తీరంలో ఘోరాలు
చీరాల : వాడరేవు తీర ప్రాంతం నేరాలకు కేంద్రమైంది. గతంలో కొందరు యువకులు వాడరేవుకు వచ్చే ప్రేమికులు, భార్యాభర్తలపై దాడులకు పాల్పడి తీరం వెంట ఉంటే సరుగుడు తోటల్లోకి తీసుకెళ్లి మహిళలపై సామూహిక లైంగికదాడులకు పాల్పడేవారు. కళాశాలలకు చెందిన విద్యార్థినులపై వరుస లైంగికదాడుల ఘటనలు జరగడంతో చివర్లో స్పందించిన పోలీసులు.. లైంగికదాడులకు పాల్పడుతున్న కొందరిని అరెస్టు చేసి జైలుకు పంపారు. దీంతో కొద్ది నెలలు అటువంటి ఘటనలు జరగలేదు. మళ్లీ కొద్ది రోజులుగా పాత ఘటనలు పునరావృతం అవుతున్నాయి. గత శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో 25 ఏళ్ల మహిళ భయంతో పరుగులు తీసకుంటూ రొప్పుతూ వాడరేవు గ్రామంలోకి వచ్చింది.
స్థానికులు వచ్చి ఏం జరిగింది? ఎందుకు పరుగెడుతున్నావంటూ ఆమెను ప్రశ్నించడంతో తనతో పాటు వచ్చిన అమ్మాయిని చంపేశారంటూ.. ఏడుస్తూ చీరాల బస్సు ఎక్కింది. కొందరు నెమ్మదిగా ప్రశ్నించగా ఆమె కొన్ని వివరాలు చెప్పి వెళ్లింది. ఉదయం 6 గంటలకు ఇద్దరం కలిసి వచ్చామని, గెస్ట్‌హౌస్ పక్కన ఉన్న సరుగుడు తోటలో ఉండగా కొంతమంది వచ్చి లైంగికదాడికి పాల్పడి తనతో పాటు వచ్చిన మరో అమ్మాయిని చంపేశారని, తనను కూడా చంపాలని చూడగా వారి నుంచి తప్పించుకుని వచ్చినట్లు గ్రామస్తులతో చెప్పింది.
20 రోజుల క్రితం అదే తోటలో ఒక అమ్మాయి హత్యకు గురైందనే ప్రచారం వాడరేవులో జరిగింది. తీరం వెంట ఉండే తోటలు గుబురుగా ఉంటాయి. ప్రేమ జంటలు, ఇతర మహిళలు తీరానికి వచ్చి ఆ తోటల్లోకి వెళ్తుంటారు. ముందు నుంచే కొందరు వారిని అనుసరిస్తూ తోటల వద్దకు వెళ్లగానే అత్యాచారాలకు పాల్పడుతుంటారు. వారి వద్ద ఉండే నగలు, నగదు, సెల్‌ఫోన్లు దోచుకుంటారు. ఈ తరహా సంఘటనలు అనేకం జరిగాయి. వాడరేవు తీరానికి చుట్టు పక్కల ఉండే అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. అలా వచ్చి తోటల్లోకి వెళ్లినవారిపై ఆంగతకులు మాటువేసి సామూహిక లైంగికదాడులకు పాల్పడుతుంటారు.
గత శుక్రవారం తనతో పాటు వచ్చిన మహిళలను చంపేశారని మరో మహిళ పరుగులు పెడుతూ గ్రామస్తులకు చెప్పడంతో తీరంలో మళ్లీ ఘోరాలు జరుగుతున్నాయని అర్థమైంది. లైంగికదాడులు జరిగిన సమయాల్లో పోలీసులు తీరం వెంట నిఘా పెడుతున్నా అవి కొద్దిరోజులకే పరిమితమవుతున్నాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే విషయం బయటకు పొక్కి అన్ని విధాల పరువు పోతుందని భయంతో మౌనంగానే వెనుతిరుగుతున్నారు. ఈ విషయంపై రూరల్ ఎస్సై రాంబాబును వివరణ కోరగా మహిళ హత్యకు గురైనట్లు సమాచారం అందిందని చెప్పారు. సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా అక్కడ మృతదేహం కనిపించలేదన్నారు. ఎవరైనా ఫిర్యాదు వస్తే విచారిస్తామని ఎస్సై వివరించారు.