గోపాలపురం  మే ‘కుల’ కుర్చీ | Gopalapuram Assembly constituency In West Godavari | Sakshi
Sakshi News home page

గోపాలపురం  మే‘కుల’ కుర్చీ

Published Mon, Mar 18 2019 12:52 PM | Last Updated on Mon, Mar 18 2019 1:00 PM

Gopalapuram Assembly constituency In West Godavari - Sakshi

గోపాలపురం నియోజకవర్గం, వైఎస్సార్‌సీపీ గోపాలపురం అభ్యర్థి తలారి వెంకట్రావు

సాక్షి, దేవరపల్లి: జిల్లాలోని మూడు ఎస్సీ నియోజకవర్గాల్లో ఇది ఒకటి. ఇక్కడి ఓటర్లు 35 ఏళ్ల నుంచి తమ విలక్షణతను ప్రదర్శిస్తున్నా.. వారి తలరాత మాత్రం మారడం లేదు. 1983 వరకు కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టిన ఓటర్లు అనంతరం టీడీపీ ఆవిర్భావంతో ఆపార్టీని ఆదరిస్తున్నారు. అయితే పాలకులు మాత్రం ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోలేదు. కులదురహంకారంతో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. 2004 ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభంజనంతో ఈ నియోజకవర్గంలో మార్పువచ్చినా.. మళ్లీ 2009 నుంచి పాతతీరే కొనసాగింది. ఈ సారైనా మళ్లీ మార్పు కనిపిస్తోందని ప్రజలు ఆశగా నిరీక్షిస్తున్నారు.

 
అగ్రకుల ఏలుబడి 
నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వు అయినప్పటికీ ఏలుబడి మాత్రం అగ్రకులాల పెద్దలదే. 2004 వరకు కొవ్వూరు జమీందార్లు పెండ్యాల కుటుంబం నాయకత్వంలో శాసనసభ్యులు పనిచేసేవారు. 2004 ఎన్నికల్లో వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ గెలవడంతో పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. అయితే మళ్లీ 2009 నుంచి పాతతీరే కొనసాగింది.  2014 ఎన్నికల నుంచి నియోజకవర్గంలో జెడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు వర్గం ఆధిపత్యం కొనసాగిస్తోంది.  1962లో గోపాలపురం నియోజకవర్గం ఏర్పడింది.   2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా తలారి వెంకట్రావు, టీడీపీ అభ్యర్ధిగా ముప్పిడి వెంకటేశ్వరరావు పోటీపడగా అతితక్కువ ఓట్ల తేడాతో ముప్పిడి వెంకటేశ్వరరావు గెలిచారు. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన వారిలో తానేటి వీరరాఘవులు, కారుపాటి వివేకానంద మంత్రులుగా పనిచేశారు. 


వ్యవసాయం ప్రధాన జీవనాధారం
నియోజకవర్గంలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. ప్రధానంగా వాణిజ్య పంటలు వర్జీనియా పొగాకు, జీడిమామిడి, ఆయిల్‌పామ్, కొబ్బరి సాగవుతున్నాయి.  వరి, మొక్కజొన్న సాగుపైనా ఇక్కడి రైతులు మొగ్గుచూపుతారు. వ్యవసాయరంగం పూర్తిగా బోరుబావులపై ఆధారపడి సాగుతోంది. మోటార్ల ద్వారా భూగర్భ జలాలను తోడి రైతులు పంటలు పండిస్తున్నారు.  సుమారు 7,600 హెక్టార్లలో వర్జీనియా పొగాకు సాగవుతోంది. మెట్ట ప్రాంతంలోని పొలాలకు సాగునీరు అందించాలనే ఆలోచనతో 2005లో ఏర్పాటు చేసిన తాడిపూడి ఎత్తిపోతల పథకం కాలువ ద్వారా 2.05 లక్షల ఎకరాలకు నీరు సరఫరా చేయాల్సి ఉండగా, కేవలం 60 వేల నుంచి 70 వేల ఎకరాలకు నీరు సరఫరా జరుగుతోంది. దాదాపు 7 వేల బోర్లు ఉన్నాయి.


ఆధ్యాత్మిక క్షేత్రాలు..
 ద్వారకాతిరుల చినవెంకన్న క్షేత్రం ఈ నియోజకవర్గంలోనే ఉంది. ప్రముఖ క్రైస్తవ పుణ్య క్షేత్రం నిర్మలగిరి కూడా ఇక్కడే గౌరీపట్నంలో కొలువైంది.  


120 ఎకరాల్లో నల్లరాతి క్వారీలు
నియోజకవర్గంలో విస్తరించిన నల్లరాతి క్వారీల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. దేవరపల్లి మండలంలో గౌరీపట్నం, కొండగూడెం, దుద్దుకూరు, బందపురం, లక్ష్మీపురం గ్రామాల్లో నల్లరాతి క్వారీలు విస్తరించి ఉన్నాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి ఆదాయంతోపాటు దాదాపు 10వేల మంది కూలీలకు ఉపాధి లభిస్తోంది. 120 క్వారీలు, 100 క్రషర్లు ఉన్నాయి. 


భౌగోళిక స్వరూపం
తూర్పున కొవ్వూరు, దక్షిణాన తాడేపల్లిగూడెం, 
ఉత్తరాన పోలవరం, పడమర చింతలపూడి 
నియోజకవర్గాలు సరిహద్దులుగా ఉన్నాయి.


ముఖ్యమైన సమస్య
ఇళ్లస్థలాల సమస్య ఎక్కువగా ఉంది.  టీడీపీ పాలనలో ఎక్కడా ఒక్క పేదవాడికి కూడా ప్రభుత్వం గజం జాగా ఇవ్వలేదు.  సుమారు 20 వేల కుటుంబాలు ఇళ్లస్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి  పాలనలో అడిగిన ప్రతిపేదవాడికీ గృహాలు మంజూరు చేశారు. ఆయన హయాంలో సుమారు 25,000 గృహాల నిర్మాణం జరిగింది. గత ఐదేళ్లల్లో కనీసం నాలుగు వేల గృహాలు కూడా నిర్మాణం జరగలేదు.

              
బలం పుంజుకున్న వైఎస్సార్‌ సీపీ
నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ బలమైన శక్తిగా ఎదిగింది.  ఐదేళ్లుగా ఆపార్టీ సమన్వయకర్త తలారి వెంకట్రావు ప్రజల్లో ఉంటూ సమస్యలపై నిరంతర పోరాటం చేస్తున్నారు. గడగడపకూ వైఎస్సార్‌ సీపీ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే మూడునాలుగుసార్లు ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. ఈసారి గెలుపుపై ధీమాతో ఉన్నారు.  అధికార టీడీపీలో రెండు బలమైనవర్గాలు గ్రూపులుగా ఏర్పడ్డాయి. ఆధిపత్యం కోసం కుమ్ములాడుతున్నాయి. ప్రజలు ఈసారి వైఎస్సార్‌సీపీవైపు మొగ్గుచూపుతున్నారు.  


మండలాలు: గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల, ద్వారకాతిరుమల

ఓటర్లు

పురుషులు  

స్త్రీలు ఇతరులు
 2,22,223 1,11,092 1,11,115 16


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement