వంతెన నిర్మాణం చేపట్టి రహదారి కష్టాలు తీర్చాలని వాల్తేరుతోపాటు పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇదే డిమాండ్‌తో చేపట్టిన నిరసన దీక్షలు ఆదివారంతో 400 రోజులు పూర్తి కానున్నాయి. సంతకవిటి మండలం బలసలరేవు వద్ద నాగావళి నదిపై వంతెన నిర్మాణం చేపట్టాలని వాల్తేరు గ్రామంలో ప్రజలు దీక్షబూనారు. నెలల తరబడి దీక్షలు కొనసాగుతున్నా టీడీపీ సర్కార్ ఏమాత్రం స్పందించడం లేదు. ఎంతో కీలకమైన ప్రజా సమస్య పట్టనట్టు వ్యవహరిస్తుండడంపై ప్రజలు మండిపడుతున్నారు. కేవలం ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతోనే ఎంతో కీలకమైన సమస్యను పాలక పక్షం పట్టించుకోవడం లేదని జనం భావిస్తున్నారు.
రాజాం: బలసలరేవు వద్ద నాగావళి నదిపై వంతెన నిర్మాణం చేపడితే 30 గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వంతెన నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చింది. అయితే అది ఇప్పటికీ నెరవేరలేదు. దీంతో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని 30 గ్రామాలు ఘోషిస్తున్నాయి. వంతెన నిర్మాణం చేపట్టాలని నినదిస్తున్నాయి. రోజుకు 30 మందికి తక్కువ కాకుండా నిరసన దీక్షలను సైతం చేస్తున్నారు.
అలుపెరగకుండా..
వాల్తేరు గ్రామంలో బలసలరేవు వంతెన నిర్మాణం నిమిత్తం గతేడాది ఫిబ్రవరి నెలలో చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం నాటికి 400 రోజుకు చేరుకుంటున్నాయి. వాల్తేరు గ్రామ సమీపంలో బలసలరేవు వద్ద నుంచి నాగావళి నదిపై రెండో వైపున ఉన్న ఇసుకలపేట వరకూ వంతెన నిర్మాణం నిమి త్తం చేపడుతున్న ఈ దీక్షలకు విశేషస్పందన లభిస్తుంది. వాల్తేరు, పనసపేట, జీఎన్‌పురం, బూరాడపేట, హొంజరాం, చిత్తారిపురం, కావలి, గోకర్ణపల్లి, సిరిపురం, అప్పలఅగ్రహారం, జానకీపురం, మండాకురిటి తదితర 30 గ్రామాలకు చెందిన ప్రజలు, ప్రజా ప్రతినిధులు, యువతతో పాటు జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వామపక్షాల నేతలు, ఇతర జిల్లాలకు చెందిన ప్రజా సంఘాల నేతలు గత కొన్ని నెలలుగా వంతెన నిమిత్తం పోరాడుతున్నారు. ఒకరిద్దరితో ప్రారంభమైన దీక్షలు మండు వేసవిలోనూ, భోరున కురిసే వర్షంలోనూ, గజగజలాడించే చలికాలంలో కూడా కొనసాగుతూ వచ్చింది. వందలాదిమందిని సాధనకమిటీలో చేర్చుకుంది.
ఆ హామీలు నిలబెట్టుకోకపోవడంతో..
వాల్తేరు వద్ద బలసలరేవు వంతెన నిర్మాణం అనేది టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఇచ్చిన హామీనే. ఇక్కడ వంతెన నిర్మాణం నిమిత్తం సోయిల్ టెస్టు చేశారు. వంతెన నిర్మాణం కోసం 1999లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రూ. 19 కోట్లు నిధులు కూడా మంజూరు చేసినట్లు జీవోను విడుదల చేశారు. అయితే వంతెనకు సంబంధించి నిధులు విడుదల, టెండర్ల ప్రక్రియను ఖరారును మాత్రం అప్పట్లో వేగవంతం చేయలేదు. అనంతరం నాలుగేళ్లు గడిపేసిన టీడీపీ సర్కారు 2004లో ఓడిపోవడంతో తప్పించుకుంది. టీడీపీ నాయకులు కూడా పూర్తిగా మరిచిపోయారు. నాలుగేళ్ల క్రితం మరో సారి అధికారం చేపట్టన టీడీపీ గతంలో ఇచ్చిన వంతెన హామీ విషయాన్ని పూర్తిగా మరిచిపోయింది. అలాగే బలసలరేవు వద్ద నిర్మించాల్సిన వంతెనను వేరే ప్రాంతానికి తరలించడానికి అధికార పార్టీ నాయకుడొకరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సంతకవిటి ప్రజలు మండిపడుతున్నారు. న్యాయపరంగా తమ ప్రాంతం వద్ద నిర్మించాల్సిన వంతెనను ఇక్కడ కట్టితీరాలని పట్టుబడుతున్నారు. ఎన్నికల సమయంలో వంతెన నిర్మిస్తామని హామీనిచ్చి..అధికారంలోకి వచ్చాక విస్మరించడం టీడీపీకి తగదని ప్రజలంటున్నారు.
వంతెన నిర్మిస్తే.. 30 గ్రామాలకు లబ్ధి
వాల్తేరు వద్ద నాగావళి నదిపై వంతెన నిర్మిస్తే 30 గ్రామాలకు చెందిన ప్రజలకు రహదారి కష్టాలు తప్పుతాయి. సంతకవిటి, జి.సిగడాం, పొందూరు, రేగిడి, రాజాం ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు ఆమదాలవలసతో పాటు నరసన్నపేట హైవేకు చేరుకునేందుకు మార్గం సుగుమం అవుతుంది. ప్రధానంగా వాల్తేరు పరిసర ప్రాంతాల్లో నాగావళి నదిపై 30 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా వంతెన లేకపోవడంతో వర్షా కాలంలో ప్రజలు రవాణా కష్టాలుపడుతున్నారు. వంతెన ఉంటే ఆర్థిక, మానవ వనరులు అభివృద్ధి చెందుతాయని ఈ ప్రాంత వాసలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నారనే అసూయతోనే..
వాల్తేరు గ్రామం పక్కనే టీడీపీ మాజీ ఎమ్మెల్సీ కావలి ప్రతిభాభారతి స్వగ్రామం కావలి గ్రామం ఉంది. గత 399 రోజులుగా ఇక్కడ వంతెన నిర్మాణం నిమిత్తం పోరాటం జరుగుతున్నా ఆమె పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
మరో వైపు టీడీపీ ఉన్నత స్థాయి ప్రజా ప్రతినిధులు ఎవరూ కూడా ఇటువైపు కన్నెత్తి చూడలేదు. వంతెన నిర్మించాల్సిన ఈ ప్రాంతం రాజాం నియోజకవర్గంలో ఉండడం, ఎమ్మెల్యేగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కంబాల జోగులు వ్యవహరిస్తుండడంతో అధికారపక్ష స్పందించడం లేదు. ఎంతో ప్రాధాన్యం ఉన్న వంతెన నిర్మాణాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం మానేసిందనే విమర్శలు వస్తున్నాయి.
పట్టించుకోవడంలేదు
399 రోజులుగా వంతెన నిర్మాణ దీక్షలు జరుగుతుంటే ప్రభుత్వానికి పట్టనట్లు ఉండడం శోచనీయం. టీడీపీ ఇచ్చిన మాట తప్పింది. ఇటువంటి ప్రభుత్వాన్ని ఇంతవరకూ చూడలేదు.
గురుగుబెల్లి పూర్ణారావు, వ్యాపారి, వాల్తేరు.
చీమ కుట్టినట్లు కూడా లేదు
వంతెన నిర్మాణం నిమిత్తం ఎంతో మంది పేదలు, ఉద్యోగులు దీక్షలు చేస్తున్నారు. విసుగులేకుండా నిరసన తెలుపుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం దిగిరాలేదు. సర్కారుకు ఇంతమొండి వైఖరి తగదు.
గురుగుబెల్లి సన్యాసిరావు, వాల్తేరు.
వెనక్కితగ్గేదిలేదు
వాల్తేరు వద్ద వంతెన ఎంతో అవసరం. ఎన్నో గ్రామాల ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది. చాలా మంది దీక్షను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎట్టిపరిస్థితుల్లో కూడా దీక్షను నిలుపుదలచేయడం. -గురుగుబెల్లి స్వామినాయుడు, వైఎస్సార్‌సీపీ కన్వీనర్, సంతకవిటి మండలం.
అసెంబ్లీలో ప్రస్తావించినా..
వాల్తేరు వద్ద నాగావళి నదిపై వంతెన ఎంతో అవసరం. వంతెన నిర్మాణానికి గతంలో టీడీపీ నిధులు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు ఆధారాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన ఓ నేత వంతెన దీక్షను అడ్డుకుంటున్నారనే ఫిర్యాదులు మా దృష్టికి వచ్చాయి. ఇక్కడ వంతెన నిర్మాణ ఆవశ్యకతను అసెంబ్లీలో కూడా ప్రస్తావించాం. అయినా సర్కారుపట్టించుకో లేదు. -కంబాల జోగులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాజాం.
Comments
Please login to add a commentAdd a comment