కీలకం
సాక్షి, గుంటూరు :సార్వత్రిక ఎన్నికల ఓటర్ల జాబితాలో యువ చైతన్యం వెల్లి విరిసింది. కొత్తగా ఓటు హక్కు పొందేందుకు యువత ఈ దఫా అమి తాసక్తి కనబరిచింది. ఎన్నికల కమిషన్ సైతం యువతను ఓటర్లుగా చేర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో సత్ఫలితాలు వచ్చాయి. ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ కళాశాలలపై ప్రత్యేక దృష్టి సారించి రెవెన్యూ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు (ఏఈఆర్వో) కళాశాలల్లోనే కొందరు బాధ్యుల్నిగా నోడల్ అధికారుల తరహాలో అంబాసిడర్లుగా నియమించి వారి నుంచే దరఖాస్తుల్ని స్వీకరించారు. గతంలో గంపగుత్తగా దరఖాస్తుల్ని స్వీకరించే విధానాన్ని అంగీకరించే వారు కాదు.
కానీ ఈ దఫా విద్యార్థుల్లో చైతన్యం తెచ్చి వారు అందించిన దరఖాస్తుల్ని నోడల్ అధికారుల ద్వారా స్వీకరించి ఓటు హక్కు కల్పించారు. ఓటర్ల తుది జాబితాలో ఈ ఏడాది కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లు 30 ఏళ్ళ లోపు వయస్సున్న వారు 1,30,292 మంది ఉన్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియలో 3 లక్షల మంది వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటే, వీరిలో సగం మంది యువ ఓటర్లు కావడం గమనార్హం. 1,30,292 మందికి జాబితాలో చోటు దక్కింది. నేతల తలరాతల్ని మార్చే యువత ఓట్లే రానున్న ఎన్నికల్లో కీలకం కానున్నాయి. గుంటూరు నగరంలో యువ ఓటర్లు అధిక సంఖ్యలో చేరారు. 30 ఏళ్ళ లోపు వారే ఇక్కడ కొత్తగా 24,494 మంది ఓటరు జాబితాలో చోటు సంపాదించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జిల్లాలో
అత్యధిక ఓటర్లున్నారు. ఇక్కడే యువ ఓటర్లు 13,619 మంది చేరారు.
నియోజకవర్గం కొత్తగా నమోదైన
30 ఏళ్ళ లోపు ఓటర్లు
పెదకూరపాడు 5,851
తాడికొండ (ఎస్సీ) 4,670
మంగళగిరి 7,949
పొన్నూరు 6,220
వేమూరు 3,946
రేపల్లె 6,309
తెనాలి 9,131
బాపట్ల 5,782
ప్రత్తిపాడు 5,547
గుంటూరు వెస్ట్ 13,619
గుంటూరు ఈస్ట్ 10,875
చిలకలూరిపేట 7,513
సత్తెనపల్లి 6,886
వినుకొండ 7,596
గురజాల 9,686
మాచర్ల 10,401
మొత్తం 1,30,292