్ వ్యవహారాలతో పాటు స్టాంపుల విక్రయాలకు పూర్తిగా స్వస్తి పలికింది. స్టాంపు వెండర్లు బహిరంగ మార్కెట్లో నేరుగా విక్రయించడాన్ని నియంత్రించిన సర్కారు ఆన్లైన్లో వివరాలు నమోదు చేశాకే వాటిని విక్రయించేలా ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్లు కూడా ఏ రోజుకారోజు పూర్తయ్యేలా సబ్‌రిజిస్ట్రార్లకూ బయోమెట్రిక్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో అక్రమాలకు పూర్తిగా చెక్‌పడటంతో పారదర్శకత పెరగనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యేక యూజర్ ఐడీ, పాస్వర్డ్లు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి అనుమతి పొందిన స్టాంప్ వెండర్లకు సబ్ రిజిస్ట్రార్ల మాదిరిగానే వారికి ప్రత్యేక లాగిన్ ఇవ్వడంతో పాటు యూజర్ ఐడీ, పాస్‌వర్డు కూడా కేటాయించారు. వారు ఆ లాగిన్ ద్వారా సబ్రిజిస్ట్రార్ల నుంచి స్టాంపుల విక్రయాలు చేపట్టాల్సి ఉంటుంది. బాండ్ పేపర్లు కూడా ఇదే విధానంలో అమ్మనున్నారు. దీంతో రోజువారీగా ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఎన్ని స్టాంపులు, బాండ్ పేపర్లు విక్రయించారనే లెక్క పక్కాగా తేలనుండటంతో పారదర్శకత పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సబ్ రిజిస్ట్రార్లకూ బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వ్యవహారాలను కూడా ఆన్లైన్లోనే నిర్వహించాలని ఆదేశించిన ప్రభుత్వం సబ్రిజిస్ట్రార్లకు కూడా బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ప్లాట్లు, ఇండ్లు, భూముల రిజిస్ట్రేషన్ల కోసం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చిన ప్రజలు డాక్యుమెంట్స్‌ను అందజేసి, ఫొటో దిగిన తర్వాత ఇదివరకు సబ్ రిజిస్ట్రార్లు చెక్ స్లిప్‌లను తీరిగ్గా పరిశీలించి రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించేవారు. కానీ.. ఇప్పుడలా కుదరదు. ఫొటో దిగిన వెంటనే సబ్‌రిజిస్ట్రార్ తనకు కేటాయించిన ఐడీ ద్వారా బయోమెట్రిక్ విధానంలో ఆన్లైన్లో డాక్యుమెంట్స్‌ను పరిశీలించి అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించాల్సి ఉంటుంది. ఈ విధానంలో ఏ రోజు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆ రోజే పూర్తయ్యే అవకాశం కలుగుతుంది. బుధవారం నుంచే ఈ విధానం అమల్లోకి రావడంతో సర్వర్ డౌన్ సమస్య తలెత్తింది. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు తీవ్రంగా నిరీక్షించాల్సి వచ్చింది. తొలిరోజున అనుకున్న స్థాయిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరగలేదు. సెల్‌ఫోన్ ద్వారా కూడా దరఖాస్తు స్టాంప్‌లను కొనుగోలు చేయాలనుకునేవారు సెల్‌ఫోన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం మొబైల్లో టీయాప్ పోలియో యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలోకి వెళ్లాలి. స్టాంప్స్‌పై క్లిక్ చేసి తమకు అవసరమైన వాటి వివరాలు నమోదు చేసి డబ్బులు చెల్లించాలి. సంబంధిత స్టిప్తో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి స్టాంపులను కొనుగోలు చేయవచ్చు. పారదర్శకత పెరుగుతుంది రిజిస్ట్రేషన్ శాఖ వ్యవహారాలన్నింటినీ ఆన్లైన్లోనే నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగానే ఆన్లైన్లో స్టాంపులు, బాండ్లను విక్రయించేందుకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాత తేదీల్లో విక్రయించేందుకు అవకాశముండదు. సబ్ రిజిస్ట్రార్లకు కూడా బయోమెట్రిక్ అమలు చేస్తుంది. ప్రభుత్వ నిర్ణయంతో పనులు త్వరగా పూర్తికావడంతో పాటు పారదర్శకత పెరగనుంది. – అశోక్, సబ్‌రిజిస్ట్రార్, ఆదిలాబాద్ -
సంతకం.. సంకటం
విజయవాడలో ‘ఫోర్జరీ ముఠా’ రెవెన్యూ వర్గాల్లో కలవరం రంగంలోకి దిగిన పోలీసులు విజయవాడ సిటీ : నగరంలో ఫోర్జరీ ముఠాల కార్యకలాపాలు అధికమయ్యాయి. రెవెన్యూ.. రవాణా.. శాఖ ఏదైనా అధికారుల సంతకాలను ఫోర్జరీ చేస్తూ నకిలీ స్టాంపులతో బురిడీ కొట్టిస్తున్నారు. కీలక శాఖల్లో ఫోర్జరీ సంతకాలతో ధ్రువీకరణ పత్రాల తయారీ వ్యవహారం అధికారులను కలవరపాటుకు గురిచేస్తోంది. విచారణ కోసం వచ్చే ధ్రువీకరణ పత్రాల పరిశీలనలో ఇవి వెలుగుచూస్తున్నాయి. రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగలేక, లంచాల కోసం కొందరు సిబ్బంది వేధింపులు భరించలేక.. అమాయకులు ఫోర్జరీ ముఠాల బారిన పడుతున్నారు. నగరపాలక సంస్థ మంజూరు చేసే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మొదలు రెవెన్యూ శాఖ జారీచేసే కుటుంబ ధ్రువీకరణ పత్రాలు, అడంగల్ కాపీలు, రవాణా శాఖ జారీచేసే వాహనాల సి-బుక్కులు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చే బీమా పత్రాలు, భూముల రిజిస్ట్రేషన్లు.. ఇలా ఏ ఒక్కదాన్నీ ఈ ఫోర్జరీ ముఠాలు వదలడం లేదు. ఆయా ధ్రువీకరణ పత్రాలు కావాల్సినవారిని తమ ఏజెంట్ల ద్వారా గుర్తించి నకిలీవి అంటగడుతున్నారు. అప్పటికప్పుడు పని జరిగిపోతుండడంతో ఈ ముఠాల ద్వారా ధ్రువీకరణ పత్రాలు తీసుకున్నవారు మిన్నుకుండిపోతున్నారు. సిబ్బంది సహకారం విజయవాడలో పెద్ద సంఖ్యలో ఫోర్జరీ సంతకాల ముఠాలు ఉన్నట్లు నిఘావర్గాల సమాచారం. వీరికి కొన్ని ప్రభుత్వ శాఖల్లోని సిబ్బంది సహకారం ఉంది. ఉన్నతాధికారుల సంతకాలను వీరు ఫోర్జరీ చేసి నకిలీ ధ్రువీకరణ పత్రాలు తయారుచేస్తున్నారు. ఆయా కార్యాలయాల ముద్ర (రబ్బర్ స్టాంపు)లను కూడా వీరు తయారుచేయించి ఉపయోగిస్తున్నారు. ఇందుకు ఆయా ప్రభుత్వ శాఖల్లోని కొందరు సిబ్బంది సహకారం కూడా ఉన్నట్లు వినికిడి. ఉన్నతాధికారుల నమూనా సంతకాలను అందజేయడంతోపాటు తమ సంస్థ ఉపయోగించే ముద్రల వివరాలను కూడా ఈ ముఠాల సభ్యులకు చేరవేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకు భారీగానే ప్రతిఫలం పొందుతున్నారు. పొంచి ఉన్న ప్రమాదం విజయవాడను రాజధానిగా చేస్తారని ప్రచారం జరగడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. భారీగా కొనుగోళ్లు, అమ్మకాలకు రంగం సిద్ధమైంది. ఈ తరుణంలో ఫోర్జరీ ముఠాలు రంగప్రవేశం చేసి నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు తయారుచేసే అవకాశం ఉందనే ఆందోళన పలువురు వ్యక్తం చేస్తున్నారు. గతంలో హైదరాబాద్‌లో ఈ తరహా మోసాలు భారీగా జరిగేవి. ఇప్పుడీ ముఠాల దృష్టి నగరంపై పడినట్లు తెలుస్తోంది. కూపీ లాగుతున్న పోలీసులు ఫోర్జరీ ముఠాల వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. తాజాగా కిడ్నీ దానం కోసం తన సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ కుటుంబ ధ్రువీకరణ పత్రం తయారు చేశారంటూ అర్బన్ తహశీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరు నెలల కిందట కూడా కృష్ణలంక పోలీసు స్టేషన్ పరిధిలో ఇదే తరహా మోసం జరిగింది. అప్పట్లో విచారణ జరిపిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మూడు నెలల కిందట టాస్క్‌ఫోర్స్ పోలీసులు నకిలీ బీమా పత్రాలు తయారు