సోనియాకు కృతజ్ఞతా సభ | Gratitude meeting to Sonia Gandhi, Telangana Ministers Decision | Sakshi
Sakshi News home page

సోనియాకు కృతజ్ఞతా సభ

Published Sun, Aug 25 2013 4:43 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM

సోనియాకు కృతజ్ఞతా సభ - Sakshi

సోనియాకు కృతజ్ఞతా సభ

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపేందుకు భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఆ ప్రాంతానికి చెందిన మంత్రులు నిర్ణయించారు. సభను ఎక్కడ, ఎప్పుడు నిర్వహించాలన్న అంశాన్ని త్వరలో సమావేశమై ఖరారు చేయనున్నారు. శనివారం సచివాలయంలో మంత్రి కె.జానారెడ్డి చాంబర్లో సమావేశమైన మంత్రులు తెలంగాణ అంశానికి సంబంధించి ఢిల్లీలో నెలకొన్న  పరిణామాలతోపాటు సీమాంధ్రలో, హైదరాబాద్‌లో జరుగుతున్న ఆందోళనల గురించి  చర్చిం చారు. సుదర్శన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సారయ్య, సుదర్శన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, డీకే అరుణ, సునీతా లక్ష్మారె డ్డి తదితరులు పాల్గొన్నారు.  

 విజయోత్సవ సభలు మాత్రం వాయిదా: తెలంగాణ ప్రక్రియ ఢిల్లీలో ముందుకుసాగేలా తమవంతు ప్రయత్నాలపైనా మంత్రులు చర్చిం చారు. పార్లమెంటులో ఎంపీల సస్పెన్షన్ అంశాలపైనా సమీక్షించారు. ఈ పరిణామాలతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ముందుకు కదలకపోవడంతో తెలంగాణ ప్రాంత ప్రజల్లో ఒకింత ఆందోళనకు దారి తీసేదిగా మారుతోందన్న అభిప్రాయానికి వచ్చారు. తెలంగాణబిల్లును సాధ్యమైనంత త్వరగా కేబినెట్ ఆమోదించి పార్లమెంటులో ప్రవేశపెట్టించేలా కేంద్రం పెద్దలతో సంప్రదింపులు జరుపుతుండాలని నిర్ణయించారు. ఢిల్లీలో సీమాంధ్ర నేతలు చేస్తున్న యత్నాలను, కేంద్రంలో నెలకొంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తూ ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. తెలంగాణ  ఏర్పాటుకు మూలకారణం కాంగ్రెస్సేనని, ఈ దిశగా ప్రజల్లో పార్టీ పట్ల మరింత ఆదరణ పెరిగేలా గ్రామాల్లో విస్తృతప్రచారానికి తెరతీయాలని సంకల్పించారు. అయితే తెలంగాణ బిల్లు రాకుండా విజయోత్సవ సభలు నిర్వహించడం సబబుకాదని, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను కాంగ్రెస్సే తీరుస్తోందన్న అంశాన్ని ప్రజలకు చెప్పేందుకు గ్రామాల్లో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో విజయోత్సవ సభలకు బదులు కృతజ్ఞతా సభలను ఎక్కడికక్కడ నిర్వహించుకోనున్నారు. అయితే తెలంగాణ ప్రాంతమంతటికీ కలిపి ఓ భారీ బహిరంగ సభను నిర్వహించి సోనియాకు కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేయించాలని నిర్ణయించారు. ఈనెల 28న మరోసారి సమావేశమై తేదీ, వేదికను ఖరారు చేయనున్నారు.  ఈనెల 27న మహబూబ్‌నగర్‌లో సభ నిర్వహించనున్నట్లు ముందుగానే ప్రకటించినందున ఆ తేదీనే సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి డీకే అరుణ తెలిపారు.


 ఉద్యమాలను సద్దుమణిగేలా చేయండి: సీఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తి
తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆయన చాంబర్లో కలిశారు. సీమాంధ్రలో ఉద్యమం, ఏపీఎన్జీవోలు, జిల్లా స్థాయిఅధికారులు, గ్రూప్-1అధికారులు కూడా సమ్మెకు దిగడం తదితర అంశాలపై ఆయనతో చర్చించారు. సీమాంధ్రలో ఉద్యమాన్ని చల్లబరిచే చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా ఏపీఎన్జీవోలతో సమ్మెను విరమింపచేయాలన్నారు. జిల్లా స్థాయి అధికారులు కూడా సమ్మెకు దిగడం దారుణమని, దీన్ని ఉపేక్షించడం సరికాదని అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆయా సంఘాల నేతలతో సీఎం నేరుగా చర్చించి ఉద్యమాలను సద్దుమణిగేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం కిరణ్ ఏమాత్రం స్పందించకుండా మౌనం దాల్చారని సమాచారం. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం స్వచ ్ఛందంగా వచ్చిందేనని చెప్పి మిన్నకున్నారు. ఈ పరిణామంపై మంత్రులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఉద్యోగులను పిలిచి చర్చించి అపోహలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని మంత్రి శ్రీధర్‌బాబు అభిప్రాయపడ్డారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement