కైలాస్‌నగర్: రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమాల కట్టడికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇన్నాళ్లు మాన్యువల్‌గా సాగిన రిజిస్ట్రేషన్ వ్యవహారాలతో పాటు స్టాంపుల విక్రయాలకు పూర్తిగా స్వస్తి పలికింది. స్టాంపు వెండర్లు బహిరంగ మార్కెట్‌లో నేరుగా విక్రయించడాన్ని నియంత్రించిన సర్కారు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేశాకే వాటిని విక్రయించేలా ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్లు కూడా ఏ రోజుకారోజు పూర్తయ్యేలా సబ్‌రిజిస్ట్రార్లకూ బయోమెట్రిక్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో అక్రమాలకు పూర్తిగా చెక్‌పడటంతో పారదర్శకత పెరగనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రత్యేక యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లు
జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి అనుమతి పొందిన స్టాంప్ వెండర్లకు సబ్ రిజిస్ట్రార్ల మాదిరిగానే వారికి ప్రత్యేక లాగిన్ ఇవ్వడంతో పాటు యూజర్ ఐడీ, పాస్‌వర్డు కూడా కేటాయించారు. వారు ఆ లాగిన్ ద్వారా సబ్‌రిజిస్ట్రార్ల నుంచి స్టాంపుల విక్రయాలు చేపట్టాల్సి ఉంటుంది. బాండ్ పేపర్లు కూడా ఇదే విధానంలో అమ్మనున్నారు. దీంతో రోజువారీగా ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఎన్ని స్టాంపులు, బాండ్ పేపర్లు విక్రయించారనే లెక్క పక్కాగా తేలనుండటంతో పారదర్శకత పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సబ్ రిజిస్ట్రార్లకూ బయోమెట్రిక్
రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వ్యవహారాలను కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని ఆదేశించిన ప్రభుత్వం సబ్‌రిజిస్ట్రార్లకు కూడా బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ప్లాట్లు, ఇండ్లు, భూముల రిజిస్ట్రేషన్ల కోసం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చిన ప్రజలు డాక్యుమెంట్స్‌ను అందజేసి, ఫొటో దిగిన తర్వాత ఇదివరకు సబ్ రిజిస్ట్రార్లు చెక్ స్లిప్‌లను తీరిగ్గా పరిశీలించి రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించేవారు. కానీ.. ఇప్పుడలా కుదరదు.
ఫొటో దిగిన వెంటనే సబ్‌రిజిస్ట్రార్ తనకు కేటాయించిన ఐడీ ద్వారా బయోమెట్రిక్ విధానంలో ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్స్‌ను పరిశీలించి అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించాల్సి ఉంటుంది. ఈ విధానంలో ఏ రోజు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆ రోజే పూర్తయ్యే అవకాశం కలుగుతుంది. బుధవారం నుంచే ఈ విధానం అమల్లోకి రావడంతో సర్వర్ డౌన్ సమస్య తలెత్తింది. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు తీవ్రంగా నిరీక్షించాల్సి వచ్చింది. తొలిరోజున అనుకున్న స్థాయిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరగలేదు.
సెల్‌ఫోన్ ద్వారా కూడా దరఖాస్తు
స్టాంప్‌లను కొనుగోలు చేయాలనుకునేవారు సెల్‌ఫోన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం మొబైల్‌లో టీయాప్ పోలియో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలోకి వెళ్లాలి. స్టాంప్స్‌పై క్లిక్ చేసి తమకు అవసరమైన వాటి వివరాలు నమోదు చేసి డబ్బులు చెల్లించాలి. సంబంధిత స్టిప్‌తో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి స్టాంపులను కొనుగోలు చేయవచ్చు.
పారదర్శకత పెరుగుతుంది
రిజిస్ట్రేషన్ శాఖ వ్యవహారాలన్నింటినీ ఆన్‌లైన్‌లోనే నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగానే ఆన్‌లైన్‌లో స్టాంపులు, బాండ్లను విక్రయించేందుకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాత తేదీల్లో విక్రయించేందుకు అవకాశముండదు. సబ్ రిజిస్ట్రార్లకు కూడా బయోమెట్రిక్ అమలు చేస్తుంది. ప్రభుత్వ నిర్ణయంతో పనులు త్వరగా పూర్తికావడంతో పాటు పారదర్శకత పెరగనుంది.
– అశోక్, సబ్‌రిజిస్ట్రార్, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment