
గడువులోపు పూర్తయ్యేనా..?
● మరో రెండు నెలల్లో వర్షాకాలం ● గోదావరి నదిపై పూర్తికాని వంతెన ● దేగాం వద్ద ఇప్పుడే పనులు ప్రారంభం ● కొనసాగుతున్న భైంసా – బోధన్ ఎన్‌హెచ్ పనులు ● సెప్టెంబర్ 30 వరకు గడువు
భైంసా/భైంసారూరల్: భైంసా నుంచి బోధన్‌ను కలిపే జాతీయ రహదారి 161 బీబీ నిర్మాణ పనులు రెండేళ్లుగా కొనసాగుతున్నాయి. అసంపూర్తి పనులపై స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. భైంసా నుంచి బాసర వరకు ఎక్కడ చూసినా అసంపూర్తి నిర్మాణాలు, నాణ్యత లోపాలు, ప్రమాదాలు కనిపిస్తున్నాయి. ఈ రహదారి పనుల వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం రాకముందే పనులు పూర్తి చేయాలనే ఒత్తిడి అధికారులపై ఉంది.
అసంపూర్తి నిర్మాణాలు..
భైంసా నుంచి బాసర వరకు 56 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న ఈ జాతీయ రహదారి పనులు 90 శాతం పూర్తయినట్లు అధికారులు చెప్పినప్పటికీ, క్షేత్రస్థాయిలో చూస్తే అసంపూర్తి పనులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రోడ్డుకు ఇరువైపులా వర్షపు నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు నిర్మిస్తున్న సీసీ డ్రైనేజీలపై ఇప్పటికే పగుళ్లు ఏర్పడుతున్నాయి. దేగాం వద్ద ఇటీవల నిర్మించిన ఒక డ్రైనేజీపై లారీ ఎక్కగానే అది కుంగిపోవడం నాణ్యత లోపాలను స్పష్టంగా చూపిస్తోంది. నిర్మాణ సంస్థ ప్రమాణాలను పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయినా పర్యవేక్షణ అధికారులు లోపాలను గుర్తించడంలో విఫలమవుతున్నారు.
స్థానికుల ఇబ్బందులు..
రహదారి నిర్మాణం కారణంగా స్థానికులు రోజువారీ జీవనంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. నెలల తరబడి కొనసాగుతున్న పనుల వల్ల గ్రామాల్లో రోడ్డుకు ఆనుకుని నివసించే వారు, వ్యాపారాలు నడిపే వ్యక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రాకపోకల వల్ల ఎగిసే దుమ్ము, ధూళి ఇళ్లలో నిండిపోతుంది, దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఒకవైపు వర్షపు నీటి డ్రైనేజీలు నిర్మిస్తున్నారు. మరోవైపు రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా వదిలేయడం వల్ల నీటి ప్రవాహం సరిగా జరగడం లేదు.
రూ.388 కోట్ల ప్రాజెక్ట్
భైంసా–బోధన్ జాతీయ రహదారి 161 బీబీ నిర్మాణానికి రూ.388 కోట్ల నిధులు కేటాయించారు. 56 కిలోమీటర్ల ఈ రహదారి పనులు రెండేళ్లు దాటినా పూర్తి కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేగాం, టాక్లి–బిద్రెల్లి, మరియు బాసర వద్ద కీలకమైన వంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణం ఆలస్యమవుతోంది. అధికారులు సమస్యలను పరిష్కరించి, సెప్టెంబర్ 30, 2025 నాటికి పనులు పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ, వర్షాకాలం రెండు నెలల్లో ప్రారంభం కానుండటం ఆందోళన కలిగిస్తోంది. గోదావరి నదిపై బాసర వద్ద నిర్మిస్తున్న వంతెన సగం మా త్రమే పూర్తయింది, వర్షాకాలంలో నది ప్రవాహం కారణంగా పనులు కొనసాగించడం కష్టతరం.
బాసర అండర్‌పాస్..
బాసరలో నిర్మిస్తున్న అండర్‌పాస్ పనులు ఏడాదిగా కొనసాగుతున్నాయి. దీంతో బాసర రైల్వే స్టేషన్ వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా శ్రీ జ్ఞానసరస్వతి దేవాలయానికి వచ్చే భక్తులు, ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు, రైల్వే స్టేషన్‌ను ఉపయోగించే యాత్రీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అండర్‌పాస్ పూర్తయితే భారీ వాహనాలు నేరుగా నిజామాబాద్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది, కానీ ప్రస్తుతం ఈ ఆలస్యం స్థానిక రవాణాకు అడ్డంకిగా మారింది.
గడువులోగా పనులు పూర్తి
గడువులోగా పనులు పూర్తి చేసేందుకు పూర్తిస్థాయిలో కృషిచేస్తాం. భైంసా – బోధన్ రహదారి నిర్మాణ పనులు పూర్తయిన చోట రేడియం లైన్లు వేస్తున్నాం. రోడ్డు పక్కన ప్రమాద సూచికలు ఏర్పాటు చేస్తున్నారు. కొన్నిచోట్ల సాంకేతిక సమస్యలతో అక్కడక్కడ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. అప్పటి వరకు ఆ పనులు కూడా పూర్తవుతాయి.
– సుభాష్, డీఈఈ
సూచిక బోర్డులు లేక ప్రమాదాలు..
అసంపూర్తి నిర్మాణాలు రహదారిపై ప్రమాదాలకు కారణమవుతున్నాయి. గత నాలుగు నెలల్లో దేగాం వద్ద 13 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. భైంసా నుంచి బాసర వరకు మొత్తం 22 ప్రమాదాలు నమోదయ్యాయి. నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో సూచిక బోర్డులు లేకపోవడం ఈ ప్రమాదాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దేగాం, తరోడ, ముధోల్, బిద్రెల్లి, మరియు బాసర సమీప గ్రామాల వద్ద సుమారు అర కిలోమీటరు మేర పనులు నిలిచిపోయాయి, ఇది వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది.
నిర్మాణాలకు ఆటంకాలు
గోదావరి నదిపై నిర్మిస్తున్న వంతెన పనులు గత ఏడాదిన్నరగా కొనసాగుతున్నాయి, కానీ సగం మాత్రమే పూర్తయింది. మిగిలిన ఐదున్నర నెలల్లో ఈ పనులు పూర్తి చేయడం సవాల్‌గా కనిపిస్తోంది. దేగాం వద్ద గత నెలలో ప్రారంభమైన ఈ వంతెన నిర్మాణం ఇప్పుడే పిల్ల ర్ల స్థాయిలో ఉంది. దీనిని గడువులోపు పూర్తి చేయడం అసాధ్యంగా కనిపిస్తోంది. టాక్లి–బిద్రెల్లి గ్రామాల మధ్య ఒక కిలోమీటరు మేర రోడ్డు నిర్మాణం నిలిచిపోయింది. వాగుపై వంతెన పనులు కూడా ఆగిపోయాయి.