
విమానం రూట్‌లోనే రైలు.!
● ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు గ్రీన్‌సిగ్నల్ ● రైల్వేలైన్‌పైనా పెరుగుతున్న డిమాండ్ ● నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు అవసరం ● కొలిక్కి వస్తోందంటున్న జిల్లా నేతలు
నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్‌జిల్లా ఇప్పటికీ వెనుకబడి ఉండటంలో ప్రధాన లోపం రవాణావ్యవస్థనే. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో విమానయానానికి వాయుసేన నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. ఇదేక్రమంలో జిల్లా మీదుగా రైల్వేలైన్ నిర్మాణాన్నీ వేగవంతం చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇందుకు తగ్గట్లుగా ఎంపీ నగేశ్, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి తరచూ కేంద్రమంత్రిని కలుస్తున్నారు. తాజాగా ఈనెల 5న మరోసారి కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌ను ఎంపీ నగేశ్ కలిశారు. ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ రైల్వేలైన్‌కు సంబంధించి సర్వే పూర్తయినందున మిగతా పనులు వేగవంతం చేయాలని కోరారు.
రూట్ సర్వే పూర్తి..!
ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు రైల్వేలైన్ నిర్మాణానికి సంబంధించి రూట్ సర్వే పూర్తయ్యింది. దాదాపు ఎన్‌హెచ్–44 వెంటే ఈ లైన్ వెళ్లనున్నట్లు అంచనా. కొన్నిచోట్ల మాత్రం ఈ రూట్‌లో ప్రజాప్రతినిధులు మార్పులు–చేర్పులు సూచించినట్లు తెలుస్తోంది. భూత ల సర్వే పూర్తికావడంతో చివరగా ఏరియల్ సర్వేను హెలికాప్టర్‌ద్వారా చేపట్టనున్నారు. త్వరలోనే ఈ ప్రక్రియనూ పూర్తిచేసి డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సిద్ధం చేయనున్నారు.
రెండంచెల పని బాకీ..
రైల్వే నిర్మాణంలో ప్రాథమికంగా సర్వే పూర్తి కావడంతో దక్షిణ మధ్య రైల్వే ఈ లైన్‌కు సంబంధించి డీపీఆర్, నిధులకు సంబంధించిన ఎస్టిమేషన్ సిద్ధం చేయాల్సి ఉంది. కేంద్రం నిధులపై స్పష్టతనివ్వడం మిగిలింది. ఈ రెండు పనులు పూర్తయితే అవసరమైనచోట భూసేకరణ, టెండర్లు పిలుస్తారు. రైల్వేశాఖ అధికారులు ఈ పనులు వేగవంతంగా పూర్తిచేస్తే ఆరునెలల్లో నిర్మల్ మీదుగా రైల్వేలైన్ ఓ కొలిక్కి వస్తుంది.
వేగం పెంచాలని ఒత్తిడి
దశాబ్దాల కలగా ఉన్న హైదరాబాద్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు రైల్వేలైన్ నిర్మాణం ఇప్పుడు ఆశాజనకంగా కనిపిస్తోంది. గతంతో పోలిస్తే.. ప్రస్తుత పరిస్థితులు సానుకూలంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీకి నిర్మల్, ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యేలు ఉండటం, వరుసగా ఆదిలాబాద్ ఎంపీ స్థా నాన్ని బీజేపీ గెలుస్తుండటంతో ఈ ప్రాంతంలో మరింత పట్టు పెంచుకోవడానికీ ఆ పార్టీ చూస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎంపీ నగేశ్‌తోపాటు బీజేపీ ఎమ్మెల్యేలపైనా రైల్వేలైన్ నిర్మాణంపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో వారూ కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. స్థానికంగా ఈ లైన్ నిర్మాణ ఆవశ్యకత, నిర్మల్ సభలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీని తరచూ కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇదేక్రమంలో తాజాగా మరో సారి కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌ను ఎంపీ నగేశ్ కలిశారు. రైల్వేబోర్డు డీపీఆర్, ఎస్టిమేషన్ త్వరగా పూర్తిచేసేలా చూడాలని కోరారు.
అటు విమానం.. ఇటు రైలు..
నిర్మల్, ఆదిలాబాద్ జిల్లావాసులకు దశాబ్దాలుగా ఉన్న రెండు కలలు దాదాపు ఓ కొలిక్కి వస్తున్నాయి. ఆదిలాబాద్‌లో విమానయోగానికి గ్రీన్‌సిగ్నల్ లభించడంతో ఇక రైల్వేలైన్ సంగతి చూడాలన్న డిమాండ్ పెరుగుతోంది. ప్రధానంగా నిర్మల్ జిల్లాలో ఓమూలన ఉన్న బాసరకు మాత్రమే రైల్వేలైన్ ఉంది. ఇక్కడ వ్యవసాయపరంగా అభివృద్ధి ఉన్నా.. మార్కెటింగ్ కోసం రవాణా సౌకర్యాలు లేవు. రైల్వేలైన్ వస్తే తమ పంటలనూ మార్కెట్ ఉన్నచోట విక్రయించుకునే అవకాశం దక్కుతుందన్న భావన రైతుల్లోనూ ఉంది. అన్నివర్గాలకూ రవాణా సౌకర్యం మెరుగవుతుంది. ఈక్రమంలోనే విమానం రూట్‌లోనే రైలునూ తీసుకురావాలని ప్రజాప్రతినిధులను తరచూ అడుగుతున్నారు.
వేగం పెంచాలని కోరాం
ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు రైల్వేలైన్‌కు సంబంధించిన ప్రతిప్రాదన మరోసారి కేంద్ర రైల్వేమంత్రి దృష్టికి తీసుకొచ్చాం. సంబంధిత పనులు వేగవంతం చేయాలని కోరాం. ఆయన సానుకూలంగా స్పందించారు. – గోడం నగేశ్, ఎంపీ
ఏడాదిలో కొలిక్కి..
నిర్మల్ జిల్లావాసుల కలగా ఉన్న రైల్వేలైన్ నిర్మాణానికి కేంద్రం చర్యలు చేపడుతోంది. సర్వే పూర్తి కావడంతో రెండంచెల్లో మిగతా పనులు పూర్తిచేయాల్సి ఉంది. ఇవి పూర్తయితే ఏడాదిలో రైల్వేలైన్ నిర్మాణ పనులు కొలిక్కి వస్తాయి. – మహేశ్వర్‌రెడ్డి, బీజేఎల్పీనేత

విమానం రూట్‌లోనే రైలు.!

విమానం రూట్‌లోనే రైలు.!