కదనరంగంలో కొత్త ఎస్‌ఐలు
Published Tue, Feb 4 2014 12:49 AM | Last Updated on Sun, Sep 2 2018 3:42 PM
సాక్షి, నరసరావుపేట :సార్వత్రిక ఎన్నికల వేడి రోజు రోజుకు రాజుకుంటుంది. ఎన్నికల క మిషన్ నియామవళి మేరకు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల బదిలీలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే జిల్లా పోలీస్ శాఖలో భారీగా బదిలీలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రూరల్ జిల్లా పరిధిలో ఇటీవల ఆరు నెలల శిక్షణ పూర్తి చేసుకున్న 23 మంది ఎస్‌ఐలకు రూరల్ ఎస్పీ జె.సత్యనారాయణ పోస్టింగ్‌లు ఇచ్చారు. వీరికి ఇవే మొదటి పోస్టింగ్‌లు కావడం గమనార్హం. 23 మండలాల్లో ఈ యువ ఎస్‌ఐలు ఉద్యోగబాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. జిల్లాకు ఘాటైన రాజకీయ నేపథ్యం ఉండటంతో కొత్తగా చేరిన యువ ఎస్‌ఐలు రానున్న ఎన్నికల్లో తమ విధులను ఏ మేరకు సమర్ధంగా పూర్తి చేయగలరనే సందేహాలు పోలీసు శాఖ నుంచే వినిపిస్తున్నాయి. వీరంతా జిల్లాకు పూర్తిగా కొత్త కావడంతో మండలాల స్థితిగతులు, రౌడిషీటర్లు, నేర చరిత్ర ఇలాంటి అంశాలను తెలుసుకునేలోపు ఎన్నికల కాలం కాస్తా పూర్తవుతుందని అంటున్నారు. ముఖ్యంగా ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలు అధికంగా ఉన్న నరసరావుపేట డివిజన్‌లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు రగిల్చిన వేడి ఇప్పటి వరకు చల్లారలేదు.
పధాన రాజకీయ పార్టీల నాయకులంతా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ సత్తా చూపాలనే ఉద్దేశంతో అన్ని ఎత్తుగడలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో గ్రామాల్లో వాతావరణం మరింత వేడెక్కింది. ఇంతకు ముందే తమకు అనుకూలమైన సీఐలను తమ ప్రాంతాలకు తెచ్చుకున్న రాజకీయ నాయకులకు ఎన్నికల నిబంధనలతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. కొద్ది నెలల కిందట బాధ్యతలు చేపట్టిన సీఐలను సైతం ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియలో భాగంగా బదిలీ చేసింది. అనుభవం ఉన్న సీఐలు బదిలీపై వెళ్లడం, ఆయా ప్రాంతాలపై అవగాహన లేని యువ ఎస్‌ఐలు బాధ్యతలు స్వీకరించడంతో ఎన్నికలను ఏ మేరకు నెగ్గుకు రాగలరోననే సందేహాలు వినిపిస్తున్నాయి.
Advertisement
Advertisement