ఎందుకీ వివక్ష..! | govt Discrimination on Andhra Pradesh State Aids Control Society Employees | Sakshi
Sakshi News home page

ఎందుకీ వివక్ష..!

Oct 7 2017 10:22 AM | Updated on Sep 2 2018 4:46 PM

govt Discrimination on Andhra Pradesh State Aids Control Society  Employees - Sakshi

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ(ఏపీఎస్‌ఏసీఎస్‌)లో పనిచేస్తున్న ఉద్యోగులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. అత్యంత అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్న ఈ విభాగంలో సిబ్బంది సంక్షేమాన్ని సర్కారు పట్టించుకోవడం లేదు. మూడేళ్లుగా ఇంక్రిమెంట్లు సైతం మంజూరు చేయడం లేదని, సిబ్బంది జీతభత్యాల్లో సైతం తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని ఆ విభాగం ఉద్యోగులు నిరసన బాట పట్టారు.

జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలో 15 ఐసీటీసీ కేంద్రాలు, 3 పీపీటీసీ కేంద్రాలు, ఒక ఏఆర్‌టీ సెంటర్‌ ఉన్నాయి. వివిధ కేటగిరీల్లో 56 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో ఇద్దరు మెడికల్‌ ఆఫీసర్లు, ఐదుగురు స్టాఫ్‌ నర్సులు, ఒక ఫార్మాసిస్ట్, 25 మంది కౌన్సిలర్లు, 18 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఇద్దరు డేటా మేనేజర్లు, ఒక కోర్‌ కో ఆర్డినేటర్‌ ఉన్నారు.

సంక్షేమానికి దూరంగా..
సొసైటీలో పనిచేస్తున్న ఉద్యోగులంతా కాంట్రాక్టు పద్ధతిలో విధుల్లో చేరిన వారే. ప్రభుత్వం 2002లో వీరిని నియమించింది. ఇక్కడి ఉద్యోగులకు ఇతర వైద్య శాఖ సిబ్బంది మాదిరిగా ఈపీఎఫ్, హెచ్‌ఆర్‌ఏ, ఈఎస్‌ఐ, ఆరోగ్య కార్డులు వంటి సౌకర్యాలే వర్తింపజేయడం లేదు. ఈ విభాగంలో పనిచేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14 మంది మృతి చెందినా ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు. ఇక్కడి ఉద్యోగులు ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా రోగాలబారిన పడే ప్రమాదం ఉంది.  

జీతంలోనూ వ్యత్యాసాలే,..
వైద్య ఆరోగ్య శాఖలో ఒకే రకమైన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరికీ ఒకే రకమైన జీతాలు ఉండాలి. అయితే ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీలో పనిచేస్తున్న వారికి ఇతర విభాగాలతో పోల్చితే తక్కువగా చెల్లిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు విధానంలో పరిచేస్తున్న స్టాఫ్‌నర్సుకు రూ.33వేలు జీతంకాగా, సొసైటీలో పనిచేస్తున్న స్టాఫ్‌నర్సుకు రూ.17,500లు చెల్లిస్తున్నారు. ఎంఎల్‌టీ, ఇతర సిబ్బందికి కూడా జీతంలో తేడాలు ఉన్నాయి. ఎయిడ్స్‌ విబాగంలో పనిచేస్తున్న వారికి ఎటువంటి రిస్క్, ప్రత్యేక అలవెన్సులు ఇవ్వడం లేదు.

మూడేళ్లుగా ఇంక్రిమెంట్లు నిల్‌..
ఈ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి మూడేళ్లుగా ఇంక్రిమెంట్లు మంజూరు చేయడం లేదు. కేడర్‌ను బట్టి ఒక్కో ఉద్యోగికి రూ.1250 వంతున చెల్లించాలి. దీని ప్రకారం ఒక్కో ఉద్యోగికి ఎరియర్స్‌ సుమారు రూ.80వేలు నుంచి రూ.లక్ష వరకు బకాయిలు ఉన్నాయి. వీటిపై ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఉద్యోగుల పీఆర్‌సీతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా జీతం పెంచాల్సి ఉన్నా పాలకులు పట్టించుకోవడం లేదు.

ఉద్యమ బాటలో..
సమస్యల పరిష్కారంలో సర్కారు అలసత్వాన్ని నిరసిస్తూ ఉద్యోగులు ఉద్యమాల బాట పట్టారు. ఇప్పటికే పలుమార్లు మంత్రులకు, జిల్లాలో ఉన్నాతాధికారులకు వినతులు అందజేసినా ఫలితం లేకపోవడంతో ఈ నెల 2 నుంచి 14 వరకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.  నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరవుతున్నారు. ఈ సమయంలో ప్రభుత్వానికి అందజేయాల్సిన రిపోర్టులు, ఉత్తర ప్రత్యుత్తరాలను సైతం నిలుపుదల చేశారు.

ఇంక్రిమెట్లు అందజేయాలి
మూడేళ్లుగా ఏపీఎస్‌ఏసీఎస్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు బకాయిలు వెంటనే చెల్లించాలి. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాలు ఉద్ధృతం చేస్తాం.
–కె.భాస్కరరావు,
ఎంఎల్‌టీ సంఘం నాయకుడు, రాజాం.

సమాన వేతనం ఇవ్వాలి
వైద్య శాఖలో ఇతర విభాగాల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఒకే రకం ఉద్యోగుల మాదిరిగానే ఎయిడ్‌ కంట్రోల్‌ సొసైటీలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి. ప్రత్యేక అలవెన్సులు మంజూరు చేయాలి.
– పి.శైలజారాణి, కౌన్సిలర్, రిమ్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement