చంటిబిడ్డతో గిరిజన దంపతులు
నెల్లూరు, గూడూరు: వలంటీర్, సచివాలయ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు గిరిజన దంపతులకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి కలిగింది. శుక్రవారం పోలీసులు, బాధితులు వెల్లడించిన కథనం మేరకు.. గూడూరు మండలం కొత్తతుంగపాళెంలో ఏకోలు రాజా, చందు అనే గిరిజన దంపతులు జీవిస్తున్నారు. చందు తల్లి రమణమ్మ మండలంలోని సంతదాసుపల్లిలో ఓ భూస్వామికి చెందిన తోటలో పనిచేస్తోంది. కొత్తతుంగపాళెంలో పనుల్లేకపోవడంతో రమణమ్మ తన కుమార్తె, అల్లుడిని కూడా ఆ భూస్వామి వద్దకు వచ్చి పనులు చేసుకోవాలని చెప్పింది. మూడేళ్ల క్రితం ఆ దంపతులు భూస్వామి వద్ద పొలం పనులకు కుదిరారు. అతను వారికి రూ.2 వేలు ఇచ్చి నెల రోజుల పాటు గొడ్డుచాకిరీ చేయించుకున్నాడు. అక్కడ పనిచేయలేక దంపతులు బయటపడాలనుకున్నారు. లెక్క చూసి తమకు నగదు ఇస్తే ఊరికి వెళ్లిపోతామని వారు భూస్వామిని కోరారు. దీంతో అతను దురుసుగా మాట్లాడాడని దంపతులు చెబుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో చంటిబిడ్డతో వారు స్వగ్రామానికి చేరుకున్నారు. వారం రోజులు గడిచాక భూస్వామి ఓ మేస్త్రీని తీసుకుని కొత్తతుంగపాళేనికి వెళ్లాడు. పనికి వస్తే రూ.10 వేలు ఇస్తానంటూ ఆశ చూపాడు. గ్రామంలో అప్పులు ఉండడంతో వాటిని తీర్చేందుకు దంపతులు నగదు తీసుకుని మళ్లీ పొలం పనుల్లో చేరారు. రెండేళ్లు పనిచేసినా భూస్వామి విడిచి పెట్టకుండా, రూ.50 వేలు మీరే ఇవ్వాలని చెప్తడంతో ఆయన వద్ద పనిచేయలేమని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో దంపతులు వైఎస్సార్ జిల్లా రాజంపేట సమీపంలోని కొలుపులూరులో బంధువులు ఉండడంతో అక్కడికి వెళ్లిపోయారు.
కొడుకు బాధను చూసి..
దంపతుల ఆచూకీ తెలుసుకున్న భూస్వామి మేస్త్రీని తీసుకుని అక్కడికి వెళ్లాడు. దంపతులను తిడుతూ వాహనంలో ఎక్కించుకుని పనికి తీసుకొచ్చాడు. అప్పటినుంచి వారిని హింసిస్తూ వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాడు. దీంతో రాజా తల్లి వెంకటరమణమ్మ తన కొడుకు దయనీయ స్థితిని కొత్తతుంగపాళెం గ్రామ వలంటీర్ తులసీ దృష్టికి తీసుకెళ్లగా ఆమె చెన్నూరు సచివాలయంలోకి మహిళా పోలీస్ సౌజన్యకు చెప్పింది. వారు గూడూరు రూరల్ ఎస్సై పుల్లారావుకు ఫిర్యాదు చేశారు. ఆయన గురువారం సంతదాసుపల్లి గ్రామానికి వెళ్లి ఆ గిరిజన దంపతులను వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించి తీసుకొచ్చారు. ఆ దంపతులు అధికారులకు ఫిర్యాదు చేసేందుకు శుక్రవారం గూడూరుకు వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూస్వామి పొలంలో తాము చేసిన పనికి నగదు ఇప్పించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment