సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్‌ను పూర్తిస్తాయిలో నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ (యూపీఎస్సీ) కమిటీ సిఫారసుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం జారీచేసిన తాజా ఉత్తర్వులతో 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన గౌతం సవాంగ్ పూర్తిస్థాయి డీజీపీగా కొనసాగనున్నారు. ఇప్పటివరకు ఏపీ ఇన్‌చార్జ్ డీజీపీగా కొనసాగుతూ వచ్చారు. ఈ నెల 1వ తేదీన న్యూఢిల్లీలో సమావేశమైన యూపీఎస్సీ కమిటీ గౌతం సవాంగ్‌ను పూర్తిస్థాయి డీజీపీగా కొనసాగించాలని సిఫారసు చేసింది.
రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను బదిలీ చేసి.. ఆయన స్థానంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న గౌతం సవాంగ్‌ను ఇన్‌చార్జి డీజీపీగా నియమించిన సంగతి తెలిసిందే. ఆర్పీ ఠాకూర్‌ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ శాఖకు డీజీగా బదిలీ చేసింది. ఇన్‌చార్జి డీజీపీగా సవాంగ్ చాలా చక్కగా పనిచేస్తుండటం.. సీనియర్ అధికారి కావడంతో ప్రభుత్వం ఆయనను పూర్తిస్థాయిలో నియమించినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment