tribal couple
-
మావటీల జీవితాల్లో వెలుగు తెచ్చారు
‘నాకు అడివింటే చాలా భయం’ అంటుంది బెల్లి. ఆస్కార్ వచ్చిన ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ లో మావటి బొమ్మన్ భార్య ఆమె. భర్తతో కలిసి రఘు అనే పిల్ల ఏనుగును ఆమె సాకుతుంది. దాంతోపాటు ‘అమ్ము’ అనే ఇంకో పిల్ల ఏనుగు బాగోగులను బెల్లి చూస్తుంది. బొమ్మన్ ప్రభుత్వ ఉద్యోగి. బెల్లి కాదు. అయినా సరే భర్త డ్యూటీలో ఆమె భాగం పంచుకుంది. భర్తతో పాటే పసి ఏనుగులను చూసుకుంది. ‘నా భర్తను పులి చంపింది. అప్పటి నుంచి అడివంటే భయం. బొమ్మన్‌ను చేసుకున్నాక కొంచెం భయం పోయింది. పిల్ల ఏనుగుల బాగోగుల్లో పడ్డాక, వాటి వెంట తిరుగుతుంటే అడివంటే భయం పోయింది’ అంటుంది బెల్లి. నీలగిరి (ఊటీ) అడవుల్లో ఉండే ఎలిఫెంట్ క్యాంపుల్లో ఏనుగుల సంరక్షణ మావటీలు చూస్తారు. వీళ్లంతా దాదాపు ఆ ప్రాంత గిరిజనులే. ఏనుగులను చూసుకోవడం మగవారి పనే. అయితే బొమ్మన్ చూసేది పిల్ల ఏనుగులను కనుక వాటి అమాయకత్వానికి ముగ్ధురాలై అమ్ము కూడా వాటితో అనుబంధం పెంచుకుంటుంది. ఆమెకు రఘు, అమ్ము ఎంత మాలిమి అంటే డాక్యుమెంటరీలో అమ్మును పిలిచి ‘ఏయ్... నా ఒడిలో కాదు. పక్కన పడుకో. లేకుంటే దెబ్బలు పడతాయి’ అనంటే ఆ ఏనుగు ఆమె పక్కన మెల్లగా ఒత్తిగిలి పడుకోవడం ముచ్చట గొలుపుతుంది. అమ్ముకు బెల్లి రెండు జడలు వేసి నవ్వుకుంటూ ఉన్నప్పుడు ఈ డాక్యుమెంటరీ ముగుస్తుంది. అయితే బొమ్మన్ వల్ల, అమ్ము వల్ల, ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన కార్తికి వల్ల దేశంలో ఇప్పుడు ఏనుగుల సంరక్షణ గురించి చర్చలు జరుగుతున్నాయి. తమిళనాడు సి.ఎం స్టాలిన్ వెంటనే స్పందించి బొమ్మన్, బెల్లిలను పిలిచి చెరొక లక్ష డబ్బు ఇచ్చి సన్మానం చేశారు. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న 91 మంది మావటీలకు కూడా మనిషికో లక్ష ఇవ్వనున్నారు. వీరి నివాసాల కోసం 9 కోట్లు మంజూరయ్యాయి. అలాగే ఏనుగుల క్యాంపుల కోసం 13 కోట్లు మంజూరయ్యాయి. ప్రేమ, ఆదరణల వల్ల ఎప్పుడూ మంచే జరుగుతుంది. బొమ్మన్, బెల్లిలతో అది మరోసారి రుజువయ్యింది. -
జీఎస్టీ పేరుతో విడతల వారీగా రూ.5.90 లక్షలు కాజేశారు
గూడూరు: పెద్ద మొత్తంలో నగదు గెలుచుకున్నారని ఆశపెట్టి గిరిజన దంపతులను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. రెక్కలుముక్కలు చేసుకొని ఇంటి కోసమని కూడబెట్టుకున్న సొమ్మును దోచేశారు. రూ.12.80 లక్షలు గెల్చుకున్నారని మభ్యపెట్టి.. రూ.5.90 లక్షలు కాజేశారు. ఈ ఘటన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగింది. గూడూరు మండలం పురిటిపాళెంకు చెందిన కమ్మంపాటి మహేష్, లక్ష్మీదేవి.. కొలనుకుదురులో రొయ్యల చెరువుల వద్ద కాపలా ఉంటున్నారు. వారి పెద్ద కుమారుడు చెంచయ్య వరి కోత మిషన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. కుటుంబమంతా కలిసి ఇల్లు నిర్మించుకునేందుకని రూ.2.50 లక్షలు పొదుపు చేసుకున్నారు. ఈ క్రమంలో గతేడాది వినాయక చవితికి ముందు లక్ష్మీదేవికి ఓ ఉత్తరం వచ్చింది. అందులో రూ.12.80 లక్షలు గెల్చుకున్నట్లు ఉంది. ఆ కార్డులో ఉన్న నంబర్‌కు మహేష్, లక్ష్మీదేవి ఫోన్ చేయగా.. అవతలి వ్యక్తి ప్రతి 12 ఏళ్లకు ఒకసారి కంపెనీ ద్వారా కూపన్లు తీస్తామని.. తాజాగా తీసిన లక్కీ డ్రాలో మీకు రూ.12.80 లక్షలు వచ్చాయని చెíప్పి ఫోన్ పెట్టేశాడు. మళ్లీ అదే నంబర్‌కు ఫోన్ చేయగా.. ఆ మొత్తం మీ అకౌంట్లో జమ చేయాలంటే ఆధార్, పాన్‌కార్డు నంబర్లతో పాటు అకౌంట్ వివరాలు వాట్సాప్ చేయాలని సూచించాడు. అనంతరం ఆదాయ పన్ను కింద రూ.20 వేలు తమ అకౌంట్లో వేయాలని చెప్పాడు. దీనిపై మహేష్, లక్ష్మీ ప్రశ్నించగా.. ఆదాయ పన్ను చెల్లించకపోతే అధికారులు, పోలీసులు మిమ్మల్ని ఇబ్బంది పెడతారని నమ్మబలికాడు. దాంతో వారిద్దరూ ఆ వ్యక్తి చెప్పిన అకౌంట్లో డబ్బులు వేశారు. ఈసారి జీఎస్టీ, ఇతర ఖర్చులకు డబ్బులు కావాలని చెప్పాడు. మా వద్ద డబ్బులేదని ఆ గిరిజన దంపతులు మొత్తుకున్నా.. వినకుండా ఫోన్ పెట్టేశాడు. దీంతో వారు చేసేదిలేక తమ వద్ద ఉన్న రూ.2.50 లక్షలతో పాటు అప్పు చేసి మరో రూ.3.40 లక్షలు ఇచ్చారు. అప్పటి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో వారు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మోసగాళ్లు 7585049583, 9831371553 ఈ నంబర్ల నుంచి ఫోన్ చేశారని గిరిజన దంపతులు తెలపగా.. ఇవి కోల్‌కతాకు చెందిన హరిప్రసాద్ అనే వ్యక్తి పేరున ఉన్నట్లు గుర్తించారు. ఎస్పీ ఆదేశాలతో గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాపం గిరిజన దంపతులు
నెల్లూరు, గూడూరు: వలంటీర్, సచివాలయ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు గిరిజన దంపతులకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి కలిగింది. శుక్రవారం పోలీసులు, బాధితులు వెల్లడించిన కథనం మేరకు.. గూడూరు మండలం కొత్తతుంగపాళెంలో ఏకోలు రాజా, చందు అనే గిరిజన దంపతులు జీవిస్తున్నారు. చందు తల్లి రమణమ్మ మండలంలోని సంతదాసుపల్లిలో ఓ భూస్వామికి చెందిన తోటలో పనిచేస్తోంది. కొత్తతుంగపాళెంలో పనుల్లేకపోవడంతో రమణమ్మ తన కుమార్తె, అల్లుడిని కూడా ఆ భూస్వామి వద్దకు వచ్చి పనులు చేసుకోవాలని చెప్పింది. మూడేళ్ల క్రితం ఆ దంపతులు భూస్వామి వద్ద పొలం పనులకు కుదిరారు. అతను వారికి రూ.2 వేలు ఇచ్చి నెల రోజుల పాటు గొడ్డుచాకిరీ చేయించుకున్నాడు. అక్కడ పనిచేయలేక దంపతులు బయటపడాలనుకున్నారు. లెక్క చూసి తమకు నగదు ఇస్తే ఊరికి వెళ్లిపోతామని వారు భూస్వామిని కోరారు. దీంతో అతను దురుసుగా మాట్లాడాడని దంపతులు చెబుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో చంటిబిడ్డతో వారు స్వగ్రామానికి చేరుకున్నారు. వారం రోజులు గడిచాక భూస్వామి ఓ మేస్త్రీని తీసుకుని కొత్తతుంగపాళేనికి వెళ్లాడు. పనికి వస్తే రూ.10 వేలు ఇస్తానంటూ ఆశ చూపాడు. గ్రామంలో అప్పులు ఉండడంతో వాటిని తీర్చేందుకు దంపతులు నగదు తీసుకుని మళ్లీ పొలం పనుల్లో చేరారు. రెండేళ్లు పనిచేసినా భూస్వామి విడిచి పెట్టకుండా, రూ.50 వేలు మీరే ఇవ్వాలని చెప్తడంతో ఆయన వద్ద పనిచేయలేమని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో దంపతులు వైఎస్సార్ జిల్లా రాజంపేట సమీపంలోని కొలుపులూరులో