ఖాతాదారులకు మరిన్నిసేవలు అందిస్తాం
గూడూరు రూరల్ : ఖాతాదారులకు మెరుగైన బ్యాంకింగ్ సేవ లతోసాటు మరిన్ని సేవలను అందిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని సిండికేట్ బ్యాంక్ గూడూరు బ్రాంచ్ మేనేజర్ లక్ష్మీనరసింహం అన్నారు. సిండికేట్ బ్యాంక్ 89వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం బ్యాంకులో వ్యవ స్థాపక ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
మున్సిపల్ పాఠశాల విద్యార్థులకు విద్యాసామగ్రితోపాటు స్వీట్లు పంచిపెట్టారు. ఆయన మాట్లాడుతూ 1925 అక్టోబర్ 20న కర్ణాటకలోని ఓ కుగ్రామంలో ప్రారంభించిన సిండికేట్ బ్యాంక్ ప్రస్తుతం 4 లక్షల కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తూ దేశంలో ప్రీమియర్‌లీడ్ బ్యాంకుల సరసన చేరిందన్నారు. గూడూరు శాఖ ఏర్పడి 30 సంవత్సరాలు అయిందని, రూ.75 కోట్ల వ్యాపారాన్ని చేస్తూ అటూ ప్రాధాన్యతా రంగానికి ఇటు ప్రజలకు అవసరమైన రుణాలను అందిస్తూ ముందంజలో ఉందన్నారు.
ప్రస్తుతం గూడూరు శాఖ ద్వారా హౌసింగ్, వాహన రుణాలతోపాటు విద్యార్థులకు విద్యా రుణాలను అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీకి బ్యాంకు నుంచి 1400 మంది రైతులకు రుణమాఫీకి సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి అందజేశామన్నారు. ప్రజలు తమ బ్యాంకు సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.
అలాగే ప్రధాని మోదీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్‌లో భాగంగా తోడ్పాటును అందించేందుకు బ్యాంకు సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్ నిరంజన్‌రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ హరికృష్ణరెడ్డి, సిబ్బంది షరీఫ్, చంద్రమౌళి, వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.