సీట్ల పెంపు లేదు
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం స్పష్టీకరణ
- ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి కేంద్ర హోంశాఖ లిఖితపూర్వక సమాధానం
- రాజ్యాంగాన్ని సవరించనిదే సాధ్యం కాదని తెలిపిన న్యాయశాఖ
- ఒకవేళ చేయాలనుకున్నా రాజ్యసభలో మెజారిటీ లేదు
- 2018 వరకూ సాధ్యమయ్యే అవకాశం లేదు
- సగానికిపైగా రాష్ట్రాలు ఆమోదించాల్సిందే..
- ఇవన్నీ ఇప్పుడు సాధ్యమయ్యే పనికాదు
- అన్నీ తెలిసీ మరోమారు మభ్యపెట్టే కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ సవరణ జరగనిదే ఆంధ్రప్రదేశ్‌లో నియోజకవర్గాల పునర్విభజన సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం మరోమారు తేల్చిచెప్పింది. వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి కేంద్ర హోంశాఖ పంపిన లేఖలో ఈ విషయాన్ని స్పష్టంగా వివరించింది. నియోజకవర్గాల పునర్విభజనకు రాజ్యాంగంలోని 170 అధికరణను సవరించాల్సిందేనని అటార్నీ జనరల్ కూడా అభిప్రాయపడ్డారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ అహీర్ తెలియజేశారు. వైవీ సుబ్బారెడ్డికి పంపిన లేఖలో కేంద్రం ఏం చెప్పిందంటే.. ఆంధ్రప్రదేశ్‌లో నియోజక వర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉందా? అని మీరు అడిగిన అంశాన్ని పరిశీలించాం.
కేంద్ర న్యాయ శాఖ ద్వారా అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని కూడా తీసుకున్నాం. 2014 ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26కు అనుగుణంగా భారత రాజ్యాంగంలోని 170వ అధికరణను సవరించనిదే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచడం సాధ్యమయ్యే పనికాదు. అందువల్ల రాజ్యాంగ సవరణ జరగనిదే ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచడం సాధ్యం కాదని వివరిస్తున్నాం అని గంగా రామ్ అహిర్ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులే కాదు.. ఇటీవల ప్రధాన ఎన్నికల కమిషనర్ని కలసినప్పుడు కూడా వైవీ సుబ్బారెడ్డికి ఆయన ఈ విషయాన్నే స్పష్టం చేశారు.
సగానికిపైగా రాష్ట్రాలు ఆమోదిస్తేనే..
వైవీ సుబ్బారెడ్డికి పంపిన లేఖలో రాజ్యాంగ సవరణ జరిగితే తప్ప పునర్విభజన సాధ్యం కాదని కేంద్రం తేల్చిచెప్పింది. గతంలో కూడా పలుమార్లు కేంద్రం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. రాజ్యాంగాన్ని సవరించాలంటే పార్లమెంటు ఉభయ సభల్లోనూ మెజారిటీ ఉండాలి. దాంతోపాటు 50 శాతానికిపైగా రాష్ట్రాలు కూడా ఈ ప్రతిపాదనను ఆమోదించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ లేదు. రాజ్యసభ లోనూ మెజారిటీ రావాలంటే బీజేపీ 2018 వరకు వేచి చూడాల్సి ఉంటుందని పార్లమెంటరీ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న నిపుణులంటున్నారు. అంటే 2018లో రాజ్యసభలోనూ బీజేపీకి మెజారిటీ వచ్చిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన అవసరమేనని బీజేపీ భావిస్తేనే జరుగుతుందన్నమాట. ఇదీ వాస్తవ పరిస్థితి.
అవసరమైన వాటిపై దృష్టి ఏది?
కేంద్ర ప్రభుత్వం పదేపదే స్పష్టం చేస్తున్నా, ఎన్నికల కమిషన్ చెబుతున్నా ముఖ్యమంత్రి మాత్రం అది జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్పింది. అయినప్పటికీ జరగదని తెలిసినా జరిగిపోతోందని, త్వరలో అయిపోతోందని ప్రచారం చేయడం, స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటనలు చేస్తుండడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. 50 స్థానాల పెంపుపై చంద్రబాబుకు ఉన్న శ్రద్ధ ఐదున్నర కోట్ల మంది ప్రజల భవిష్యత్‌పై లేదని విమర్శకులంటున్నారు.
లక్షల ఉద్యోగాల కల్పనకు దోహదపడే ప్రత్యేక హోదా గానీ, విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు గానీ, రైల్వే జోన్‌గానీ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధిగానీ చంద్రబాబు పట్టించుకోకపోవడమే ఇందుకు నిదర్శనమని వారు వ్యాఖ్యానిస్తున్నారు. పునర్విభజనపై పదేపదే ప్రకటనలు చేయడం, ఢిల్లీ నాయకులతో చర్చిస్తున్నారని, ఫైళ్లు పరిగెడుతున్నాయని ప్రచారం చేయడంపై ఉన్న శ్రద్ధ ప్రజలకు మేలు చేసే అంశాలపై లేదన్న విమర్శలున్నాయి. ముఖ్యమంత్రి రకరకాల ప్రకటనలు చేస్తూ జనాన్ని మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటున్నారు తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పట్టించుకోవడం లేదని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.
అందరినీ మభ్యపెట్టే ఈ ప్రచారం ఎందుకంటే...
కోట్లుపోసి కొనుక్కున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో రగిలిపోతున్నారని, సొంత పార్టీలోనూ అసమ్మతి జ్వాలలు రగులుతున్నాయని, ఈ చర్చ నుంచి దారి మళ్లించడం కోసమే చంద్రబాబు పునర్విభజన చర్చను ముందుకు తెచ్చారని విమర్శకులంటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వారి నియోజకవర్గాలలో తెలుగుదేశం నాయకులకు మధ్య పొసగడం లేదు. ఆ స్థానాలు ఎవరికి కేటాయిస్తారన్న దానిపై తీవ్ర గందరగోళం నెలకొంది. కొనుక్కొచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాపాడుకోవడం, సొంత పార్టీ నాయకులను సముదాయించడం కోసం చంద్రబాబుకు ఇంతకు మించిన మార్గం లేదని విశ్లేషకులంటున్నారు. అందుకే వీలు కుదిరినప్పుడల్లా దీనిని చర్చనీయాంశం చేసి ఆశావహుల్లో ఆశలు సజీవంగా ఉంచి పబ్బం గడుపుకుంటున్నారని స్పష్టమవుతోంది.