కానుకలోనూ కక్కుర్తి
నెల్లూరు(రెవెన్యూ): రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రన్న సంక్రాంతి కానుక ప్రచార ఆర్భాటం తప్ప పేదలకు ఒరిగిందేమీ లేదని తేలిపోయింది. సంక్రాంతి పండగ వేడుకలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ప్రభుత్వం ప్రకటించిన చంద్రన్న సంక్రాంతి కానుక వస్తువులు పూర్తిస్థాయిలో ఇంకా చేరనే లేదు. చేరిన వస్తువులను కూడా అరకొరగా పంపిణీ చేశారు. అనేక ప్రాంతాల్లో పంపిణీ చేసిన సరుకులు తక్కువగా వస్తున్నాయి. తూకాల్లో వ్యత్యాసం ఉంది.
మరి కొన్నిచోట్ల నాసిరకమైన సరుకులు పంపిణీ చేశారు. మొత్తంగా చూస్తే రాష్ట్రప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన చంద్రన్న సంక్రాంతి కానుక ప్రచారం కోసం తప్ప పేదల కోసం కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 8.24 లక్షల తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. రేషన్ సరఫరా చేయడానికి 17 ఎంఎల్‌ఎస్ పాయింట్లు, 1,872 చౌక దుకాణాలు ఉన్నాయి. వాటి ద్వారా కందిపప్పు, పామాయిల్, బెల్లం, గోధుమపిండి, శనగలు, నెయ్యి పంపిణీ చేయాల్సి ఉంది.
అన్ని ఎంఎల్ పాయింట్లకు సరుకులు అరకొరగా దిగుమతి చేసి ఉన్నారు. వచ్చిన సరుకులకు అధికారులు చెబుతున్న లెక్కలకు పొంతన ఉండటం లేదు. జిల్లాకు రావాల్సిన సరుకులన్నీ ఆదివారం రాత్రికే పూర్తిస్థాయిలో చేరాల్సి ఉంది. ఆ సరుకులను పండగకు ఒకరోజు ముందే పంపిణీ చేయాల్సి ఉంది. అయితే పూర్తిస్థాయిలో సరుకులు రాకపోవటంతో సోమవారం అనేక మండలాల్లో చంద్రన్న సంక్రాంతి కానుక సరుకులు పంపిణీ కాకపోవటం గమనార్హం.
తూకాల్లో మోసం..
చంద్రన్న సంక్రాంతి కానుక కింద పంపిణీ చేస్తున్న ఆరు రకాల వస్తువులు ప్రభుత్వం ప్రకటించిన తూకం కంటే తక్కువగా ఉందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. నెల్లూరుకు చెందిన రమణమ్మకు మూడు వస్తువులు మాత్రమే ఇచ్చారు. వాటిల్లో గోధుమపిండి 50 గ్రాములు, శనగలు 50 గ్రాముల తక్కువగా ఉందని ఆమె తెలిపింది. ఇలా జిల్లావ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పంపిణీ చేసిన సరుకుల్లో 50 నుంచి 150 గ్రాముల వరకు తక్కువగా ఉన్నాయని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు.
అదేవిధంగా గోధుమపిండి, శనగలు, బెల్లం నాసిరకంగా ఉందని కార్డుదారులు వాపోతున్నారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో గోధుమపిండి, బెల్లం, శనగలు, కందిపప్పు బస్తాల్లో దిగుమతి చేశారు. అలా వచ్చిన సరకులు దాదాపు నాసిరకంగా దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా బస్తాల్లో నుంచి తూకాలు వేసి ప్యాక్‌చేస్తున్నారు. అందులోనే తేడాలు వస్తున్నాయి. నెల్లూరు, నెల్లూరు రూరల్ కలపి 150 చౌకదుకాణాలకు పైగా ఉన్నాయి. నెల్లూరులోని చౌకదుకాణాలకే పూర్తిస్థాయిలో సంక్రాంతి కానుక సరఫరా కాలేదు.
డీలర్లు మాత్రం మాకు మూడు వస్తువులే సరఫరా చేశారని తెలుపుతున్నారు. మిగిలిన మూడు వస్తువులు వస్తే పంపిణీ ప్రారంభిస్తామని డీలర్లు తెలుపుతున్నారు. సూళ్లూరుపేట, ఆత్మకూరు, ఉదయగిరి తదితర ప్రాంతాలకు సంక్రాంతి కానుక పూర్తిస్థాయిలో సరఫరా కాలేదు. దీంతో అనేక చోట్ల డీలర్లు వచ్చిన అరకొర సరుకులను కూడా పంపిణీ చేయలేదు. అదేవిధంగా వెయ్యి రేషన్‌కార్డులపైన ఉన్న చౌకదుకాణాల్లో ప్రతి 300ల కార్డులకు ఒక ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని జేసీ ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే జిల్లాలో ఎక్కడా అది అమలు కాలేదు. చంద్రన్న సంక్రాంతి కానుక సరుకుల అరకొర అందటం, నాణ్యత లేకపోవటంతో అధికారులు తలలుపట్టుకుంటున్నారు. అధికారులు పరిస్థితి ఇలా ఉంటే... టీడీపీ నాయకులు మాత్రం కొంతమంది కార్డుదారులకు చంద్రన్న సంక్రాంతి కానుక ప్యాకెట్లు సరఫరా చేసి పండగ చేసుకోండంటూ గొప్పలు చెప్పుకోవటం గమనార్హం. ఈ విషయంపై సంబంధిత అధికారులు విలేకరులు అడిగిన ప్రశ్నలకు అన్ని వస్తువులను సరఫరా చేస్తామని చెబుతున్నారు.
వస్తువు పేరు అవసరమైన
(మెట్రిక్ టన్నుల్లో) వచ్చింది రావాల్సినవి
1. బెల్లం 412 246 166
2. కందిపప్పు 824 633 191
3. గోధుమపిండి 824 341 483
4. పామాయిల్ 412 401 011
5. నెయ్యి 824 626 198
6. శెనగపప్పు 412 198 214