బంధువులు ఉండడంతో అక్కడికి వెళ్లిపోయారు. కొడుకు బాధను చూసి.. దంపతుల ఆచూకీ తెలుసుకున్న భూస్వామి మేస్త్రీని తీసుకుని అక్కడికి వెళ్లాడు. దంపతులను తిడుతూ వాహనంలో ఎక్కించుకుని పనికి తీసుకొచ్చాడు. అప్పటినుంచి వారిని హింసిస్తూ వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాడు. దీంతో రాజా తల్లి వెంకటరమణమ్మ తన కొడుకు దయనీయ స్థితిని కొత్తతుంగపాళెం గ్రామ వలంటీర్ తులసీ దృష్టికి తీసుకెళ్లగా ఆమె చెన్నూరు సచివాలయంలోకి మహిళా పోలీస్ సౌజన్యకు చెప్పింది. వారు గూడూరు రూరల్ ఎస్సై పుల్లారావుకు ఫిర్యాదు చేశారు. ఆయన గురువారం సంతదాసుపల్లి గ్రామానికి వెళ్లి ఆ గిరిజన దంపతులను వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించి తీసుకొచ్చారు. ఆ దంపతులు అధికారులకు ఫిర్యాదు చేసేందుకు శుక్రవారం గూడూరుకు వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూస్వామి పొలంలో తాము చేసిన పనికి నగదు ఇప్పించాలని కోరుతున్నారు. -
వాగు మధ్యలో చిక్కుకొన్న దంపతులు
రాజవొమ్మంగి (రంపచోడవరం): రోజూ మాదిరిగానే పొలం నుంచి వాగు దాటి ఇంటికి వస్తున్న రాజవొమ్మంగి మండలం నెల్లిమెట్ల గ్రామానికి చెందిన ముర్రం రాజబాబు, దేవమ్మలు అనుకోని రీతిలో వాగు మధ్యలో చిక్కుకొన్నారు. వారు ఇరువురు వాగు మధ్యలో గల ఓ చెట్టు ఆసరా చేసుకొని వాగు ఉధృతి తగ్గే వరకు దాదాపు రెండు గంటల పాటు ఆ చెట్టుపైనే వేచి ఉండి చివరికి గ్రామానికి చెందిన యువకుల సహాయంతో క్షేమంగా ఇంటికి చేరారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై ప్రత్యక్షసాక్షుల కథనమిది.. రాజబాబు, దేవమ్మలు పొలం పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వస్తు రోజు మాదిరిగానే తమ గ్రామానికి సమీపాన గల మడేరు వాగు దాటసాగారు. అప్పటికే అదే గ్రామానికి చెందిన కొంత మంది వాగుదాటి అవలివైపు చేరుకోగా రాజబాబు, దేవమ్మలు కూడా వాగు దిగారు. అయితే వారు వాగు మధ్యలోకి వచ్చేసరికి ఉన్నట్టుండి ఉప్పొంగడం గమనించిన దేవమ్మ వాగుమధ్యలో గల చెట్టు పట్టుకొని వాగు ఉధృతి తగ్గే వరకు ఆగుదామని భర్తను కోరింది. దీంతో ఆ చెట్టుపైనే వారిద్దరూ కాసేపు వుండిపోయారు. ఇది తెలుసుకొన్న స్థానిక యువకులు ఈకా నాగరాజు, నయిన రమేష్, పూసం పండుదొర, ముర్రం మల్లుదొరలు హుటాహుటిన వాగు వద్దకు వెళ్లి రాజుబాబు, దేవమ్మలకు తాళ్లు అందజేశారు. వారిని సురక్షితంగా వాగు దాటించడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. సంఘటన స్థలానికి స్థానిక సీఐ నాగదుర్గారావు, ఎస్సై వినోద్ వచ్చి ఆరా తీసి ఎవరికి ప్రమాదం జరగలేదని నిర్ధారించుకొని వెనుదిరిగారు. స్థానికంగా వర్షాలు కురవకపోయినా ఎగువన కురిసే వానలకు ఈ వాగు ఉన్నట్టుండి పొంగుతోంని, ఇది తమకు అలవాటైపోయిందని స్థానికులు అంటున్నారు. గ్రామసమీపాన గల ఈ వాగుపై తాళ్ల వంతెన నిర్మించి తమ ఇబ్బందులు తొలగించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా వాగు మధ్యలో చిక్కుకొన్న ముర్రం రాజుబాబు లాగరాయి పీహెచ్సీలో ఎంపీహెచ్‌ఏగా పనిచేస్తున్నాడు. -
ఆర్థిక ఇబ్బందులే ఉసురు తీశాయా..?
