
జలం కోసం జనంలోకి..
● అడవిలో కనిపించని నీటిజాడ ● నీరు లేక వృథాగా సాసర్‌ఫీట్లు ● దాహంతో వన్యప్రాణుల విలవిల ● జనావాసాల్లోకి వస్తున్న వైనం ● ప్రమాదాల్లో చిక్కి మృత్యువాత
కడెం: వేసవి కావడంతో ఎండలు మండిపోతున్నా యి. వాగులు, వంకలు ఎండిపోయి అడవిలో చుక్క నీరు దొరకని పరిస్థితి కనిపిస్తోంది. దప్పికతో అల్లాడుతూ అడవంతా తిరిగినా చుక్క నీరు దొరకక వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. గ్రామ శివారుల్లోని వ్యవసాయ బావులు, చెరువులు, కుంటల వద్దకు వచ్చి ప్రమాదాల్లో చిక్కుకుంటున్నా యి. అడవి, వన్యప్రాణి సంరక్షణ కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్న అటవీశాఖ వేసవిలో వన్యప్రాణులకు నీటి సౌకర్యం కల్పించవడం లేదని జంతుప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కనిపించని నీటి జాడ
గతంలో వేసవి వచ్చిందంటే అటవీశాఖ వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టేది. సిబ్బందితో అడవుల్లో ఏర్పాటు చేసిన సాసర్‌ఫీట్ల (నీటితొట్టెలు) లో ట్యాంకర్లతో నీటిని నింపేవారు. అక్కడికి వన్యపాణులు వచ్చి నీరు తాగి వెళ్లే వి. కానీ.. రెండేళ్లుగా సాసర్‌ఫీట్లలో నీటిని నింపేందుకు నిధులు కేటాయించడం లేదు. దీంతో అడవుల్లో సాసర్‌ఫీట్లు అలంకారప్రాయమయ్యాయి. కొ న్నిచోట్ల సోలార్‌పంపుల ద్వారా వీటిని నీటితో నింపుతున్నారు. అడవిలో చాలాచోట్ల నీటి జాడ లభించకపోవడంతో ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాల్లోని అటవీ సమీప గ్రామ శివార్లలోకి దాహార్తిని తీర్చుకునేందుకు వస్తున్న వన్యప్రాణులు నీటిలో పడడం, ఊర కుక్కలు వెంబడించడంతో మృత్యువాత పడుతున్నాయి.
ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు
● ఈనెల 1న ఖానాపూర్ పట్టణంలోని పద్మావతినగర్‌లోకి వచ్చిన చుక్కల దుప్పిని కాలనీవాసులు రక్షించారు. దానిని క్షేమంగా అటవీ అధికారులకు అప్పగించారు.
● గత నెల 22న దస్తురాబాద్ మండలం అకొండపేట్ అటవీప్రాంతంలో దాహం తీర్చుకునేందుకు వచ్చిన చుక్కల దుప్పిని ఊర కుక్కలు దాడిచేసి చంపేశాయి.
● గత నెల 8న కడెం మండలం చిట్యాల్ శివారులోని వ్యవసాయ బావి వద్దకు దాహార్తిని తీర్చుకునేందుకు చుక్కల దుప్పి వచ్చింది. ఈక్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడగా గ్రామస్తులు రక్షించారు.
● గత నెలలో లక్ష్మీపూర్ బీట్ పరిధిలో దాహార్తిని తీర్చుకునేందుకు గ్రామ శివారులోకి వచ్చిన చుక్కల దుప్పిని కుక్కలు వెంబడించాయి. దీంతో గాయపడ్డ అది మరణించింది.
● గత నెలలో ఖానాపూర్ డబుల్ బెడ్రూం ఇళ్లు, సాయిబాబా ఆలయం పరిసరాల్లోకి వచ్చిన దుప్పులను గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు అప్పగించారు.
● ఫిబ్రవరి 28న కడెం మండలం చిట్యాల్ శివారులోని వ్యవసాయ బావి వద్దకు దాహార్తిని తీర్చుకునేందుకు వచ్చిన చుక్కల దుప్పి ప్రమాదవశాత్తు బావిలో పడడంతో గ్రామస్తులు రక్షించారు.
దుప్పులను రక్షించినం
మా గ్రామ శివారులోని వ్యవసాయ బావుల వద్దకు అడవి జంతువులు వస్తున్నయ్. రెండు దుప్పులు నీళ్లు తాగేందుకు వచ్చి బావిలో పడి ప్రాణాలతో కొట్టుమిట్టాతుండగా గ్రామస్తులమంతా వెళ్లి వాటిని రక్షించి ఫారెస్టోళ్లకు అప్పగించినం. – ధర్మాజీ రమేశ్, చిట్యాల్
నిధుల లేమితోనే..
రెండేళ్లుగా సాసర్‌ఫీట్ల నీటి నిర్వహణకు నిధులు కేటాయిండం లేదు. దీంతో వన్యప్రాణులు దాహార్తిని తీర్చుకునేందుకు జనావాసాల్లోకి వస్తున్నాయి. కొన్నిచోట్ల సోలార్ మోటార్ల ద్వారా నీటిని అందిస్తున్నాం. ఉన్నతాధికారులకు సమస్య వివరిస్తాం.
– భవానీశంకర్, ఎఫ్‌డీవో

జలం కోసం జనంలోకి..

జలం కోసం జనంలోకి..

జలం కోసం జనంలోకి..