తాడిమర్రి,న్యూస్‌లైన్: ఆడపిల్లలంటే భారమనే రోజులకు కాలం చెల్లింది. అమ్మాయిల చదువు ఇంటికి వెలుగనీ, ప్రస్తుతం వారు అన్ని రంగాల్లో అబ్బాయిలతో పోటీ పడుతున్నారని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.మండల కేంద్రంలో రూ.1.25 కోట్లతో నిర్మించిన కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన ఆదివారం రిబ్బన్ కట్‌చేసి ప్రారంభించారు. అనంతరం విద్యాలయంలోని వసతి, వంట, భోజనం గదులను పరిశీలించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పేద విద్యార్థినుల కోసం సకల వసతులు ఉన్న కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని మంజూరు చేయించానన్నారు. బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని కోరారు. రూ.3.2 కోట్లతో మోడల్ స్కూల్, రూ.86 లక్షలతో బీసీ హాస్టల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినట్లు ఆయన తెలిపారు.
అనంతరం ఆయన ఎస్సీ కాలనీ సమీపంలో ఆర్డీటీ పాఠశాల వద్ద నిర్మిస్తున్న బీసీ హాస్టల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ మీ తల్లిదండ్రులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారని, కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగాలు సాధిస్తేనే వారి ఆశలు నెరవేరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హర్షిత, ఎంపీడీఓ రమేష్‌నాయక్, తహశీల్దార్ నాగరాజు, ఎంఈఓ కృష్ణమోహన్, ఎస్‌ఓ మాధవీలత, ఇంజినీర్ రియాజ్‌అహ్మద్, వైఎస్సార్ సీపీ నాయకులు ధర్మవరం మార్కెట్‌యార్డు చైర్మన్ రామకృష్ణారెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు పాటిల్ భువనేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అమ్మాయిల చదువు ఇంటికి వెలుగు
Published Mon, Jan 6 2014 4:23 AM | Last Updated on Tue, May 29 2018 2:26 PM
Advertisement