విశాఖపట్నం, హుకుంపేట(అరకులోయ): ఇద్దరూ గిరిజనులే..ఒకరిపై ఒకరు మనసుపడ్డారు. అర్థం చేసుకుని అన్యోన్యంగా కలిసి జీవించాలనుకున్నారు. రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఆర్థిక సమస్యలతో జీవితంపై విరక్తి చెంది బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర సంఘటన గడికించుమండలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ గ్రామంతోపాటు రంగశీలలోనూ విషాదం అలుముకుంది. హుకుంపేట ఎస్ఐ బి.నాగకార్తీక్ జంట ఆత్మహత్య సంఘటను దారి తీసిన వివరాలను విలేకరులకు తెలిపారు. మండలంలోని రంగశీల పంచాయతీ ఇరుకువలసకు చెందిన కొర్రా రామచంద్రరావు(21)సర్వీసు జీపులో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇదే మండలం గడికించుమండకు చెందిన రేణుక(20)ను ప్రేమించి పెద్దల సమక్షంలో రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు వీరి కాపురం సవ్యంగానే సాగింది. ఇంకా పిల్లలు పుట్టలేదు. ఆరునెలల క్రితం రేణుక తన తల్లి వద్ద రూ.లక్షన్నర అప్పుచేసి భర్త రాంచంద్రరావుకు ఇచ్చింది. ఈ సొమ్ముతో జీపు కొనుగోలు చేసి సొంతంగా నడుపుకుని జీవించాలని భావించారు. రాంచంద్రరావు జీపు కొనుగోలు చేయకుండా ఆ డబ్బును దుబారా చేశాడు. ఓ క్రిమినల్ కేసులోనూ ఇరుక్కున్నాడు. పట్టుకెళ్లిన డబ్బులివ్వాలని అత్త ఒత్తిడి చేసేది. నగదు విషయమై భార్య రేణుక పలు సందర్భాల్లో అతడ్ని నిలదీసేది. తరచూ గొడవలు పడేవారు. అలాగే కన్నవారింటికి వెళ్లిపోయింది. దీంతో గడికించుమండలోని అత్తవారింటికి రామచంద్రరావు రావడం మానేశాడు. ఇలా దంపతుల మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో రేణుకను కలిసేందుకు శనివారం రాత్రి 12గంటల సమయంలో రామచంద్రరావు గడికించుమండ వెళ్లాడు. దంపతుల మధ్య తగాదా చోటుచేసుకుంది. అనంతరం భార్య రేణుకను బైక్‌పై ఎక్కించుకుని రామచంద్రరావు వెళ్లిపోయాడు. ఇద్దరూ ఇరుకువలస వెళ్లిపోయి ఉంటారని అంతా భావించారు. ఆదివారం ఉదయానికి గడికించుమండ సమీపంలోని పంట భూముల వద్ద తాగునీటి బావి సమీపంలో రేణుక చున్నీ,సెల్ఫోన్లు కనిపించాయి. అనుమానం వచ్చిన గ్రామస్తులు హుకుంపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ నాగకార్తీక్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గిరిజనులు కర్రల సాయంతో బావిలో గాలించి మృతదేహాలను బయటకు తీశారు. శనివారం రాత్రే ఇద్దరూ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్ఐ నాగకార్తీక్ కుటుంబీకులను ఆరా తీయగా ఆర్థిక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఎస్ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బిచ్చమెత్తి గణపతి లడ్డూను దక్కించుకున్నారు..!
రోజూ బిక్షాటన చేసిన సొమ్మును దాచుకున్న చెంచు జాతికి చెందిన గిరిజన దంపతులు వినాయకుడి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన లడ్డూను వేలంలో దక్కించుకున్న సంఘటన బుధవారం వరంగల్ జిల్లా కురవిలో చోటుచేసుకుంది. చెంచు కాలనీకి చెందిన గడ్డం వెంకన్న, మంగమ్మ దంపతులు వినాయకుడి చేతిలోని లడ్డూను వేలం ద్వారా రూ.26, 116కు తీసుకున్నారు. అప్పుడప్పుడూ కూలీ పనులకు వెళ్తున్నప్పటికీ ఈ దంపతుల ప్రధాన జీవనాధారం భిక్షాటనే. అత్యంత భక్తి ప్రపత్తులతో లడ్డూను దక్కించుకోవడం పట్ల పలువురు అభినందించారు. అనంతరం మేళతాళాల మధ్య గణపయ్యను భద్రచాలం గోదావరి నదిలో నిమజ్జనం చేసేందుకు తరలివెళ్లారు.