అవినీతి ‘ప్రతినిధులు’
- బినామీ రుణాల కుంభకోణంలో ప్రముఖుల పేర్లు
- రుణగ్రహీతల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీ కుటుంబ సభ్యులు
- భార్యల పేరున దర్జాగా పాసుపుస్తకాల సృష్టి
బుచ్చెయ్యపేట : వారంతా ప్రజాప్రతినిధులు. తమకేదో మంచి చేస్తారన్న నమ్మకంతో ప్రజలు ఏరికోరి గెలిపించుకున్నవారు. తప్పుచేసే వారిని సక్రమమార్గంలో పెట్టాల్సిన వారే వక్రమార్గం అనుసరించారు. జిల్లాలో సంచలనం సృష్టించిన నకిలీ పాసుపుస్తకాలు, బినామీ రుణ వ్యవహారంలో వెల్లడవుతున్న పేర్లు చూసి అధికారులే నోరెళ్లబెడుతున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే అడ్డదారులు వెతకడంపై మండిపడుతున్నారు.
తహశీల్దార్, ఆర్డీఓ వంటి ఉన్నతాధికారుల సంతకాలే ఫోర్జరీచేసి, నకిలీ స్టాంప్‌లతో పాసుపుస్తకాలు సృష్టించి లేని భూముల్ని ఉన్నట్లుగా రికార్డులు సృష్టించడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే... మండలంలో బినామీ రుణాల వ్యవహారం వెలుగు చూడడంతో అధికారులు అనుమానం ఉన్న 255 పట్టాదారు పాసుపుస్తకాలు స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా విచారిస్తున్నారు. ఇప్పటి వరకు 75 పుస్తకాలు పరిశీలించగా 52 నకిలీవని తేలింది.
నీలకంఠాపురం సర్పంచ్ భార్య ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికాగా అదే గ్రామానికి చెందిన మరో సామాజిక వర్గం వ్యక్తి కుమార్తెగా పట్టాదారు పాసుపుస్తకం సృష్టించారు. వాస్తవంగా భూమి లేకపోయినా సర్వే నంబర్ 86/3, 94/2, 95/1లో 4.72 ఎకరాల భూమి ఆమెకు ఉన్నట్లు పాసుపుస్తకం సృష్టించి బ్యాంకు నుంచి రుణం పొందారు.
మల్లాం ఎంపీటీసీ మాజీ సభ్యురాలికి ఆర్.భీమవరంలోని సర్వే నంబర్ 816లో సెంటు భూమి లేదు. కానీ తనకు 4.32 ఎకరాల భూమి ఉన్నట్లు నకిలీ పాసుపుస్తకం సృష్టించి రుణం పొందారు. కొండెంపూడి, కోమళ్లపూడి, తురకలపూడి, గంటికొర్లాం, పెదపూడి, చినభీమవరం, బుచ్చెయ్యపేట, పోలేపల్లి, కొండపాలెం, పెదమదీన, గున్నెంపూడి, రాజాం, చిట్టియ్యపాలెం, తైపురం తదితర గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధుల పేర్లు కీలకంగా వినిపిస్తున్నాయి.
సర్పంచ్‌లు, మాజీలు, ఎంపీటీసీ సభ్యులు, మాజీలు, ఎంపీటీసీలు, సహకార, డెయిరీ సభ్యులు, పలుకుబడి ఉన్న నాయకులు, ఉద్యోగులు కూడా ఈ వ్యవహారంలో తమవంతు భాగాన్ని సొంతం చేసుకున్నారు. జేసీ విచారణ జరపడం, బాధ్యులపై క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించడం, రెవెన్యూ అధికారులు పరిశీలన వేగవంతం చేయడంతో ‘బినామీ’దార్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
పరిస్థితి ప్రమాదకరంగా కనిపిస్తుండడంతో ఎమ్మెల్యే, మంత్రులను ఆశ్రయించి విచారణ తప్పుతోవ పట్టించేం దుకు అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తారన్నది చూడాల్సి ఉంది. మరోవైపు అన్నిపుస్తకాల పరిశీలన అనంతరం మరెంతమంది బినామీలు వెలుగు చూస్తారో చూడాలి.