పట్టాలు తప్పిన గౌతమి ఎక్స్‌ప్రెస్ | Gautami Express derailment | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన గౌతమి ఎక్స్‌ప్రెస్

Published Fri, Jun 19 2015 4:19 AM | Last Updated on Sun, Sep 3 2017 3:57 AM

పట్టాలు తప్పిన గౌతమి ఎక్స్‌ప్రెస్

పట్టాలు తప్పిన గౌతమి ఎక్స్‌ప్రెస్

గుత్తి : హుబ్లీ నుంచి తిరుపతికి వెళ్లే గౌతమి ఎక్స్‌ప్రెస్ (11111) రైలు గుత్తి జంక్షన్‌లోని తూర్పు క్యాబిన్ సమీపంలో పట్టాలు తప్పింది. రెండు బోగీలు పూర్తిగా పట్టాలు తప్పడంతో ఆరుగురు మరణించగా, మరో 16మంది క్షతగాత్రులయ్యారు. ప్రమాద సంఘటన గార్డు కామేశ్వరరావు ద్వారా ఎస్‌ఎంఆర్ బిఎక్స్ ప్రసాద్‌కు సమాచారం అందివ్వడంతో ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, రైల్వేలోని అన్ని విభాగాల అధికారులు, కార్మికులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బోగీల్లో ఇరుక్కుపోయిన వారిని రక్షించడానికి బోగీల కిటికీలను కోశారు. కిటికీల ద్వారా క్షత గాత్రులను అతి కష్టం మీద బయటకు తీసి అక్కడే వైద్యం చేయించారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

 ఇదంతా నిజమనుకుంటున్నారా? కాదు.. రైల్వే విభాగం నిర్వహించిన మాక్‌డ్రిల్  
 గుత్తి రైల్వే స్టేషన్‌లోని తూర్పు క్యాబిన్ సమీపంలో గురువారం గుంతకల్ డీఆర్‌ఎం మనోహర్ జోషి, బెంగుళూరుకు చెందిన ఎన్‌డీఆర్‌ఎఫ్(నే షనల్ డిసార్డర్ రిలీఫ్‌ఫోర్స్) టీమ్ కమాండర్ సంతోష్ కుమార్ నేతృత్వంలో రైలు ప్రమాదాలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, గుత్తి, గుంతకల్ రైల్వే ఉన్నతాధికారులు, అన్ని విభాగాల్లోని కార్మికులు, లయన్స్ క్లబ్ సభ్యులు మాక్‌డ్రిల్‌లో భాగస్వాములయ్యారు.

నిజంగా రైలు ప్రమాదం సంభవించినపుడు అధికారులు, కార్మికులు, ప్రయాణికులు ఎలా స్పందిస్తారో అదే విధంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇది ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సాగింది. అనంతరం డీఆర్‌ఎం మనోహర్ జోషి విలేకరులతో మాట్లాడారు. ప్రమాదాలు సంభవించినపుడు బాధితుల(ప్రయాణికుల)ను ఎలా కాపాడాలి? వారికి వైద్యం ఎలా అందించాలి? అనే విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ మాక్‌డ్రిల్ నిర్వహించామని, అందరి సహకారంతో ఇది సక్సెస్ అయిందన్నారు. ఈ మాక్ డ్రిల్‌లో కళ్లు మూసుకున్న వారిని మృతులుగానూ, కళ్లు తెరుచుకుని ఉన్న వారిని క్షతగాత్రులుగానూ పరిగణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement