బంగారు వ్యాపారుల ఆందోళన
500 దుకాణాల మూసివేత
వర్తకుల వద్ద ఉండిపోయిన ఆర్డర్లు
పెళ్లిళ్లపై పడుతున్న ప్రభావం
రోజూ అరకోటి లావాదేవీల నిలిపివేత
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : కేంద్రం ప్రకటించిన ఎక్సైజ్, కస్టమ్స్ సుంకం విధింపు అమలును నిరసిస్తూ జిల్లాలో బంగారు వర్తకులు నాలుగురోజులుగా నిరవధిక సమ్మెలోకి దిగారు. 500బంగారు దుకాణాలు మూతపడ్డాయి. ఈ ప్రభావం సుమారు ఐదు వేల కుటుంబాలపై పడింది.
కేంద్రం 2015-16 బడ్జెట్‌లో ప్రకటించిన అన్ని లావాదేవీలపై 1శాతం ఎక్సైజ్ సుంకం అమల్లోకి వస్తే తాము ఇకపై వ్యాపారం చేయలేమని బంగారు వర్తకులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే 14.5శాతం రాష్ట్రానికి, 1శాతం కేంద్రానికి చెల్లిస్తున్నామని, భవిష్యత్తులో తయారీ, కొనుగోలు, అమ్మకాలు, మజూరీపై ఎక్సైజ్ సుంకం మరో 1శాతం చెల్లించాల్సి వస్తే కొనుగోలు దారులపై ఆ ప్రభావం పడి వ్యాపారాల్ని మూసేసే పరిస్థితి వస్తుందంటూ వ్యాపారులు ఆందోళన ప్రారంభించారు.
రోజూ అరకోటి లావాదేవీలు
జిల్లా వ్యాప్తంగా నిత్యం సుమారు రూ.50లక్షల విలువైన బంగారం అమ్మకం/కొనుగోలు జరుగుతోంది. బులియన్ మార్కెట్ ఆధారంగా ఆన్‌లైన్ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నవారు మరికొంతమంది ఉన్నారు. ధర్మకాటా, వస్తువుల తయారీ దారులు జిల్లాలో సుమారు రెండు వేల మంది ఉన్నారు. ఇటీవల మరికొంత మంది కొత్తగా వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఆలిండియా గోల్డ్ అండ్ జ్యూయలరీ అసోసియేషన్ ఇచ్చిన పిలుపుమేరకు వ్యాపారులు నిరవధిక బంద్ చేపట్టారు. వీపీ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు బంగారం వ్యాపారంపై ఎక్సైజ్ సుంకం విధానాన్ని రద్దు చేశారు.
అనంతరం 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యాపారులు దేశవ్యాప్తంగా 21రోజులు నిరసన వ్యక్తం చేసి జీవో రద్దు చేయించారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ వ్యాపారులకు అండగా నిల్చింది. అదే బీజేపీ ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ బంగారంపై పన్ను విధించడాన్ని వ్యాపారులు తప్పుబడుతున్నారు. ఈ మేరకు ఏపీ వ్యాప్తంగా వ్యాపారులు సమావేశమై కఠిన నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం తన ప్రకటనను వెనక్కు తీసుకునేంతవరకు తమ నిరసన ఆగదని ఇక్కడి వ్యాపారులకూ సమాచారం పంపించారు.
బంగారం అధికంగా కొనుగోలు చేసేది వివాహాల సమయంలోనే. సంక్రాంతి తరువాత మాఘ మాసంలో చాలామంది ఆభరణాల కోసం ఆర్డర్లిచ్చారు. ముక్క బంగారం కొనుగోలు చేసి షరాబుల వద్ద మజూరీకి పంపించారు. వర్తకులు సమ్మెలోకి దిగడంతో ఆ ప్రభావం భారీగా పడనుంది. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.5కోట్ల విలువైన వస్తువులు దుకాణదారులు, షరాబుల వద్దే ఉండిపోయాయి.
ఇటీవల ఒక్కరోజే సుమారు రూ.10లక్షల వెండి విక్రయాలు నిల్చిపోయాయి. ఖాతాదారులు తయారైన కొత్త వస్తువులు తీసుకెళ్లకపోతే, సమ్మె ముగిసేంతవరకు ఇచ్చేది లేదని వ్యాపారులు చెబుతున్నారు. నెలకు రూ.50లక్షలు, ఏడాదికి కనీసం రూ.6కోట్ల టర్నోవర్ దాటే ప్రతీ వ్యాపారి విధిగా పన్ను చెల్లింపునకు బాధ్యుడవుతారని కేంద్రం ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె నిర్ణయం తీసుకున్నామని వ్యాపారులు చెబుతున్నారు. దుకాణాల బంద్ కారణం గా చిన్న వ్యాపారులు తాత్కాలికం గా, ఆర్థికంగా ఇబ్బంది పడినా జీవో రద్దయితే భవిష్యత్తుకు భరోసా ఉంటుందని చెబుతున్నారు.
బంగారు వర్తకుల కొవ్వొత్తుల ర్యాలీ
పాత శ్రీకాకుళం: పట్టణంలోని బంగారం, వెండి వర్తకుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి స్థానిక ఏడురోడ్ల జంక్షన్ నుంచి సూర్యమహాల్ జంక్షన్ వరకూ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈసందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు పేర్ల సాంబమూర్తి, చంద్రమౌళిరాజు, లంక గాంధీలు మాట్లాడుతూ ఇప్పటికే పెళ్లిళ్ల ముహూర్తాలు దగ్గర పడుతుండడంతో చాలామంది బంగారం కొనుక్కోలేక నానా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. సుదూర ప్రాంతాల నుంచి బంగారం కొనుక్కోవడానికి వచ్చిన వారు షాపులు మూసి ఉండడంతో వెనక్కి వెళ్ళిపోతున్నట్టు చెప్పారు. ఇప్పటికైనా కేంద్రం దిగొచ్చి బంగారంపై ఆమోదించిన సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ర్యాలీలో బంగారం వెండి వర్తకులు వైకుంఠరావు, సన్యాసిరావు, పైడితల్లి, శ్రీనివాసరావు, రమణ తదితరులు పాల్గొన్నారు.
స్పష్టమైన నిర్ణయం రావాల్సిందే..
సోమవారం కొవ్వొత్తుల ర్యాలీ కూడా నిర్వహించాం. రాష్ట్ర అసోసియేషన్ నుంచి స్పష్టమైన నిర్ణయం రావాలి. అది వెలువడే వరకు శ్రీకాకుళం జిల్లాలో దుకాణాలు తెరిచేదిలేదు.
పేర్ల సాంబమూర్తి,
అధ్యక్షుడు, జిల్లా గోల్డ్ అండ్ సిల్వర్ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్
ఆగ్రహ స్వర్ణం
Published Tue, Mar 15 2016 1:18 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement