
మెస్‌లకు టెండర్!
ట్రిపుల్ ఐటీ
భైంసా: గత ప్రభుత్వ హయాంలో బాసర ట్రిపుల్‌ఐటీతో సహా రాష్ట్రవ్యాప్త గురుకులాలు, ప్రభుత్వ కళాశాలల్లో కలుషిత భోజనంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అప్పటి సీఎల్పీ నేతగా ఉన్న ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయినా సమస్యలు కొనసాగుతున్నాయి. విద్యార్థుల సంక్షేమం కోసం శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
మంత్రి సీతక్క సందర్శన
2024, డిసెంబర్ 13న మంత్రి సీతక్క ట్రిపుల్‌ఐటీలో విద్యార్థులతో భోజనం చేసి, సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అత్యవసర పనుల కోసం రూ.కోటి నిధులు కేటా యించినట్లు ప్రకటించారు. అయినా, మెస్ నిర్వహణలో మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
కాంట్రాక్టర్ల అవినీతి
ట్రిపుల్‌ఐటీ అధికారులు విద్యార్థుల కంటే కాంట్రాక్ట ర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో పురుగులు, ఫుడ్ పాయిజన్ ఫిర్యాదులపై చర్యలు తీసుకోకుండా, పాత కాంట్రాక్టర్లనే కొనసాగించారు. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఈ అక్రమాలపై విచారణ డిమాండ్ చేసినా, ఫలితం లేకపోయింది.
టెండర్ నిబంధనల వివాదం
కొత్త మెస్ టెండర్లలో కఠిన నిబంధనలు ఉన్నాయి. రూ.8 కోట్ల టర్నోవర్, 2–3 వేల మందికి భోజన అనుభవం అడిగారు. దీంతో ఈ నిబంధనలు పాత కాంట్రాక్టర్లకే అనుకూలంగా ఉన్నాయి. రాష్ట్రంలో చిన్న కళాశాలల్లో ఇటువంటి అనుభవం ఉండదు, ట్రిపుల్‌ఐటీలోనే ఇది సాధ్యం. 9 వేల మంది విద్యార్థుల భోజన బాధ్యతను నిర్లక్ష్యంగా ప్రైవేటు సంస్థలకు అప్పగించడం విమర్శలకు దారితీస్తోంది. ప్రస్తుతం నాలుగు మెస్‌లకు 12 మంది ఈ టెండర్లు వేసినట్లు సమాచారం. ఈ విషయాలు అధికారులైతే ఇప్పటికీ వెల్లడించడం లేదు.
మహిళా సంఘాలకు అవకాశం లేనట్లే..
సీఎం రేవంత్‌రెడ్డి మహిళా సంఘాలకు ఇందిర శక్తి క్యాంటీన్లు కేటాయిస్తున్నారు. ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటికే ఏర్పాటు చేశారు. కానీ, ట్రిపుల్‌ఐటీలో ఒక్క మెస్ కూడా మహిళా సంఘాలకు ఇవ్వలేదు. స్థానికులు 500 మందికి మెస్‌లు కేటాయిస్తే రుచికర, నాణ్యమైన భోజనం అందించే అవకాశం ఉంది. ఇప్పటికై నా ప్రభుత్వం, అధికారులు ఈ విషయంపై దృష్టిసారించి మహిళా సంఘాలకు ట్రిపుల్‌ఐటీ మెస్‌లను అప్పగించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
నిబంధనలు చూస్తే కొత్త వారికి కష్టమే
పాత వారికే దక్కేలా కాంట్రాక్ట్ రూల్స్
టర్నోవర్ పేరిట తిరకాసు
‘ఇందిరా శక్తి’కి ఛాన్స్ ఇవ్వరా?
పాత వారిపై ఫిర్యాదులు..
ప్రైవేటు సంస్థల అన్ని కాంట్రాక్టు గడువులు ముగిసినప్పటికీ ఎట్టకేలకు ఇటీవలే మెస్‌లకు టెండర్లను పిలిపించారు. క్యాంపస్‌లో 9 వేల మంది విద్యార్థులకు భోజన బాధ్యతలు, నిర్వాహణను ప్రైవేటు క్యాట రింగ్ సంస్థలకు అప్పగించారు. గతంలో మెస్ దక్కించుకున్న కాంట్రాక్టర్లపై అక్కడి విద్యార్థులు ఫిర్యాలు చేసినా అధికారులు వారిపై చర్యలు తీసుకోలేదు. భోజనంలో పురుగులు రావడం, ఫుడ్‌పాయిజన్ వంటి ఘటనలు చోటు చేసుకున్నా స్పందించ లేదు. మూడేళ్లుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి క్యాటరింగ్ సంస్థలపై అనేక ఫిర్యాదులు అందాయి. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.