- మీడియా సలహాదారు పరకాల
విశాఖ రూరల్: నగర ప్రజల వినియోగం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, పంచదార, నూనె, ఉప్పు, వివిధ రకాలైన కూరగాయలు నగరంలో రైతు బజార్లకు చేరుకున్నట్లు ప్రభుత్వ మీడియా సలహాదారుడు పరకాల ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. మర్రిపాలెంలో ఉన్న సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ గొడౌన్స్ వద్ద గల సర్కిల్-1కు 27 ట్రాక్కులతో 427 టన్నుల బియ్యం తూర్పుగోదావరి నుంచి, మరో రెండు ట్రక్కులలో 41 టన్నుల బియ్యం విజయనగరం జిల్లా నుంచి చేరుకున్నాయని పేర్కొన్నారు.
సర్కిల్-2 కార్యాలయానికి 40 లారీలలో 600 టన్నులు బియ్యం కాకినాడ నుంచి వచ్చాయన్నారు. రెండు సర్కిల్స్‌కు కలిపి గుంటూరు నుంచి 80 టన్నుల కందిపప్పు, ఒడిశా నుంచి 80 టన్నుల ఉప్పు, కాకినాడలో గల ఏపీ ఆయిల్ ఫెడ్ నుంచి 80 వేల లీటర్ల నూనె, 80 టన్నుల పంచదార వచ్చి చేరినట్లు వెల్లడించారు.
పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా సరఫరా చేయనున్నట్టు వివరించారు. అలాగే గోపాలపట్నం రైతు బజార్‌కు కృష్ణా జిల్లా నుంచి 5 లారీలతో బంగాళాదుంపలు, మునగ కాడ, బీట్‌రూట్, టమాటా, ఉల్లిపాయలు వంటి కూరగాయలు వచ్చాయని, వాటిని కిలో రూ.5 చొప్పున దుంపలు, ఉల్లి, మిగిలినవి కిలో రూ.3 చొప్పున ఒక్కొక్కరికి 3 కిలోల వంతున విక్రయిస్తున్నట్లు తెలిపారు.
సీతమ్మధార రైతు బజారుకు రాజమండ్రి రైతు బజార్ నుంచి బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, దోసకాయలు ఒక్కో లారీ చొప్పున, వంకాయలు 30 బస్తాలు, బెండకాయలు 11 బస్తాలు, కాకరకాయలు 5 బస్తాలు, ఆనపకాయలు 27 బస్తాలు వచ్చినట్లు పేర్కొన్నారు.
ఎంవీపీ రైతు బజార్‌కు గుంటూరు జిల్లా తెనాలి రైతుబజార్ నుంచి టమాటా 200 కేజీలు, మిర్చి 1500 కేజీలు, దొండకాయలు 3 వేల కిలోలు, మునగకాడలు 500 కిలోలు, బెండ వెయ్యి కిలోలు, ఆనపకాయలు 500 కిలోలు ఒక లారీ లోడుగా వచ్చినట్లు తెలిపారు. అలాగే బంగాళాదుంపలు ఒక లారీ నిండుగా 19 టన్నులు, ఉల్లిపాయలు 500 కిలోలు గురువారం వచ్చాయన్నారు. వాటిని ప్రభుత్వ ఆదేశాల మేరకు అతి తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలియజేశారు.