
ఆది పర్వం.. తుది అంకం
చేస్తున్నారు. ఇదిలావుండగా, 11వ రోజైన శుక్రవారం యాత్రికుల రద్దీ స్వల్పంగా తగ్గింది. పిండ ప్రదానాలు నామమాత్రంగానే జరిగాయి మహారాష్ట్రలోని విదర్భ నియోజకవర్గ ఎంపీ భావనా గవాలి పాటిల్ శుక్రవారం కొవ్వూరు వీఐపీ ఘాట్‌లో పుష్కర స్నానం ఆచరించారు. గోదావరి పుట్టిన మహారాష్ట్రలో కంటే ఏపీలోనే పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత బోటు ద్వారా కొవ్వూరులో పుష్కర ఘాట్లను పరిశీలించి యాత్రికులతో మాట్లాడారు. రాష్ర్ట ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీని వాస్ కొవ్వూరులోని ఘాట్లను పరిశీలించారు.
నీటిమట్టం తగ్గడంతో జల్లు స్నానాలు
నరసాపురంలో శుక్రవారం భక్తుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. పిండ ప్రదానాలు తక్కువగా జరిగాయి. గోదావరిలో నీటిమట్టం తగ్గిపోవడంతో వలంధర రేవులో జల్లు స్నానాలకు భక్తులు ప్రాధాన్యమిచ్చారు. లలితాంబ ఘాట్‌లో జల్లు స్నానం రద్దు చేయడంతో భక్తులు నిరుత్సాహానికి గురయ్యారు. సంబరం చివరి దశకు చేరడంతో అధికారులు ఏర్పాట్లపై కాస్త నిర్లిప్త ధోరణిని ప్రదర్శిస్తున్నారు. శుక్రవారం ఘాట్ల వద్ద అధికారులు సందడి తగ్గింది. పర్యవేక్షణ లోపాలు తలెత్తి భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఇదిలావుంటే స్వచ్ఛంద సంస్థల సహాయ కార్యక్రమాలు మరింత విస్తరించాయి. పట్టణంలోని ప్రతి రోడ్డులో అన్నదానాలు, పులిహోర, అల్పాహారం పంపిణీ కొనసాగుతోంది. తానా అధ్యక్షుడు సతీష్ వేమన, సభ్యులు విష్ణు దోనేపూడి పుష్కర స్నానాలు చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వంక రవీంద్ర, ముదునూరి ప్రసాదరాజు, నరసాపురంలో ఘాట్లను పరిశీలించారు. పెనుగొండలో కూడా భక్తుల రద్దీ కాస్త తగ్గింది. ఎండలో మంచినీళ్లు దొరక్క యాత్రికులు ఇబ్బందులు పడ్డారు. కనీసం పుష్కర సిబ్బందికి కూడా మంచినీళ్లు అందించలేని పరిస్థితి నెలకొంది.
ఆచంటకు ఆర్టీసీ బస్సుల్లేవ్
ఆచంట మండలంలో ఘాట్ల వద్దకు చేరుకోవడానికి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచలేకపోయారు. కరుగోరుమిల్లి, భీమలాపురం రేవుల్లోకి ఆటోల్లో వెళ్లాల్సి వస్తోంది. కనీసం చివరి రోజైనా ఘాట్లకు ఆర్టీసీ బస్సులు వెళ్లే ఏర్పాట్లు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిడదవోలులోనూ భక్తుల రద్దీ కాస్త తగ్గింది. రెండు రోజుల క్రితం కురిసిన వర్షం తాలూకు ఇబ్బందులు ఇక్కడ తొలగలేదు. పెండ్యాల ఘాట్‌కు వెళ్లే మార్గం బురదమయంగా మారింది. పిండప్రదాన షెడ్డులో వర్షం నీరు నిల్వ ఉండటంతో అక్కడే కష్టం మీద పిండ ప్రదాన క్రతువులు నిర్వహించుకున్నారు. మంత్రి మాణిక్యాలరావు ఇక్కడి ఘాట్లను పరిశీలించారు.
పట్టిసీమ దర్శన భాగ్యం కరువు
పోలవరం మండలం పట్టిసీమ క్షేత్రాన్ని దర్శించుకునే భాగ్యం శుక్రవారం కూడా దక్కలేదు. నదిలో నీటిమట్టం పెరగడంతో లాంచీ లను తిప్పడం లేదు. లాంచీల రేవులో ప్లాట్‌ఫామ్ మెరక చేసే పనులు చేపట్టకపోవడమే దీనికి కారణం. ముందుచూపుతో వ్యవహరించి తగిన ఏర్పాట్లు చేసి ఉంటే పవిత్ర పుష్కరాల సమయంలో పట్టిసీమ క్షేత్రానికి చేరుకోవడానికి భక్తులకు ఇబ్బంది ఉండేది కాదని స్థానికులు పేర్కొంటున్నారు. పట్టిసీమ క్షేత్ర దర్శనం లేకపోవడంతో మహానందీశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. మండలంలోని ఘాట్లను మంత్రులు పరిటాల సునీత, చింతకాయల అయ్యన్నపాత్రుడు పరిశీలించారు.
పెరవలి మండలానికి పొరుగు రాష్ట్రాల భక్తుల తాకిడి
పెరవలి మండలంలోని అన్నిఘాట్ల వద్ద రద్దీ ఓ మాదిరిగా కొనసాగింది. ఖండవల్లి, ముక్కామల, కాకరపర్రు, తీపర్రు ఘాట్లు మధ్యాహ్నం వరకు రద్దీగా ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు యలమంచిలి మండలం అబ్బిరాజుపాలెం ఘాట్‌లో పుష్కర స్నానం చేశారు.