తమ్ముళ్లు ససేమిరా!
- గంటా బృందం రాకను వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలు
- పార్టీలో చేర్చుకోవద్దంటూ అధిష్టానానికి ఫ్యాక్స్‌లు
గంటా బృందాన్ని పార్టీలోకి స్వాగతించేందుకుతెలుగుదేశంలోని కొందరు సుముఖంగా లేరు. ‘దేశం’ పంచన చేరేందుకు ‘ఆ నలుగురు’ముహూర్తం ఖరారు చేసుకున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ వర్గం టీడీపీకి కలిగించిన నష్టాన్ని గుర్తు చేస్తూప్రధాన కార్యాలయానికి ఫ్యాక్స్‌ల పరంపర వెళ్తోంది.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్న జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు గ్రూపునకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. పదేళ్లుగా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అష్టకష్టాలు పడి పార్టీని నిలబెట్టిన తమను కాదని నిన్నటి వరకూ అడుగడుగునా అధికార దర్పం ప్రదర్శించి తమకు నరకం చూపించిన ఈ బృందాన్నిస్వాగతించడమేమిటని తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు అధిష్టానాన్ని నిలదీస్తున్నారు. వీరిని పార్టీలో చేర్చుకోవద్దంటూ ఫ్యాక్స్‌లపరంపర కురిపిస్తున్నారు.
జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు, పెందుర్తి శానసభ్యుడు పంచకర్ల రమేష్‌బాబు, భీమిలి శానసభ్యుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, గాజువాక శాసనసభ్యుడు చింతలపూడి వెంకట్రామయ్య టీడీపీలో చేరి తిరిగి ఎన్నికల బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే నెల 8న విశాఖలో నిర్వహించతలపెట్టిన సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ సభ్యత్వం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. వీరిలో ఎవరెవరు ఏ యే నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారన్నదానిపైనా ఇప్పటికే ఒక అవగాహన కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అదే తెలుగుదేశంలో సంక్షోభాన్ని సృష్టిస్తోంది.
ఎదురుగాలి ఇలా..
కష్టకాలంలో పార్టీని నమ్ముకొని కార్యక్రమాలు చేసి, క్యాడర్‌ను కాపాడుకున్న తమను కాదని వీరికి పెద్దపీట వేయటమేమిటని పలువురు నేతలు అధిష్టానాన్ని నిలదీస్తున్నారు.
గంటా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత దేశం పార్టీ వారిపై వేధింపులు, కేసులు ఎక్కువయ్యాయని గుర్తు చేస్తున్నారు. గంటా తన నియోజక వర్గమైన అనకాపల్లిలో ఆ ప్రాంతంలో ఎటువంటి సంబంధం లేని వ్యాపార భాగస్వామి అయిన పరుచూరి భాస్కరరావును ఇన్‌చార్జిగా నియమించి అనుక్షణం వేధింపులకు గురి చేశారంటూ పార్టీ కార్యాలయమైన ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌కు ఫ్యాక్స్‌లు పంపుతున్నారు.
పంచకర్ల రమేష్‌బాబు వివాదాస్పద హిందుజా థర్మల్ పవర్ ప్లాంట్‌కు ఏజెంట్‌గా మారి ప్లాంట్ వ్యతిరేక ఉద్యమకారులపై లాఠీచార్జీలు జరిపించి అరెస్టులు చేయించిన సంఘటనలను దేశం నేతలు గుర్తు చేస్తున్నారు. భీమిలి, గాజువాక శాసనసభ్యులు కూడా ఏకపక్షంగా వ్యవహరించడమే గాక భూకబ్జాలకు పాల్పడితే తామే ఉద్యమాలు చేశామని, అటువంటి వారితో ఇప్పుడు కలసి ఎలా పనిచేయాలని ప్రశ్నిస్తున్నారు.
బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించి బీసీల పార్టీగా ముద్రవేసుకొనే ప్రయత్నం చేస్తున్న తెలుగుదేశం జిల్లాలో ఎప్పటి నుంచో ఉన్న పప్పల చలపతిరావు, గుడివాడ నాగమణి, అమరనాథ్, గొంతిన నాగేశ్వరరావు వంటి బీసీ కాపులను పక్కన పెట్టి ఇతర ప్రాంతాలనుంచి వలస వచ్చిన ఓసీ కాపులైన వీరికి పెద్ద పీట వేయడంపైనా కూడా చర్చ జరుగుతోంది.
అధికార పార్టీ నేతలుగా వీరిపై సహజంగానే ఓటర్లలో వ్యతిరేకత ఉంటుందని, అటువంటి వారితో ప్రయోగం చేయడం పార్టీకి మంచిది కాదని సీనియర్ తెలుగుదేశం నేతలు వాదిస్తున్నారు.
వీరి చేరిక వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వీరి చేరికపై పునరాలోచన జరపాల్సిందిగా చంద్రబాబుపై రోజు రోజుకూ ఒత్తిడి పెరుగుతోంది.