చేసి చెలామణి చేస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. చిట్టినగర్‌కు చెందిన ఆ యువకుడు నకిలీ బీమా పత్రాలు తయారు చేసి ఆయా కంపెనీల ముద్రలను కూడా వేసి సొమ్ము చేసుకున్నాడు. గత ఏడాది చివర్లో గాంధీనగర్ కేంద్రంగా ఫోర్జరీ సంతకాలతో నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు తయారు చేసిన ముఠా సభ్యులను రిజిస్ట్రార్ ఫిర్యాదుతో గవర్నరుపేట పోలీసులు అరెస్టు చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ముఠాల ఆచూకీపై నిఘా వర్గాలు దృష్టిసారించాయి. జి.కొండూరు మండల తహశీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పాస్‌పుస్తకాలు పొందిన ముగ్గురిని కూడా అరెస్ట్‌చేశారు. -
అవినీతి ‘ప్రతినిధులు’
బినామీ రుణాల కుంభకోణంలో ప్రముఖుల పేర్లు రుణగ్రహీతల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీ కుటుంబ సభ్యులు భార్యల పేరున దర్జాగా పాసుపుస్తకాల సృష్టి బుచ్చెయ్యపేట : వారంతా ప్రజాప్రతినిధులు. తమకేదో మంచి చేస్తారన్న నమ్మకంతో ప్రజలు ఏరికోరి గెలిపించుకున్నవారు. తప్పుచేసే వారిని సక్రమమార్గంలో పెట్టాల్సిన వారే వక్రమార్గం అనుసరించారు. జిల్లాలో సంచలనం సృష్టించిన నకిలీ పాసుపుస్తకాలు, బినామీ రుణ వ్యవహారంలో వెల్లడవుతున్న పేర్లు చూసి అధికారులే నోరెళ్లబెడుతున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే అడ్డదారులు వెతకడంపై మండిపడుతున్నారు. తహశీల్దార్, ఆర్డీఓ వంటి ఉన్నతాధికారుల సంతకాలే ఫోర్జరీచేసి, నకిలీ స్టాంప్‌లతో పాసుపుస్తకాలు సృష్టించి లేని భూముల్ని ఉన్నట్లుగా రికార్డులు సృష్టించడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే... మండలంలో బినామీ రుణాల వ్యవహారం వెలుగు చూడడంతో అధికారులు అనుమానం ఉన్న 255 పట్టాదారు పాసుపుస్తకాలు స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా విచారిస్తున్నారు. ఇప్పటి వరకు 75 పుస్తకాలు పరిశీలించగా 52 నకిలీవని తేలింది. నీలకంఠాపురం సర్పంచ్ భార్య ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికాగా అదే గ్రామానికి చెందిన మరో సామాజిక వర్గం వ్యక్తి కుమార్తెగా పట్టాదారు పాసుపుస్తకం సృష్టించారు. వాస్తవంగా భూమి లేకపోయినా సర్వే నంబర్ 86/3, 94/2, 95/1లో 4.72 ఎకరాల భూమి ఆమెకు ఉన్నట్లు పాసుపుస్తకం సృష్టించి బ్యాంకు నుంచి రుణం పొందారు. మల్లాం ఎంపీటీసీ మాజీ సభ్యురాలికి ఆర్.భీమవరంలోని సర్వే నంబర్ 816లో సెంటు భూమి లేదు. కానీ తనకు 4.32 ఎకరాల భూమి ఉన్నట్లు నకిలీ పాసుపుస్తకం సృష్టించి రుణం పొందారు. కొండెంపూడి, కోమళ్లపూడి, తురకలపూడి, గంటికొర్లాం, పెదపూడి, చినభీమవరం, బుచ్చెయ్యపేట, పోలేపల్లి, కొండపాలెం, పెదమదీన, గున్నెంపూడి, రాజాం, చిట్టియ్యపాలెం, తైపురం తదితర గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధుల పేర్లు కీలకంగా వినిపిస్తున్నాయి. సర్పంచ్‌లు, మాజీలు, ఎంపీటీసీ సభ్యులు, మాజీలు, ఎంపీటీసీలు, సహకార, డెయిరీ సభ్యులు, పలుకుబడి ఉన్న నాయకులు, ఉద్యోగులు కూడా ఈ వ్యవహారంలో తమవంతు భాగాన్ని సొంతం చేసుకున్నారు. జేసీ విచారణ జరపడం, బాధ్యులపై క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించడం, రెవెన్యూ అధికారులు పరిశీలన వేగవంతం చేయడంతో ‘బినామీ’దార్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పరిస్థితి ప్రమాదకరంగా కనిపిస్తుండడంతో ఎమ్మెల్యే, మంత్రులను ఆశ్రయించి విచారణ తప్పుతోవ పట్టించేం దుకు అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తారన్నది చూడాల్సి ఉంది. మరోవైపు అన్నిపుస్తకాల పరిశీలన అనంతరం మరెంతమంది బినామీలు వెలుగు చూస్తారో చూడాలి. -
నకిలీ స్టాంపుల ముఠా గుట్టు రట్టు
ఒంగోలు అర్బన్, న్యూస్‌లైన్ : నకిలీ స్టాంపు పేపర్లతో ప్రజలను మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఈ మేరకు సోమవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఐదుగురు నిందితులను పోలీసులు విలేకరుల ఎదుట హాజరు పరిచారు. నిందితులు వినియోగించిన నకిలీ స్టాంపు పత్రాలు, రబ్బరు స్టాంపులను మీడియాకు చూపారు. ముఠా గుట్టును ఛేదించిన తాలూకా సీఐ ఐ.శ్రీనివాసన్, ఎస్సై పాండురంగారావు, ఏఎస్సై శ్రీను, హెడ్ కానిస్టేబుళ్లు సీహెచ్ రాము, కె.సురేష్లను డీఎస్పీ జాషువా ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వివరించారు. బురిడీ కొట్టించేది ఇలా.. నిందితులు తొలుత 2003వ సంవత్సరానికి ముందు రిజిస్ట్రేషనైన పొలాలు, ప్లాట్ల యజమానులను కలిసి వాటిని అధిక రేట్లకు కొంటామని నమ్మిస్తారు. సరిచూసుకునేందుకు ఆ స్థలాల జిరాక్స్ కాపీలు తీసుకుంటారు. ఇక అక్కడి నుంచి వారి నేర ప్రవృత్తి మొదలవుతుంది. ఆ జిరాక్స్ కాపీల ఆధారంగా నకిలీ స్టాంపు పేపర్లతో ఒరిజినల్ డాక్యుమెంట్లు పోలి ఉండేలా తయారు చేస్తారు. వాటి ఆధారంగా ఆయా స్థలాలు, భవనాలు అమ్మకానికి పెట్టి అడ్వాన్సు రూపంలో కొంత మొత్తం తీసుకుని ఉడాయిస్తారు. మళ్లీ మరో ప్రాంతంలో ఇదేమాదిరిగా రంగంలోకి దిగుతారు. ఈ విధంగా జిల్లాలో సుమారు ఆరు లక్షల రూపాయల మేర ప్రజలకు టోపీ పెట్టినట్లు సమాచారం. మన జిల్లాలోనే కాకుండా గుంటూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో కూడా వీరు మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులు ఎలా చిక్కారంటే.. పేర్నమిట్ట పంచాయతీ పరిధిలోని అమరా వెంకటసుబ్బయ్య అనే వ్యక్తికి చెందిన ఆస్తి తాలూకా జిరాక్స్ డాక్యుమెంట్లను నిందితులు చాకచక్యంగా సంపాదించారు. వాటిని ఒరిజినల్ డాక్యుమెంట్లుగా సృష్టించి తక్కువ రేటుకే ఆస్తిని ఇస్తామని స్థానిక కర్నూలు రోడ్డులో ఉన్న శ్రీసాయి స్నేహ రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని సంప్రదించారు. కార్యాలయ నిర్వాహకులకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. ఒంగోలు తాలూకా సీఐ ఐ.శ్రీనివాసన్ తన సిబ్బందితో నిఘా వేసి చాకచక్యంగా ముఠా సభ్యులు ఐదుగురిని ఆరెస్టు చేశారు. నిందితుల్లో ముఠా నాయకుడు చింతం రమణారెడ్డి (గుంటూరు), నకిలీ సంతకాలు పెట్టే దాసరి వెంగయ్య (గుంటూరు), అనధికారికంగా రిజిష్టర్ డాక్యుమెంట్లు అందించే డాక్యుమెంట్ రైటర్ మల్లె వెంకటరమణారావు (గుంటూరు), ఊరా వెంకటరత్నాకర భాస్కరరావు (విజయవాడ), నకిలీ రబ్బరు స్టాంపులు తయారు చేసే పల్లాపు ప్రణీత్‌బాబు (గుంటూరు) ఉన్నారు. మరో నిందితుడు ద్వాదసి వెంకట సత్యసూర్యనారాయణ (ఏలూరు) పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులంతా తమతమ బాధ్యతలను ఎంతో నేర్పరితనంతో ఒరిజినల్స్‌కి ఏమాత్రం తీసిపోకుండా నకిలీ డాక్యుమెంట్లు తయారు చేయడంలో దిట్టని వివరించారు. ఈ పూర్తి వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎవరైనా స్థలాల పేరిట అడ్వాన్లు ఇచ్చి, తీసుకున్నవారు పత్తాలేకపోతే పోలీసులను ఆశ్రయించాలని డీఎస్పీ జాషువా సూచించారు.