కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి
లోక్‌సభలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో, ప్రకాశం జిల్లాలో ప్రజలు తీవ్రమైన మూత్రపిండ వ్యాధుల బారిన పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీనిపై కేంద్ర బృందం అధ్యయనం చేసిందని, వ్యాధికి గల కారణాలు తెలియరాలేదని పేర్కొంది. కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీ ఏమైనా ఉందా అని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఫగన్‌సింగ్ కులస్తే శుక్రవారం లోక్‌సభలో రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
కాగా, ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లు శుక్రవారం లోక్‌సభకు వచ్చినా అది చర్చకు రాకుండా ప్రభుత్వం అడ్డుపడటం సరికాదని వైవీ సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రత్యేకహోదా బిల్లుపై వాయిదా లేకుండా చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు.